Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిలాడీ తల్లీకూతుళ్ళు.. ముగ్గురు ఎన్ఆర్ఐలతో పెళ్ళి.. ఆ తరువాత..?

బాగా బతికిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కట్టుకున్న భర్త చనిపోవడంతో భార్య, కుమార్తె ఇద్దరూ విషాదంలో మునిగిపోయారు. తండ్రి సంపాదించిన డబ్బుతో లగ్జరీ జీవితాన్ని అనుభవించిన కుమార్తె ఆయన మరణం తరువాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఏం చేయాలో

కిలాడీ తల్లీకూతుళ్ళు.. ముగ్గురు ఎన్ఆర్ఐలతో పెళ్ళి.. ఆ తరువాత..?
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (12:54 IST)
బాగా బతికిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కట్టుకున్న భర్త చనిపోవడంతో భార్య, కుమార్తె ఇద్దరూ విషాదంలో మునిగిపోయారు. తండ్రి సంపాదించిన డబ్బుతో లగ్జరీ జీవితాన్ని అనుభవించిన కుమార్తె ఆయన మరణం తరువాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఇద్దరు కలిసి కిలాడీలుగా మారిపోయారు. డబ్బులను ఈజీగా సంపాదించడం నేర్చుకున్నారు. ఇంతకీ ఎవరా కిలాడీలు.
 
గుంటూరు నగరానికి చెందిన పూర్ణవల్లి కుమార్తె దీప్తి. అనారోగ్యంతో నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయాడు. తండ్రి బతికి ఉన్న సమయంలో వీరి కుటుంబం జల్సాగా బతికింది. అయితే ఆయన మరణం తరువాత వీరి కుటుంబం రోడ్డుపై పడింది. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన తల్లీకూతుళ్ళలో కలిగింది. తల్లి పూర్ణవల్లి ఇచ్చిన సలహాతో దీప్తి ఒక నకిలీ ఇనిస్టిట్యూట్ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇస్తానని చెప్పి భారీగా వారి వద్ద డబ్బులను వసూలు చేసింది. కొన్ని నెలలకు ఆ ఇనిస్టిట్యూట్‌ను మూసేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్టేషన్‌కు వెళ్ళారు. గుంటూరు నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న చిలకలూరిపేటకు వెళ్ళిన తల్లీకూతుళ్ళు ఈసారి ఏకంగా ఎన్ఆర్ఐ బ్యాచిలర్స్‌కు వల వేశారు. 
 
అందులో మొదటి వ్యక్తి మలేషియాకు చెందిన బాలు. చాటింగ్ ద్వారా బాలును లైన్‌లో పెట్టిన దీప్తి అతడిని హైదరాబాద్‌కు రప్పించి పెళ్ళి చేసుకుంది. పెళ్ళి చేసుకున్న నెలరోజులకే దీప్తి ఇనిస్టిట్యూట్ వ్యవహారం బయటపడింది. దీంతో బాలు తన లాయర్‌ను తీసుకొచ్చి తల్లీకూతుళ్ళకు బెయిల్ ఇప్పించాడు. ఆ తరువాత దీప్తిని వదిలి మలేషియాకు వెళ్ళిపోయాడు. మొదటి భర్తను వదిలేసిన దీప్తి రెండవసారి లండన్‌కు చెందిన శేఖర్‌తో చాట్ చేసి అతన్ని కూడా పెళ్ళి చేసుకుంది. సంవత్సరం పాటు ఎవరికీ అనుమానం రాకుండా అతని నుంచి బాగా డబ్బులను తీసుకుంది. ఆ తరువాత ఒకరోజు మొదటి భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. దీన్ని చూసిన శేఖర్ నివ్వెరపోయాడు. దీప్తిని ప్రశ్నించాడు. అయితే ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో లండన్‌కు వెళ్ళిపోయాడు శేఖర్.
 
ఇక మూడవ వ్యక్తి ఆస్ట్రేలియాకు చెందిన రాజేష్. ఇతన్ని కూడా చాటింగ్ ద్వారా లైన్‌లో పెట్టిన దీప్తి హైదరాబాద్‌కు వస్తే పెళ్ళి చేసుకుందామంది. వారంరోజుల పాటు సెలవు పెట్టి హైదరాబాద్‌కు వచ్చిన రాజేష్‌తో నిశ్చితార్థం చేసుకుంది దీప్తి. నెలరోజుల్లో పెళ్ళి చేసుకుందామని, పెళ్ళి పనులు మొత్తం నేనే చేసుకుంటానని చెప్పి రాజేష్‌ ఎటిఎం కార్డు తీసుకొని అందులో పది రోజుల్లో 2 లక్షల రూపాయలను డ్రా చేసేసింది. దీంతో రాజేష్‌కు అనుమానం వచ్చింది. హైదరాబాద్ లోని తన స్నేహితుని సహకారంతో దీప్తి, ఆమె తల్లి గురించి ఆరా తీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. తాను మోసపోయాయన్న విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేష్ ఫిర్యాదుతో తల్లీకూతుళ్లను అరెస్టు చేశారు పోలీసులు. ఇలా కిలాడీ లేడీల బాగోతం బయటపడింది. సామాజిక మాధ్యమాలతో యువకులను ఇలా ఈజీగా యువతులు మహిళలు మోసం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

90 యేళ్ళ వయసులో పీహెచ్‌డీ.. స్వాతంత్ర్య సమరయోధుడు రికార్డు