Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రంలో మూతపడనున్న ఎంసీఏ కళాశాలలు!

రాష్ట్రంలో మూతపడనున్న ఎంసీఏ కళాశాలలు!
రాష్ట్రంలో కుప్పలు తెప్పులుగా వెలసిన ఎంసీఏ ప్రైవేటు కళాశాలలు ఒక్కొక్కటిగా మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక మాంద్యం పుణ్యమాని ఐటీ రంగం తీవ్రంగా నష్టపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ యేడాది ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎంసీఏ సీట్లు వేలాది సంఖ్యలో ఖాళీగా మిగిలిపోనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐసెట్-2010 కౌన్సెలింగే ఈ విషయాన్ని వెల్లడిస్తోంది.

ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై వారు ఎంసీఏ లేదా ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. అయితే, ఈ యేడాది అర్హత సాధించిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఎంబీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పలు ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కళాశాలలు ఏర్పాటయ్యాయి.

ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ రంగం పూర్తిగా పట్టుకోల్పోయింది. దీంతో ఈ ఎంసీఏలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపక పోవడంతో గత యేడాది దాదాపు యాభై కళాశాలు మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 668 ఎంసీఏ కళాశాలలు ఉండగా ఏఐసీటీఈ సీట్ల సంఖ్యను 49,120కు పెంచింది. గత యేడాది కన్వీనర్ కోటా కింద 18,490 సీట్లను భర్తీ చేయగా, మిగిలిన సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా 130 కాలేజీల్లో పది కంటే తక్కువ మంది విద్యార్థులు చేరినట్టు లెక్కలు చెపుతున్నాయి.

కాగా, అందుబాటులో ఉన్న మొత్తం ఎంసీఏ సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద, మిగిలిన 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద ఒక యేడాదికి 27 వేల రూపాయల ఫీజును వసూలు చేస్తారు. అదే మేనేజ్‌మెంట్ కోటా కింద ఇది 78 వేల రూపాయలుగా ఉంది.

అందువల్ల టాప్ 10 ప్రైవేట్ కశాలల్లో మినహా మిగిలిన అన్ని కాలేజీల్లో ఈ సీట్లు భర్తీ కావడం లేదు. దీంతో యాజమాన్యాలు తీవ్ర నష్టాలను భరిస్తున్నాయి. ఫలితంగా పలు విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. ఈ యేడాది ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu