Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జీరో ధర టికెట్ల జారీ

free tickets
, శుక్రవారం, 15 డిశెంబరు 2023 (08:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి జీరో ధర టిక్కెట్లను జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టిక్కెట్ తీసుుకుని ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రయాణ సమయంలో ఖచ్చితంగా తెలంగాణ చిరునామాతో కూడిన ఆధార్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో గురువారం సజ్జనార్ వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి జీరో టిక్కెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని ఆర్టీసీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా పథకం అమలవుతోందని, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్‌వేర్, సంస్థ అప్ డేట్ చేసిందన్నారు. 
 
సాఫ్ట్‌వేర్‌ టిమ్ మెషిన్లలో ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించారు. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టిక్కెట్‌ను పొందవచ్చునన్నారు.
ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, హిజ్రాలు ఉపయోగించుకోవాలని సూచించారు. 
 
మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్‌వేర్‌ను అప్ డేట్ చేసి.. అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను సజ్జనార్ అభినందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజ