Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌ని అందుకే లొంగదీసారు.. తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్

ఒక ఆర్థిక ఉగ్రవాదికి ప్రధాని ఎలా అప్పాయింట్మెంట్ ఇస్తారంటూ మోదీ-వైఎస్ జగన్ భేటీపై తెలుగుదేశం నాయకులు కారాలు మీరటం చూస్తుంటే వీళ్లకు ఢిల్లీ రాజకీయాలు ప్రధానంగా బీజేపీ ఆధిష్టానం మనోగతం ఏకొంచెమైనా అర్థమవుతోందా అనే సందేహం కలుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత మ

జగన్‌ని అందుకే లొంగదీసారు.. తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్
హైదరాబాద్ , సోమవారం, 15 మే 2017 (05:14 IST)
ఒక ఆర్థిక ఉగ్రవాదికి ప్రధాని ఎలా అప్పాయింట్మెంట్ ఇస్తారంటూ మోదీ-వైఎస్ జగన్ భేటీపై తెలుగుదేశం నాయకులు కారాలు మీరటం చూస్తుంటే వీళ్లకు ఢిల్లీ రాజకీయాలు ప్రధానంగా బీజేపీ ఆధిష్టానం మనోగతం ఏకొంచెమైనా అర్థమవుతోందా అనే సందేహం కలుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వాలు ఎలా ఉండవో, శాశ్వత శత్రుత్వాలు కూడా అలాగే ఉండవు అనే విషయం టీడీపీ నేతలకు తెలీదా అనే సందేహం కూడా పుట్టుకొస్తోంది.

ఇప్పటికే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకుని, కేళలలో కూడా తొలిసారిగా పట్టు సాధించిన బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలను ఓ పట్టు పట్టాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్న వైనాన్ని టీడీపీ గ్రహించిందా లేదా అనే సందేహం కూడా ఏర్పడుతోంది. పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, భవిష్యత్తును చంద్రబాబుకు పూర్తిగా వదిలేయడం ఇష్టపడిని మోదీ-అమిత్‌షా ద్వయం టీడీపీకి చెక్ పెట్టడానికి కూడా సిద్ధపడి జగన్‌ను లొంగదీసుకుందని స్పష్టంగా తెలుస్తోంది. 
 
కాబట్టి ఇప్పుడు ఇక విశ్లేషణ జరగాల్సింది ఆర్థిక ఉగ్రవాదిని మోదీ ఎలా కలుస్తారు అనే అంశంపై కాదు. ఏ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు మోదీ అప్పాయింట్‌మెంట్ ఇచ్చారన్నది ఇప్పుడు ముఖ్యం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే జూన్‌లో తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించడంపై గుర్రుగా ఉన్న మోదీ-–షా ద్వయం అతడిని ఒక పట్టుపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో జగన్మోహన్‌రెడ్డిపై దాఖలైన కేసుల విషయంలో అటు సీబీఐ, ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చురుగ్గా వ్యవహరించడం దాని ఫలితమే కావచ్చు. 
 
పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయని గమనించిన జగన్‌ సహ నిందితుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఆ తర్వాతే జగన్మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ మాత్రం లభించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్‌రెడ్డి విధించిన గడువు మరో 15 రోజులలో ముగుస్తుంది. ప్రత్యేక హోదా ఎలాగూ రాదు గనుక చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేయవలసి ఉంటుంది. ఇంతలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జగన్‌ కలుసుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
 
మహామహులే మోదీ అధికారం ముందు సాగిలపడుతుంటే, అవినీతి కేసులలో చిక్కుకున్న తాము ఎంత అని ఆయన భావించి ఉండవచ్చు. నరేంద్ర మోదీతో పెట్టుకున్నవారికి ఏమవుతున్నదో చూస్తున్నారు కనుక జగన్మోహన్‌రెడ్డి మనసు మార్చుకుని ఉంటారు. అలా తనపై విచారణలో ఉన్న కేసుల నుంచి బయటపడగలిగితే వచ్చే ఎన్నికలు కాకపోతే, ఆపై ఎన్నికల నాటికి బలపడవచ్చునన్నది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం కావచ్చు.  ఇప్పుడున్న పరిస్థితులలో నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తే భవిష్యత్తు సంగతి దేవుడెరుగు- వర్తమానం కూడా ఉండదని జగన్‌ భయపడిపోయి ఉండవచ్చు. అవినీతి కేసులలో జగన్‌కు శిక్ష పడితే ఆయన బెడద తమకు వదిలిపోతుందని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశలపై మోదీ- జగన్‌ల కలయిక నీళ్లు కుమ్మరించింది. 
 
చంద్రబాబుకు ఏదో ఒక విధంగా చెక్‌ పెడుతూ ఉండటం కోసమే బీజేపీ కేంద్ర పెద్దలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని దగ్గరకు తీసుకుని ఉండవచ్చు. చంద్రబాబు ఎలాగూ తమ అదుపులోనే ఉన్నారు కనుక జగన్‌ను కూడా తమ పంచకు చేరేలా చేసుకుంటే ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునన్నది బీజేపీ వ్యూహం అయి ఉండవచ్చు. ఏపీలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలతో మోదీ-షా ద్వయం దాగుడుమూతలాట ప్రారంభించింది. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామాలు చంద్రబాబుకు మింగుడుపడనివే.. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నగదిలోంచి వందల కోట్ల లావాదేవీలు.. కనిపెట్టలేని బ్యాంకులు.. ఇదే హవాలాకు లైసెన్స్