Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ ముఖ్యమంత్రిగా తొలిసారి హస్తిన వెళ్లనున్న కేసీఆర్!! బీజేపీ - భారాసా పొత్తుకోసమేనా?

kcrao

ఠాగూర్

, మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (13:02 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తొలిసారి మాజీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గత తొమ్మిదేళ్లపాటు ఆయన సీఎం హోదాలో పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారాస పార్టీ ఓడిపోయింది. 
 
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటం ఇదే తొలిసారి. కాగా, తుంటి ఎముక విరిగిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని నంది నగర్‌లోని తన నివాసంలో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఎవరి సాయం లేకుండా చేతికర్ర సాయంతో ఆయన నడవగలుగుతున్నారు. నల్గొండ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు. 
 
మరోవైపు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం దీనిపై పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తి నెలకొంది. 
 
అయితే, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పర్యటనకు సంబంధించిన అజెండాపై కూడా వివరాలు వెల్లడి కాలేదు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ పర్యటనపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
 
కాగా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితిలు చేతులు కలిపితే అత్యధిక స్థానాలు గెలుచుకోవచ్చన్నది రాజకీయ విశ్లేషకులతో పాటు ఇరు పార్టీల పెద్దలు భావిస్తున్నారు. 
 
పైగా, బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరు ట్రంకుపెట్టెలు తెచ్చుకోండి.. జయలలిత బంగారు, వజ్రాభరణాలు ఇస్తాం..