Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయండి... ఈ ఏడాది తగ్గినా...

అమరావతి : రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పెద్దపీట వేయాలని, ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం రోడ్లు, భవనాల శాఖ, రవాణా శాఖ, పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్డ

రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయండి... ఈ ఏడాది తగ్గినా...
, బుధవారం, 29 ఆగస్టు 2018 (18:35 IST)
అమరావతి : రాష్ట్రంలో రోడ్డు భద్రతకు పెద్దపీట వేయాలని, ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం రోడ్లు, భవనాల శాఖ, రవాణా శాఖ, పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందజేసే విధంగా పోలీసులకు శిక్షణనిప్పించాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. 
 
గతేడాది జులై కంటే ఈ ఏడాది జులై నాటికి రోడ్డు ప్రమాదాలు 11.41 శాతం మేర తగ్గుముఖం పట్టాయన్నారు. వాటిలో మరణాలు 10.79 శాతం, క్షతగాత్రుల సంఖ్య 15.98 శాతం మేర తగ్గాయన్నారు. నెల్లూరు, గుంటూరులో అత్యధికంగా యాక్సిండెంట్లు చోటుచేసుకున్నాయన్నారు. జాతీయ రహదారుల విషయానికొస్తే, గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ప్రమాదాలు అధికంగా చోటుచేసుకున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నెలనెలా జిల్లా రోడ్డు భద్రత కమిటీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. 
 
పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు 418 బ్రీత్ అనలైజర్స్, 49 స్పీడ్ గన్లు, 13 వాహనాలు సమకూర్చమన్నారు. బ్రీత్ అనలైజర్స్, స్పీడ్ గన్ల వినియోగంపై ఇప్పటికే వారికి శిక్షణ అందజేశామన్నారు. రోడ్డు భద్రతకు తీసుకున్న చర్యలు కారణంగా, వాహనాల ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు. లారీ ప్రమాదాలు గతేడాది జులై నాటికి 1,040 చోటుచేసుకోగా, ఈ ఏడాది జులై నాటికి 971 జరిగాయన్నారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాల సంఖ్య గతేడాది 1,411 కాగా, ఈ ఏడాది 1,273కు తగ్గాయన్నారు. త్రి చక్ర వాహనాల ప్రమాదాలు 482 నుంచి 378కు తగ్గాయన్నారు. ఇతర వాహనాల ప్రమాదాలు 845 నుంచి 739కు తగ్గుముఖం పట్టాయని వివరించారు. 
 
ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నెల్లూరు, గుంటూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే, 5 జిల్లాల్లో జాతీయ రహదారుల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జిల్లాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా ఆటోలు, ద్విచక్ర వాహనాల వల్లే చోటుచేసుకుంటున్నాయన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్ ఆదేశించారు. హెల్మెట్ల వినియోగంపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు. దీనివల్ల ద్విచక్ర వాహనాల వల్ల కలిగే ప్రమాదాలకు అడ్డుకట్టవేయొచ్చునన్నారు. 
 
డ్రంకన్ డ్రైవ్, ఫోన్లో మాట్లాడుతూ వాహనాల నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి నెలా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ, రవాణా శాఖ, పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. స్పీడ్ గన్లు, రోడ్డు కెమెరాల ద్వారా వాహనాల అతివేగాన్ని అడ్డుకట్టవేయాలన్నారు. అతివేగంగా వెళ్లే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ఆ శాఖ ఎం.డి.ని, స్కూల్ బస్సుల కండీషన్లు ఎప్పటికప్పుడు పరీక్షించాలని రవాణా శాఖాధికారులను ఆదేశించారు. 
 
జాతీయ, రాష్ట్రానికి చెందిన హైవేలపై గుంతలను గుర్తించి, వాటిని ఎప్పటికప్పుడు పూడ్చాలన్నారు. లైసెన్సుల జారీకి అవసరమైన ట్రాక్‌ల నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలన్నారు. పోలీసు వాహనాలకు 108 వాహనాల మాదిరిగా జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం చేయాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధను ఆదేశించారు. దీనివల్ల ఏ వాహనం ఎక్కడుంది అనే విషయం స్పష్టమవుతుందన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనాలను తక్షణమే పంపించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ట్రామా కేర్ సెంటర్లు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం మరో 13 సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 
 
ఇందుకోసం నేషనల్, స్టేట్ హై వేలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను ట్రామా కేర్ సెంటర్లగా గుర్తించాలన్నారు. తక్షణమే నేషనల్, స్టేట్ హై వేలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను గుర్తించాలని సీఎస్ ఆదేశించారు. పోలీసులకు ప్రథమ చికిత్స సేవలు అందజేసేలా శిక్షణివ్వాలన్నారు. దీనివల్ల ప్రమాదాల సమయంలో ముందుగా చేరుకునే పోలీసులు... క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందజేసే అవకాశం కలుగుతుందన్నారు. దీనివల్ల మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్నారు. రోడ్లు, భవనాల శాఖ, రవాణా శాఖ, పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖాధికారులు సమన్వయంతో పనిచేస్తూ, రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు అడ్డుకట్టవేయాలని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊర్కో బిడ్డా... ఎన్టీఆర్‌కు కేసీఆర్ ఓదార్పు... (ఫోటోలు)