Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయంలో కీలక పాత్ర పోషించిన యువకులు...

విజయంలో కీలక పాత్ర పోషించిన యువకులు...
, బుధవారం, 5 మార్చి 2008 (17:20 IST)
FileFILE
ఆసీస్ సొంత గడ్డపై ఓడించిన భారత జట్టులో ఉన్న భారత జట్టు సభ్యుల్లో ఎక్కువ శాతం యువకులదే కీలకం. జట్టులో సచిన్, హర్భజన్, సెహ్వాగ్‌లు మాత్రమే సీనియర్ సభ్యులుగా వున్న మిగిలిన 16 మంది జట్టులో యువకులే అధికంగా వున్నారు. యువకులదే కీలకపాత్ర అనడంలో సందేహం లేదు. గంభీర్, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, ఉతప్ప, ప్రవీణ్ కుమార్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించారు. ఆ ఫలితంగానే భారత జట్టు విజయఢంకా మోగించింది.

ముఖ్యంగా ఆసీస్‌ ఆటగాళ్లు పాటించే ఎత్తుగడలు, చాతుర్యం, టెక్నిక్స్‌ను భారత యువకులు సొంతం చేసుకున్నారు. అందువల్లే ఆసీస్ గడ్డపై ఆసీస్‌ను మట్టికరపించారు. ముక్కోణపు సిరీస్‌ ఆరంభం నుంచి యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. వారికి తోడు బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రాణింపు, హర్భజన్ సింగ్ కీలక సమయంలో వికెట్లు తీయడం వంటి పరిణామాలు భారత్‌ను విజయం వైపు నడిపించాయి. ఈ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించిన కొంతమంది ఆటగాళ్ళ ఆటతీరును పరిశీలిస్తే..

‘గంభీర’మైన ఇన్నింగ్స్...
వన్డే సిరీస్‌ ఆరంభం నుంచి ఓపెనర్ గౌతం గంభీర్ ఎంతో ఆకట్టుకున్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లలో సరిగా రాణించలేక పోయిన ఈ ఢిల్లీ యువ గంభీరం.. లీగ్ దశలో భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. అందుకే భారత జట్టులో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ పర్యటనే తనకు టర్నింగ్ పాయింట్ అని గంభీర్ స్వయంగా ప్రకటించాడు. ఓ సెంచరీతో పాటు రెండు మార్లు అర్థ సెంచరీలు పూర్తి చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో కూలిపోతున్న భారత బ్యాటింగ్‌ నావను ఒడ్డుకు చేర్చిన ఘనతను దక్కించుకున్నాడు. అయితే.. ఫైనల్ మ్యాచ్‌లలో మాత్రం.. గంభీరమైన ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు.

రో"హిట్" శర్మ...
ముంబై యువ హీరో. మరో సచిన్‌ అని క్రికెట్ అభిమానులు పిలుచుకుంటున్న క్రికెటర్. అయితే తన ఆరాధ్య క్రికెటర్‌తో తనను సరిపోల్చవద్దని వినమ్రయంగా చెప్పుకునే రోహిత్ శర్మ కీలక దశలో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గట్టెక్కించాడు. ముఖ్యంగా తొలి ఫైనల్ మ్యాచ్‌లో సచిన్‌తో కలసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో రోహిత్ శర్మ చూపిన సంయమనం, తెగువ, పోరాట పటిమ ఎవరూ మరచిపోలేరు. ఈ భాగస్వామ్యమే భారత్‌ను విజయం వైపు మళ్లించింది.

webdunia
FileFILE
కంగారుల దృష్టిలో హీరో...
ఇషాంత్ శర్మ. ఈ పేరు ఆసీస్ పర్యటనకు ముందు ఎవరికీ అంత తెలియదు. అయితే టెస్టు, వన్డే సిరీస్‌ ముగిసే సమయానికి అతడే హీరో అయ్యాడు. శర్మ బౌలింగ్ అంటే ప్రపంచ ఛాంపియన్లు కంగారుపడేలా చేశాడు. ప్రతి మ్యాచ్‌ మ్యాచ్‌కు ఎంతో పరిణితి సాధిస్తూ తన బౌలింగ్ లైన్ అండ్ లెన్త్‌ను మెరుగుపరుచుకుని హడలెత్తించాడు. ఆరంభంలో వికెట్లు తీసి, ఆసీస్‌ మెడలు వంచే బౌలర్‌గా పేరుగడించాడు.

ప్రవీణ్ "ప్రావీణ్యం"...
వన్డే సిరీస్‌ కోసం భారత జట్టుకు ఎంపికైన కొత్త కుర్రాడు. దేశవాళీ పోటీల్లో అమితంగా రాణించినందుకు దక్కిన ప్రతిఫలం. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెత్త బౌలింగ్. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు పెవిలియన్‌కే పరిమితం. కానీ చావో రేవో తెలుసుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో ప్రవీణ్ కుమార్‌కు చోటు కల్పించారు. అందరూ పెదవి విరిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం ఖాయమని భావించారు. అయితే తన స్వింగ్ ప్రతాపంతో తనను విమర్శించిన వారి అంచనాలను తలకిందులు చేశాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ప్రవీణ్‌ రెండు ఫైనల్స్‌లలో ఆరు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా ప్రత్యర్థిని ఆరంభంలోనె దెబ్బతీసే బౌలర్‌గా పేరుతెచ్చుకున్నాడు.

"రూటు" మార్చిన ధనాధన్...
ధనాధన్ ధోనీగా పేరుగాంచిన కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ ఈసిరీస్ ఆద్యంతం తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. క్రీజ్‌లోకి వచ్చే ధోనీ నుంచి కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే ఆశించరాదని ఈ సిరీస్‌తో చాటి చెప్పాడు. ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైతే తన ఆటతీరుకు విరుద్ధంగా కొత్త అవతారం ఎత్తగలనని నిరూపించాడు. కీలక సమయాల్లో జట్టు అవసరాలకు అనుగుణంగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు.

భారీ స్కోర్లు చేయలేక పోయినా జట్టు గెలుపుకు అవసరమైన పలుగులు చేసే వికెట్ కీపర్‌గా పేరుసాధించాడు. అందువల్లే ఒకే సిరీస్‌లో 300 పైచిలుకు పరుగులు సాధించి, 20 మందిని అవుట్ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే.. మైదానంలో అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ప్రత్యర్థిని బోల్తా కొట్టించి "టీమ్ ఇండియా"కు సిబీ సిరీస్‌ కప్‌ను అందించాడు. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu