Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ బ్యాట్‌తో మాస్టర్ బ్లాస్టర్ 14 శతకాలు కొట్టిన వేళ...!

ఆ బ్యాట్‌తో మాస్టర్ బ్లాస్టర్ 14 శతకాలు కొట్టిన వేళ...!
FILE
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ సెంచరీల మోత మోగించడానికి ఓ అపురూపమైన బ్యాట్‌ను ఉపయోగిస్తున్నారట. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో 50వ టెస్టు సెంచరీ కొట్టేందుకు మాస్టర్ ఉపయోగించిన బ్యాట్‌ను చూస్తే.. మాస్టర్‌కే బ్యాట్ల కొరతా అని అందరూ అనుకుంటారు.

కానీ పాత బ్యాట్‌నే సచిన్ నమ్ముకంటాడట. దీని వెనుక సెంటిమెంట్ బలం అంతా ఇంతా కాదండీ.. ఇదే బ్యాట్‌తో లిటిల్ మాస్టర్ 14 శతకాలు కొట్టాడంటే.. ఆ బ్యాట్ ఎంతటి అపురూపమైందో అర్థం చేసుకోవచ్చు. నెట్ ప్రాక్టీసులో ఈ బ్యాట్‌ను ఎప్పుడూ వాడని సచిన్... మ్యాచ్‌ల్లో మాత్రం దీనిపైనే ఆధారపడతాడు. సెంచూరియన్‌లో సఫారీలపై చేసిన 111 పరుగులకు, తద్వారా టెస్టులో చరిత్ర సృష్టించడానికి ఈ బ్యాటే కారణమట.

2006వ సంవత్సరం ఫామ్‌ను కోల్పోయి, ఆశించిన పరుగులు చేయలేక సచిన్ గడ్డుకాలం ఎదుర్కొన్నాడు. అప్పుడు మాస్టర్‌ను ఓ వడ్రంగి గట్టెక్కించాడట. రాహుల్ ద్రావిడ్ పరిచయం మేరకు రామ్ భండారీ అనే ఓ బెంగళూరు వాసి సచిన్ సమస్యను తేలికగా పరిష్కరించాడు. తొలి పరిచయంలోనే... బరువైన బ్యాట్‌తో ఆడడమే మాస్టర్‌కు ప్రతిబంధకంలా తయారైందని భండారీ తేల్చేశాడు.

బీహార్ నుంచి కర్ణాటక వలసొచ్చిన భండారీ ఎప్పుడో తాతముత్తాల నుంచి వారసత్వంగా వస్తున్న వడ్రంగాన్ని హాబీగా చేపట్టాడు. స్థానిక క్రికెటర్ల బ్యాట్లను తయారు చేస్తూ పాపులర్ అయిన భండారీకి ద్రావిడ్ ద్వారా సచిన్ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో భండారీకి సచిన్ తన బ్యాట్ అప్పగించాడు. బ్యాట్ బరువే అత్యధిక పరుగులు చేయకపోవడానికి కారణమని తెలుసుకున్న భండారీ దాన్ని 1350 గ్రాముల నుంచి 1250 గ్రాములకు తగ్గించాడు.

ఆ తర్వాత తక్కువ బరువున్న ఆ బ్యాట్‌తో ఆడిన సచిన్ మలేషియాలో ఓ టోర్నీలో భారీ సెంచరీతో జైత్రయాత్ర మొదలెట్టాడు. ఇక అప్పట్నించి టెస్టులు, వన్డేల్లో సచిన్ పరుగుల మోత మోగిస్తున్నాడు. పరుగుల వరద పారించడంతో పాటు వన్డేల్లోనూ డబుల్ సెంచరీ, 17వేల పరుగుల మార్కును దాటడం వంటి అరుదైన రికార్డులతో విజృంభిస్తున్నాడు. తాజాగా సెంచూరియన్ మైదానంలోనూ సచిన్ ఇదే బ్యాట్‌ను ఉపయోగించి తన టెస్టు కెరీర్‌లో 50వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

సచిన్ సాధించిన మొత్తం 96 సెంచరీల్లో ఈ ఒక్క బ్యాట్‌తోనే 14 సెంచరీలు కొట్టాడట. ఇంకేముంది..? ఈ బ్యాట్ కథాకమీషు తెలియరావడంతో వన్డే ప్రపంచకప్‌లోనూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇదే బ్యాట్‌ను ఉపయోగించాలని సచిన్ శ్రేయోభిలాషులు, అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారట. అయితే మనం కూడా వన్డే ప్రపంచకప్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డులతో మహేంద్ర సింగ్ ధోనీ సేనకు వరల్డ్ కప్ సాధించిపెట్టాలని ఆశిద్దాం..!

Share this Story:

Follow Webdunia telugu