Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్ని వర్గాల అవసరాలు తీర్చేలా... సంతృప్తిపరిచేలా రైల్వే బడ్జెట్ : సురేశ్ ప్రభు

అన్ని వర్గాల అవసరాలు తీర్చేలా... సంతృప్తిపరిచేలా రైల్వే బడ్జెట్ : సురేశ్ ప్రభు
, గురువారం, 25 ఫిబ్రవరి 2016 (09:13 IST)
అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చే విధంగా గురువారం ప్రవేశపెట్టే బడ్జెట్ ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ఆ విధంగానే 2016-17 వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. రవాణాలో రైల్వే వాటా పడిపోతోందని, రుసుముల్ని నిర్ణయించడంలో సమర్థతే గీటురాయి కావాలి. ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నా ప్రయాణికుల ప్రయోజనాలను అది ప్రభావితం చేయరాదని చెప్పుకొచ్చారు. 
 
గురువారం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో వరుసగా రెండో యేడాది కూడా అలాంటి ప్రకటన ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే ముంబై వాసుల కోసం ఏసీ సబర్బన్‌ రైళ్లను మాత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రవాణాను రైల్వే వైపు ఆకట్టుకోవడానికి ప్రీమియం హైస్పీడ్‌ పార్శిల్‌ రైళ్ల పథకాన్ని బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. 
 
ముఖ్యంగా మోడీ స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా, అన్ని రైళ్లను, స్టేషన్లను శుభ్రంగా ఉంచడానికి, పర్యావరణానికి హాని కలిగించకుండా చూడటానికి కొన్ని చర్యల్ని ప్రకటించే అవకాశం ఉంది. స్వచ్ఛభారత్‌లో భాగంగా జీవ మరుగుదొడ్లు (బయో టాయిలెట్లు), వ్యాక్యూం మరుగుదొడ్లు ప్రవేశపెట్టడమే కాకుండా ప్రతి పెట్టెలో చెత్తకుండీ ఏర్పాటు చేస్తామని సురేశ్ ప్రభు ప్రకటించే సూచనలు ఉన్నాయి. 
 
బడ్జెట్‌ ప్రతిపాదనలు, కేటాయింపులను పుస్తకాల రూపంలోకాకుండా ఎలక్ట్రానిక్‌ విధానంలో తెలియపరచడం ద్వారా దాదాపు 12 లక్షల ఎ-4 పరిమాణంలో కాగితాలను ఆదా చేయడంతో పాటు, ఖర్చునూ తగ్గించుకోవాలని రైల్వే నిర్ణయించింది. ఇంట్రానెట్‌, ఇంటర్నెట్‌ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకోనుంది. 
 
ప్రైవేటు భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 400 స్టేషన్లను 'హరిత స్టేషన్లు'గా అభివృద్ధి చేయనున్నారు. వీటిలో సౌర ఇంధన ఉత్పత్తి, వాడుక జలాల పునర్వినియోగం, వ్యర్థాల నుంచి విద్యుద్ ఉత్పత్తి, ఎల్‌ఈడీ దీపాల వినియోగం వంటివి జరిగేలా చూస్తారు. 
 
ప్రయాణ రుసుముల్ని నేరుగా పెంచకుండా, గిరాకీ బాగున్న మార్గాల్లో పండుగ రోజుల్లో కాస్త ఎక్కువ ధరలతో వీలైనన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ఇదివరకే నిర్ణయించింది. ఇప్పుడున్న రైలు పెట్టెలకు అధునాతన హంగులు సమకూర్చి, చూడచక్కనిరీతిలో లోపలివైపు తీర్చిదిద్ది ఎక్కువ ధరలు రాబట్టుకునేలా నడపాలని రైల్వే యోచిస్తోంది. ఇటీవల ఢిల్లీ-వారణాసి నడుము మహామన ఎక్స్‌ప్రెస్‌ను ఈ విధంగానే తీసుకువచ్చి రైలు చార్జీలను వసూలు చేస్తోంది. అలాగే, ప్రయాణికులపై ఛార్జీల భారం పడకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేలా సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu