Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనసేనలోకి మాజీ సీఎస్... అనుభవలేమిని ఎత్తిచూపించాలని కోరిన పవన్

జనసేనలోకి మాజీ సీఎస్... అనుభవలేమిని ఎత్తిచూపించాలని కోరిన పవన్
, మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:55 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుడుగా తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరేందుకు అనేక మంది రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఇందులోభాగంగా, మొన్నటివరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేసిన పి.రామ్మోహన్ రావు తన కుటుంబంతో కలిసి జనసేనలో చేరారు. ఈయన కమ్మ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయనకు పవన్ పుష్పగుచ్ఛం ఇచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
 
ఆ తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రామ్మోహన్ రావు జనసేనలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన్ను తన రాజకీయ సలహాదారుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. రామ్మోహన్ రావుకు పబ్లిక్ పాలసీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. తమిళనాడు ప్రభుత్వం రూపొందించి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పనలో రామ్మోహన్ రావు పాలుపంచుకున్నారనీ, అలాంటి వ్యక్తి తమ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. 
 
ముఖ్యంగా, జయలలిత ఆస్పత్రిలో చేరి కోమాలో ఉన్న సమయంలో, ప్రభుత్వ పాలనను సమర్థంగా నడిపంచారన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయన ఏమాత్రం తొణకకుండా పాలన చేశారన్నారు. పైగా, తమిళనాడు రాజకీయాల్లో అపారమైన అనుభవం, పరిణితి ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాలకు దిశానిర్దేశం చేశారన్నారు. 
 
అలాంటి రామ్మోహన్ రావు తనతో కలిసి ప్రయాణం చేయాలని ముందుకురావడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, ఎంతో అనుభవం కలిగిన రామ్మోహన్ రావు రాజకీయ సలహాదారుగా ఇచ్చే సూచనలు, సలహాలను స్వీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే, తనలోని అనుభవలేమిని ఎత్తిచూపాలని రామ్మోహన్ రావును పవన్ కళ్యాణ్ కోరారు. 
 
అయితే, జనసేన పార్టీలో రామ్మోహన్ రావు చేరడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో రామ్మోహన్ రావు ఇంటిపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బ్యూరోక్రాట్‌పై సీబీఐ సోదాలు చేయడం అనేది దేశంలోనే తొలిసారి. ఈ సోదాలు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. పైగా, ఈయన భారీగానే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు లేకపోలేదు. అలాంటి వ్యక్తిని తన రాజకీయ సలహాదారుగా పవన్ కళ్యాణ్ నియమించుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామంటూ ప్రకటనలు చేస్తున్న పవన్.. చివరకు తన పక్కన అవినీతి పరులకే కీలక బాధ్యతలు అప్పగించడాన్ని అనేక మంది జీర్ణించుకోలేక పోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని ఎదురుగా మహిళ నడుముపై చేయి వేసిన క్రీడల మంత్రి...