Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయలవారి స్వర్ణయుగ వైభవ చిహ్నం "చంద్రగిరి"

రాయలవారి స్వర్ణయుగ వైభవ చిహ్నం
FILE
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో "చంద్రగిరి" స్వర్ణయుగ వైభవంతో అలరారింది. రాయలవారి పాలనలో ఇక్కడ రత్నాలు రాసులుగా పోసి విక్రయించారని చెబుతుంటారు. ఆనాటి వైభవాన్ని చాటుతూ ఠీవిగా నిలుచున్న శత్రుదుర్భేద్యమైన "చంద్రగిరి కోట" చిత్తూరు జిల్లాలో ఉంది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి పట్టణానికి సమీప దూరంలో ఉన్న చంద్రగిరి వద్ద నిర్మితమైన ఈ కోట ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది.

కార్వేటి నగరాధీశులైన ఉమ్మడి నరసింహరాయులు చంద్రగిరి కోటను తొలుత నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నరసింహరాయులు నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తుండేవాడు. అయితే నారాయణగిరిలో శత్రుభయం ఎక్కువగా ఉన్నందున తన రాజధానిని చంద్రగిరికి మార్చుకున్నాడు.

నరసింహరాయలు ఒకరోజు తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకుని బయటికి రాగానే.. ఆయన నెత్తిపైనున్న తలపాగాను గద్ద ఒకటి తన్నుకుపోయిందట. దీంతో రాజభటులు గ్రద్ధను వెంబడించగా, అది చంద్రగిరి అడవిదాకా వెళ్లి ఒక ప్రాంతంలో దాన్ని జారవిడిచిందట. తలపాగాను దొరకబుచ్చుకున్న రాజభటులు ఈ విషయాన్నంతా రాజుకు వివరించారట. తన రక్షణకోసం ఒక మంచి కోట నిర్మించేందుకు అనువైన స్థలాన్ని చూపించేందుకు ఆ శ్రీవారే ఇలా చేసి ఉంటారని భావించిన ఆయన అక్కడ కోటను నిర్మించినట్లు తెలుస్తోంది.
ఉప్పుసట్టి.. పప్పుసట్టి..!
చంద్రగిరి కోటను నిర్మించిన కొండమీద "ఉప్పుసట్టి", "పప్పుసట్టి" అనే కోనేరులు చూడదగ్గ ప్రాంతాలు. అలాగే "దుర్ఘం" అని పిలువబడే ఎత్తైన సన్నటి బండ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆరోజుల్లో తప్పుచేసినవారికి మరణ దండన విధించే ఉరిస్తంభం కూడా అక్కడే...
webdunia


అలా క్రీస్తు శకం 1000 సంవత్సరంలో చంద్రగిరి కోట నిర్మించబడింది. క్రీస్తు శకం 1486 నుంచి 1489 వరకు శాలువ నరసింహరాయుల పాలనలో చంద్రగిరి కోట ప్రసిద్ధిగాంచింది. రాక్షస-తంగడి యుద్ధం తరువాత విజయనగర రాజులు తమ రాజధానిని హంపీ నుంచి చంద్రగిరికి మార్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఆ తరువాత 1584-1614 ప్రాంతంలో అరవీటి వంశపురాజులు, 1645 ప్రాంతంలో గోల్కొండ సుల్తానులు, 1758లో కర్నూలు నవాబు సోదరుడైన అబ్దుల్ నవాబ్‌ఖాన్‌ల అధీనంలో చంద్రగిరి కోట ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఎంతోమంది రాజుల పాలనకు సాక్షీభూతంగా నిలిచిన ఈ చంద్రగిరి కోటలో రాజమహల్, రాణిమహల్ అనే రెండు ప్రధాన రాజప్రాసాదాలు ఉన్నాయి.

వీటిలో రాజమహల్ దాదాపు 160 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో 95 అడుగుల ఎత్తుతో అత్యంత సుందరంగా నిర్మించబడింది. ఇంత పెద్ద కోట నిర్మాణంలో ఎక్కడ కూడా కలప వినియోగించక పోవటం ఈ కోట ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ కోటను సున్నం, ఇసుక, పెద్దసైజు రాళ్లను మాత్రమే నిర్మాణంలో ఉపయోగించారు. హిందూ, మహమ్మదీయ వాస్తు రీతులను తలపించే విధంగా ఈ కోట నిర్మాణం జరిగింది.

1988వ సంవత్సరం నుండి రాజమహల్‌లో మ్యూజియంను ప్రారంభించారు. అలాగే పురావస్తు సంగ్రహాలయం పేరుతో రాయలసీమ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో దొరికిన విగ్రహాలను, సామగ్రి ఇందులో భద్రపరిచారు. కోట గోడచుట్టూ అద్భుతమైన ప్రహరీగోడ నిర్మించబడింది. ఈ గోడను పెద్దరాళ్లతో నిర్మించారు.

ఇక రాణీ మహల్ చాలా వరకు పాడయిపోయిందనే చెప్పవచ్చు. పేరుకే రాణీమహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు కానీ దీని వాస్తునుబట్టి ఇది ఒక గుర్రపుశాల కావచ్చని అక్కడి బోర్డులో రాసి ఉంది. పురావస్తు శాఖ అధీనంలోకి వచ్చిన తరువాత కొంత వరకూ దీనిని బాగు చేశారు. రాణీమహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాలకోసం ఒక దిగుడు బావి ఉంది. దీనినుండే అంతఃపుర అవసరాలకు నీటిని సరఫరా చేసేవారని తెలుస్తోంది.

అలాగే చంద్రగిరి కోటను నిర్మించిన కొండమీద "ఉప్పుసట్టి", "పప్పుసట్టి" అనే కోనేరులు చూడదగ్గ ప్రాంతాలు. అలాగే "దుర్ఘం" అని పిలువబడే ఎత్తైన సన్నటి బండ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆరోజుల్లో తప్పుచేసినవారికి మరణ దండన విధించే ఉరిస్తంభం కూడా అక్కడే ఉంటుంది. పలు మండపాలతోపాటు వైష్ణవ శివాలయాలు, అక్కదేవతల ఆలయాలు, పాలబావి, దిండుబావి లాంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయి.

అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. ఇలా నిర్మించటం వలన కోట రక్షణ కొండ ప్రాంతంవైపుగా తగ్గగలదనీ.. కొండపైనుండి శత్రువుల కదలికలను దూరంనుండి గమనించుట సులభం కాబట్టి కొండ ప్రక్కగా దీనిని నిర్మించారనీ మ్యూజియంలోని సమాచారముద్వారా తెలుస్తోంది.

కోట చుట్టూ దాదాపు కిలో మీటరు దృడమైన గోడకలదు ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ళ పరిమాణం చాలా పెద్దది. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది. ఈ గోడ పొదల తుప్పల మద్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉన్నది. ఈ గోడననుసరిస్తూ బయటి వైపుగా పెద్ద కందకం ఉంది. ప్రస్తుతం ఇది పూడిపోయిననూ ఆరోజుల్లో, అందులో మొసళ్ళను పెంచే వారట...!

ఎంతో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ కోటలో రాజమహల్ మినహా మిగిలిన ప్రదేశాలన్నీ నేడు శిథిలమైపోతున్నాయి. పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆనాటి సంస్కృతి, సాంప్రదాయాలకు, చారిత్రక సిరులకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చంద్రగిరి కోట ప్రస్తుతం చిన్నాభిన్నమై పోతోంది. ఆనాటి చంద్రగిరి వైభవ దీప్తులు ప్రస్తుతం కాలగర్భంలో కలసిపోయే పరిస్థితులు దాపురించాయి. పురాతత్త్వ శాఖవారి ఆధీనంలో ప్రస్తుతం కోటలో రాజమహల్ మాత్రమే భధ్రంగా ఉంది.

రాయలసీమ జిల్లాల్లో లభించిన గత కాలపు సంస్కృతి, సామగ్రి భద్రపరిచే పురావస్తు సంగ్రాలయం పేరుతో రాజమహల్ ఈరోజు సందర్శకులకు అలనాటి రాజుల వైభవాన్ని, పౌరుషాన్ని చాటుతుందే తప్ప... అంతకు మించి చారిత్రక సత్యాలేవీ అక్కడ కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోక పోతే చంద్రగిరి కోట పూర్తిగా గత స్మృతిగానే మిగిలిపోయే పెనుప్రమాదం పొంచి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu