Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు తిరుమలకు సీఎం జగన్ : ఏపీలో విపక్ష నేతల హౌస్ అరెస్టు

నేడు తిరుమలకు సీఎం జగన్ : ఏపీలో విపక్ష నేతల హౌస్ అరెస్టు
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (13:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తిరుమలలో పర్యటించనున్నారు. అయితే, ఈయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ పర్యటన ఆలస్యం కావడంతో సాయంత్రం 4 గంటలకు జగన్ తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నమయ్య భవన్ నుంచి సీఎం పాల్గొననున్నారు. అనంతరం 6:15 గంటలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బేడీ ఆంజినేయ స్వామి ఆలయం వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు. 
 
మరోవైపు, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుపతికి రానున్న నేపథ్యంలో బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుకుంటారనే ప్రచారంతో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. టీటీడీ పరిపాలన భవనం ముందు బుధవారం నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. ఇందుకోసం జిల్లా నుంచి టీడీపీ ముఖ్యనేతలు తిరుపతికి రావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హౌస్ అరెస్టుల పర్వం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
ముఖ్యంగా, సీఎం జగన్ రాక సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి, అనూష రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తుండటంతో కార్యకర్తలు ఆగ్రహానికి గురవుతున్నారు. జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని బీజేపీ, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, తాము ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని అడగడంలేదని అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని కాపాడాలని అంటున్నామన్నారు. జగన్ జెరూసలేం యాత్రకు వెళ్లినప్పుడు కుటుంబ సమేతంగా వెళతారని, హిందూ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు మాత్రం ఒక్కరే వస్తారని.. దీనికి కారణమేంటని వారు ప్రశ్నించారు. 
 
మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు సంతకం చేశారని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అంటున్నామని, హిందూమతంపై దాడిని ఆపాలని కోరుతున్నామని నేతలు వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు..