Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధానిని ప్రశ్నించకుండా బాబును తిడతారెందుకు పవన్-జగన్?

ప్రధానిని ప్రశ్నించకుండా బాబును తిడతారెందుకు పవన్-జగన్?
, బుధవారం, 10 అక్టోబరు 2018 (15:14 IST)
అమరావతి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా పట్టించుకోవడంలేదంటూ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులివ్వడంలో వివక్ష చూపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడిని, కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్లిద్దరూ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాభీష్టాన్ని గాలికొదిలేసి, రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించడానికే వాళ్లిద్దరూ పోటీపడుతున్నారని మండిపడ్డారు.
 
ఏపీ పునర్విభజన చట్టాన్ని అసుసరించి రాష్ట్రంలో 7 వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఏపీపై ప్రధానమంత్రి నరేంద్రమోడి సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. తెలంగాణాలో ఉన్న 9 వెనుకబడి జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.450 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ నిధులు తెలంగాణ హక్కు అని అన్నారు. ఆ రాష్ట్రం మాదిరిగానే ఏపీకీ హక్కు ఉందన్నారు.. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఏపీలో ఉన్న వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయడంలేదన్నారు. 
 
రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలపై ప్రధాని నరేంద్రమోడి, కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఎందుకింత కక్ష అని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకే కాకుండా రాష్ట్రంలో చేపడుతున్న పోలవరం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నవారికి ఇటువంటి వివక్ష, కక్ష తగదన్నారు.
 
రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయంపై జగన్, పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడంలేదని శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. జగన్ తనకు శత్రువు కాదని పవన్ అనడం సరికాదన్నారు. రాజకీయాల్లో శత్రులెవరూ ఉండరన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పవన్ కల్యాన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(జె.ఎఫ్.సి) ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ రాష్ట్రానికి రూ.75 వేల కోట్లు రావల్సి ఉందని తేల్చి చెప్పిందన్నారు. ఆ కమిటీ సూచనల మేరకు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ ఎందుకు మిన్నకుండిపోతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రాన్ని కాదని సీఎం చంద్రబాబునాయుడును విమర్శించడంలో పవన్ ఉద్దేశమేమిటన్నారు. 
 
ప్రజల కోసం సీఎం చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఆయన కృషిని గుర్తించిన స్వామినాథన్ కమిటీ అవార్డు ప్రకటించిందన్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో ఉన్న ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాయన్నారు. వారిని అభినందించాల్సిందిపోయి, పవన్ విమర్శించడం ఎంతవరకూ సబబు అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో, పవన్ కు ఉన్న అవగాహన ఏమిటని అని ఆయన నిలదీశారు. వెనుబడిన ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... కేంద్ర ప్రభుత్వాని ఎందుకు ప్రశ్నించడంలేదని శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. 5 కోట్ల మంది ప్రజలపై గౌరవముంటే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని, ప్రధాని నరేంద్రమోడిని జగన్, పవన్ కల్యాణ్ నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటే వజ్రాయుధం... ఓటు వేయకపోతే?