Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రానికి, దేశానికి పట్టిన దెయ్యం నరేంద్ర మోడీ... ఎవరు?

రాష్ట్రానికి, దేశానికి పట్టిన దెయ్యం నరేంద్ర మోడీ... ఎవరు?
, శుక్రవారం, 2 నవంబరు 2018 (16:31 IST)
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రానికి, దేశానికి పట్టిన దెయ్యంగా ఏపీ శాసన మండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ అనుసరించే విధానాల వల్ల రాష్ట్రం, దేశం అధోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మన పెద్దలు పోరాడి సాధించిన స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి అమిత్ షా, మోడీ కలిసి విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. 
 
దేశానికి మోడీ రూపంలో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ పరిస్థితులలో  రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమైనట్లు తెలిపారు. ఆ నాడు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఎన్టీఆర్ ముందుకొచ్చారని గుర్తు చేశారు. ఈనాడు ఏపీకి జరుగుతున్న అన్యాయానికి, మోడీ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకొచ్చారన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ.40వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించే వీరా దేశ భక్తి గురించి మాట్లాడేది అని ఆయన ప్రశ్నించారు.
 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే ఎంత దురుసుగా సమాధానం చెప్పారో అందరికీ తెలుసన్నారు. సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసే విధంగా రాష్ట్రానికి రావలసిన నిధులు రాకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలతో కలిసి రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నరని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్, నూతన రాజధాని అమరావతి నిర్మాణాలకు ఆటంకాలు కల్పిస్తున్నారన్నారు.
 
దేశంలో ఇంతకుముందు ఎప్పుడూ తలెత్తని కొత్త సమస్యలు మోడీ పాలనలో ఎదురవుతున్నట్లు ఉదాహరణలతో సహా ఆయన వివరించారు. జడ్జీల వివాదం, సీబీఐ అధికారుల వివాదం, రిజర్వు బ్యాంకు సంక్షోభం, పత్రికా స్వేచ్ఛపై దాడి... వంటివి అనేకం మోడీ హయాంలో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితులలో నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మాభిమానం కోసం నిలిచే చంద్రబాబు నాయకత్వం దేశానికి మార్గదర్శకత్వంగా నిలుస్తుందన్నారు. ఆయన పాలనానుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మోడీ మళ్లీ రాకుండా, దేశానికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో దేశభక్తి కలిగిన నాయకునిగా, దేశాన్ని రక్షించవలసి బాధ్యతతో ముందుకు వెళుతున్నట్లు మాణిక్యవరప్రసాద్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుతో పాటు ఆరు భాషల్లో డిజిటల్‌ లిటరసీ లైబ్రరీ- ఫేస్‌బుక్‌