Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీకంలో ఐటీఎ చెన్నై టు కైలాసకోన యాత్ర

కార్తీకంలో ఐటీఎ చెన్నై టు కైలాసకోన యాత్ర
WD
కైలాసకోనగా పిలువబడే కైలాసనాథ కోన చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు సమీపంలో నెలకొని ఉంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ నిరంతరం కొండలపై నుంచి జాలువారే జలపాతం. కొండకోనలతో ముచ్చట గొలిపే ఈ కైలాస కోన ఎంతో ఆహ్లాదకరమైన ప్రాంతం. భక్తులకు కనువిందుచేసే ఎత్తైన పచ్చని కొండలు, కోయిల రాగాల ప్రతిధ్వనులు భక్తిపారవశ్యాన్ని నింపుతాయి.

గత ఆదివారం మా ఇండియన్ తెలుగు అసోసియేషన్ తరపున రెండు బస్సుల్లో కార్తీకమాసం సందర్భంగా కైలాసకోన యాత్ర సాగింది. చెన్నై మహానగరంలోని ప్రముఖ వ్యక్తుల దగ్గర్నుంచి పాత్రికేయులు ఇలా.. వివిధ వృత్తులకు సంబంధించిన మొత్తం 70 మందికి పైగా యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు రవాణా సౌకర్యాన్ని మద్రాస్ హైకోర్టు గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ అడ్వకేట్ కె. రవీంద్రనాథ్ చౌదరిగారు ఏర్పాటు చేశారు.

చెన్నై త్యాగరాయనగర్ నుంచి ప్రారంభమైన మా యాత్ర నాన్-స్టాప్‌గా కైలాసకోనకు చేరింది. మాట్లాడుకుంటుండగానే మేము చేరుకోవలసిన యాత్రా స్థలానికి వచ్చాం. బస్సు నుంచి దిగేలోపే కోతుల దండు మా బస్సు ముందు బైఠాయించింది. మా వెంట తెచ్చుకున్న పదార్థాలను వాటి ముందు పెట్టిన తర్వాత కానీ అవి అక్కడ నుంచి కదిలలేదు.

కైలాసకోనలో దిగిన మేము వడివడిగా అల్పాహారాన్ని ముగించుకుని అతిథి గృహం నుంచి నేరుగా జలపాతం వైపు నడిచాము. ఎత్తైన కొండలపై నుంచి అనేక ఔషధీ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ 100 అడుగుల పైనుంచి పడే జలపాతపు నీటిలో పుణ్యస్నానాలకు ఉపక్రమించాము. అక్కడ ఎన్ని గంటలైనా అలా పుణ్యస్నానాలు చేయాలనిపిస్తుంది.

ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న విశ్వాసం కూడా ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే ఇక్కడి ప్రకృతిని వర్ణించడం కంటే చూసి ఆస్వాదించాల్సిందే. ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి ఉంటుంది. ముఖ్యంగా కైలాసకోనలోని జలపాతంలో పుణ్యస్నానాలు ఆచరించడం ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. చలికాలంలో కాస్త చల్లగా ఉంటుంది కానీ, వేసవి ప్రారంభ దశలో వెళితే బావుంటుంది.

పుణ్యస్నానాలు ముగించుకున్న అనంతరం మేమంతా తిరిగి అతిథి గృహానికి చేరుకునేసరికి నగరి ప్రజారాజ్యం పార్టీ చీఫ్ శ్రీ గుణశేఖర్‌గారు మాకు భోజన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా వంటకాల రుచిని చూపించారు. భోజనం ముగిసిన పిదప టెలివిజన్ ఆర్టిస్ట్ టంగుటూరి రామకృష్ణ, డాక్టర్ శివకుమారి చక్కటి కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఇందులో ఏకపాత్రాభినయం, నృత్యం, మిస్టర్ కైలాసకోన, మిస్ కైలాసకోన, పాండవుల వనవాసంపై డిబేట్, చీటీలు తీసి అందులో రాసి ఉన్నదాని ప్రకారం చేయడం వంటివి చాలా సరదాగా సాగిపోయాయి.
webdunia
WD


ఈ ఆటపాటల్లో గెలుపొందినవారు, పాల్గొన్నవారికి ఐటీఎ బహుమతులు అందజేసింది. పిల్లలు, పెద్దలు కలిసిపోయి గడిపిన మధురక్షణాలను కైలాసకోన యాత్ర మిగుల్చుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా క్షణం తీరికలేకుండా నగర జీవితాన్ని గడుపుతున్న చెన్నైలోని తెలుగువారికి మా సంస్థ ఐటీఎ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక విహార యాత్ర కొత్త ఉత్సాహాన్ని నింపిందని అందరూ చెప్పడంతో భవిష్యత్తులో ఇటువంటి యాత్రలను మరిన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకోవడమే కాదు.. అమలుచేస్తాం.

- నగేష్ (ఇండియన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు)

Share this Story:

Follow Webdunia telugu