Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ: అలనాటి భారత అత్యుత్తమ కెప్టెన్

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ: అలనాటి భారత అత్యుత్తమ కెప్టెన్
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2011 (16:59 IST)
అనారోగ్యంతో సెప్టెంబర్ 22న కన్నుమూసిన 70 ఏళ్ల మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ఆకర్షణనీయమైన క్రికెటర్లలో ఒకరు. కేవలం 21 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్ జట్టును నడిపించిన పటౌడీ అత్యంత పిన్నవయస్సు కెప్టెన్‌, భారత అత్యుత్తమ సారధుల్లో ఒకడిగా పేరొందారు.

దేశం తరపున 46 టెస్ట్‌లు ఆడిన ఆయన 40 టెస్ట్‌లకు సారధ్యం వహించడం విశేషం. తన సారధ్యంలో భారత్‌కి కేవలం తొమ్మిది విజయాలను మాత్రమే అందించినప్పటికీ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిన తొలి కెప్టెన్ 'టైగర్' పటౌడీ. 1967లో న్యూజిలాండ్‌పై విదేశాల్లో భారత్‌కి తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన ఘనత కూడా ఆయనదే.

మంచి ఫీల్డర్ అయిన పటౌడీ 1961లో ఢిల్లీలో ఇంగ్లాండ్‌పై టెస్ట్‌ల్లో అరంగ్రేటం చేశారు. ఘోర కారు ప్రమాదంలో తన కుడి కన్ను చూపు పూర్తిగా దెబ్బతిన్న కేవలం నాలుగు నెలల తర్వాత అరంగ్రేటం చేయడం విశేషం. 34 సగటును మాత్రమే నమోదు చేసిన ఆయన భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకరు కానప్పటికీ అత్యంత తెలివైన, ధైర్యవంతమైన భారత కెప్టెన్.

పటౌడీ భారత క్రికెట్‌ని తన చేతుల్లోకి తీసుకొనే సమయానికి భారత క్రికెట్ దారుణస్థితిలో ఉన్నది. అంతకు ముందు 15 సంవత్సరాల కాలంలో 12 మంది కెప్టెన్లు మారారు. 1960ల్లో టైగర్ పటౌడీ తన సారధ్యంలో భారత క్రికెట్‌లో స్థిరత్వాన్ని తీసుకొచ్చారు.

భారత జట్టు తన బలమైన స్పిన్ విభాగాన్ని సమర్ధవంతంగా వినియోగించుకొన్నట్లయితే గట్టి ప్రత్యర్ధిగా రూపొందుతుందని తొలుత గ్రహించింది పటౌడీనే. ఆయన కెప్టెన్సీలోనే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం ప్రారంభించింది. ఈ వ్యూహాన్ని ఒంటబట్టించుకొన్న అజిత్ వాడేకర్ 1971లో వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లపై వరుస సిరీస్ విజయాలను అందించాడు.

కెప్టెన్‌గా తొమ్మిది విజయాలు మాత్రమే సాధించినప్పటికీ కపిల్ దేవ్, సౌరభ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలు ఆధునిక భారత జట్టును విజయవంతంగా నడపటానికి పునాది వేసింది మాత్రం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పటౌడీ క్రికెట్ కెరీర్ క్రమం:
డిసెంబర్ 13, 1961: ఢిల్లీలో ఇంగ్లాండ్‌పై అరంగ్రేటం, 13 పరుగులు చేశారు.
జనవరి 10, 1962: తన మూడో టెస్ట్‌లో తొలి సెంచరీ ( చెన్నైలో ఇంగ్లాండ్‌పై 113 పరుగులు)
మార్చి 23, 1962: బార్బడోస్‌లో తన నాలుగో టెస్ట్‌లోనే భారత జట్టుకు సారధ్యం, భారత టెస్ట్ క్రికెట్‌ అత్యంత పిన్న వయస్సు(21) కెప్టెన్.
ఫిబ్రవరి 12-23, 1964: ఢిల్లీలో ఇంగ్లాండ్‌పై కెరీర్‌లో అత్యధిక స్కోర్ (203 నాటౌట్).
ఫిబ్రవరి-మార్చి 1968: డునెడిన్‌లో భారత్‌కు తొలి విదేశీ టెస్ట్‌ విజయాన్ని అందించారు. న్యూజిలాండ్‌ని 3-1తో ఓడించి విదేశాల్లో భారత్‌కు తొలి టెస్ట్ సిరీస్‌ గెలుపును అందించారు.
జనవరి 23, 1975: కెరీర్‌లో చివరి టెస్ట్, ముంబాయిలో వెస్టిండీస్‌పై, రెండు ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది పరుగులు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu