Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ ప్రపంచ కప్ : నేడు భారత్ - ఆప్ఘనిస్థాన్ పోరు

india vs afghanistan
, బుధవారం, 11 అక్టోబరు 2023 (11:11 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించింది. వచ్చే ఆదివారం చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ప్రపంచంలో సంచలనాలకు కేంద్రంగా భావించే ఆప్ఘనిస్థాన్ జట్టుతో బుధవారం తలపడుతుంది. నిజానికి భారత్ తొలి మ్యాచ్‌లో నెగ్గినప్పటికీ భారత బ్యాటింగ్ తీరు కలవరపాటుకు గురిచేసింది. 
 
కేవలం జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద ఉండగా ఓపెనర్లతో పాటు సహా ఏకంగా మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు ముందుండి భారత్‌ను గెలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం భారత్ సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. 
 
భారత జట్టుతో పోల్చితే ఆప్ఘనిస్థాన్ జట్టు చిన్న జట్టే అయినప్పటికీ మరీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా జట్టు బౌలర్లు స్టార్ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టగలరు. రషీద్ ఖాన్ సత్తా ఏంటో భారత ఆటగాళ్లకు తెలియంది కాదు. ఇంకా ముజీబ్, ఫారూఖీల రూపంలో ప్రమాదకర బౌలర్లున్నారు. బ్యాటింగ్ గుర్బాజ్ దూకుడుగా ఆడి బౌలర్ల లయను దెబ్బ తీయాలని చూస్తాడు. ఇబ్రహీం జాద్రాన్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. నబి లాంటి నాణ్యమైన ఆల్ రౌండర్ సేవలూ ఆ జట్టుకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఆ జట్టుతో ఆడేసమయంలో కాస్త జాగ్రత్తగా ఆడాలని సలహా ఇస్తున్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో సౌతాఫ్రికా జట్టు ఏకంగా 428 పరుగులతో రికార్డు నెలకొల్పింది. తర్వాత శ్రీలంక కూడా 300 పైచిలుకు స్కోరు చేసింది. కాబట్టి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తే భారత్ నుంచి కూడా భారీ స్కోరు ఆశించవచ్చు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకూ సహకరిస్తుంది.
 
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, కుల్దేప్, అశ్విన్/షమి, బుమ్రా, సిరాజ్.
 
ఆప్ఘనిస్థాన్ : గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, హష్మతుల్లా (కెప్టెన్), రహ్మత్ షా, నజీబుల్లా జాద్రాన్, నబి, అజ్మతుల్లా, రషీద్, ముజీబ్, ఫారూఖీ, నవీనుల్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పల్ స్టేడియాన్ని ఊపేసిన 'నాటు నాటు' పాట ... కళ్లు చెదిరే లైటింగ్ డిస్‌ప్లే