Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైయస్ఆర్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులా?

ys sharmila

వరుణ్

, గురువారం, 25 ఏప్రియల్ 2024 (08:13 IST)
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులా? అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీలో వైయస్ఆర్‌ను బొత్స సత్యనారాయణ తిట్టారు.. తాగుబోతు అన్నారు. జగన్‌కు ఉరిశిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. విజయమ్మను సైతం అవమానపరిచారు. అలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు. జగన్‌ కేబినెట్‌లో ఉన్నవాళ్లంతా వైయస్ఆర్‌ను తిట్టినవాళ్లే. వాళ్లంతా జగన్‌కి తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు. నిజంగా ఆయన కోసం పనిచేసిన వాళ్లు మాత్రం ఏమీ కారు. ఆయన కోసమే పనిచేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్లూ ఏమీ కారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో వైఎస్‌ఆర్‌ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్‌ అంటే సాయిరెడ్డి.. ఆర్‌ అంటే రామకృష్ణారెడ్డి అంటూ ధ్వజమెత్తారు. 
 
ఏపీ న్యాయ యాత్రలో భాగంగా రేపల్లె, పెడన, పామర్రు నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలకు భారీగా తరలివచ్చిన అశేష ప్రజానీకానికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలు నమ్మి ఐదేళ్లు అధికారంలో ఇస్తే..హోదా తెచ్చారా ? రాజధాని కట్టారా.. ? పోలవరం కట్టారా ?.. రాష్ట్రానికి హోదా రావాలి అంటే జగన్ దిగాలి.. కాంగ్రెస్ అధికారంలో రావాలి. పోలవరం కట్టాలి అంటే కాంగ్రెస్ కావాలి.. జగన్ దిగాలి. రాజధాని నిర్మించాలి అంటే కాంగ్రెస్ రావాలి.. జగన్ అధికారం నుంచి దిగాలి. రాష్ట్రాన్ని తన మాయ మాటలతో నిలువునా మోసం చేసినా ఈ జగన్ మోహన్ రెడ్డి మనకి అవసరమా..? అందుకే హస్తం గుర్తుకు ఓటు వేయండి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం అని ఆమె పిలుపునిచ్చారు. 
 
మీ అండదండలతో రాష్ట్రంలో వైయస్ఆర్ సంక్షేమ పాలనను తీసుకొస్తా. గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. వైయస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్ ఆయన ఆశయాలను పట్టించు కోలేదు. వైయస్ఆర్ ఆశయాలు నిలబెట్టాలంటే రైతును రాజు చేయాలి. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు కట్టించాలి. ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే వైయస్ఆర్ వారసులు అవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది.
 
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతామట. మతాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా? మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు..? ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదు ..? రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు. మోడీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదు. ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదం. కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ అంటూ పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్