Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొహలీలో 170వ టెస్టు ఆడనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్!

మొహలీలో 170వ టెస్టు ఆడనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్!
FILE
అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న టీమ్ ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. 170వ టెస్టును ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ తనదైన శైలిలో రికార్డులను సృష్టిస్తోన్న మాస్టర్ బ్లాస్టర్, 170వ టెస్టును ఆడబోతున్నాడు.

ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న కీలక తొలి టెస్టులో అభిమానులు, ప్రేక్షకుల కళ్లంతా సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్‌ల బ్యాటింగ్ పైనే ఉంటుందని క్రీడావిశ్లేషకులు అంటున్నారు.

టెస్టు కెరీర్‌లోనే 170వ టెస్టు మ్యాచ్‌ను ఆడే భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. తప్పకుండా సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తాడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, 20 ఏళ్ల పాటు అరుదైన రికార్డులతో యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ తన టెస్టు కెరీర్‌లో 14వేల పరుగులు సాధించాడు. సచిన్ 14వేల రికార్డుకు బ్రేక్ చేయాలని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ (12,026 పరుగులతో) ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే నాలుగు పదుల వయసైనప్పటికీ టీమ్ ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ధీటుగా రాణిస్తుండగా, కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం పాతశైలి బ్యాటింగ్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు నానా తంటాలు పడుతున్నాడు.

ఒకవైపు కెప్టెన్సీ బాధ్యత తనపై ఉండంటంతో రికీ పాంటింగ్ బ్యాటింగ్‌‌లో తనదైన శైలిలో రాణించలేకపోతున్నాడు. మరోవైపు.. వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్ టెండూల్కర్‌ల బ్యాటింగ్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆసీస్ బౌలర్లు, ఈ టీమ్ ఇండియా సూపర్ బ్యాట్స్‌మెన్లను ఏవిధంగా కట్టడి చేస్తారో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టుతో 170వ టెస్టు ఆడనున్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన 20 ఏళ్ల క్రీడా జీవితంలో ప్రతి విజయమూ కష్టపడితేనే వచ్చిందని, ఏదీ ఊరికే రాలేదని అంటున్నాడు.

ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండడం కుదరదని, ప్రతి మనిషి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సహజమేనని ఈ మాస్టర్ చెబుతున్నాడు. అయితే వాటిని అధిగమించి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం ముఖ్యమని సచిన్ వెల్లడించాడు.

'విజయానికి సులువైన మార్గాలంటూ ఏవీ ఉండవు. అంత సులువుగా వచ్చేదేదైనా నాకు అవసరం లేదు. భారత జట్టుకోసం గత కొన్నేళ్లుగా తీవ్రంగా కష్టపడుతున్నాను. ఇక ముందు కూడా కష్టపడతాన'ని సచిన్ అన్నాడు. మొత్తానికి కష్టపడితేనే ఫలితముంటుందని చెబుతున్న మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసీస్‌తో జరిగే కీలక టెస్టు సిరీస్‌లో శతకాల మోత మోగించాలని మనమందరం ఆశిద్దాం..!

Share this Story:

Follow Webdunia telugu