Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛ... నా చదువుకి ఇంత తక్కవ జీతమా? ఉరి వేసుకున్న బీటెక్ విద్యార్థి

ఒకప్పుడు ఇంజినీరింగ్ చదువు అంటే డాలర్లకు డాలర్లు డబ్బు సంపాదన అనే పేరుండేది. అమెరికాలో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమాని అది కాస్తా ఆవిరైపోయింది. ఇప్పుడు బీటెక్ చదివిన విద్యార్థుల్లో చాలామందికి ఉద్యోగ

depression
, శుక్రవారం, 10 నవంబరు 2017 (12:37 IST)
ఒకప్పుడు ఇంజినీరింగ్ చదువు అంటే డాలర్లకు డాలర్లు డబ్బు సంపాదన అనే పేరుండేది. అమెరికాలో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమాని అది కాస్తా ఆవిరైపోయింది. ఇప్పుడు బీటెక్ చదివిన విద్యార్థుల్లో చాలామందికి ఉద్యోగాలు రాక గోళ్లు గిల్లుకుంటున్నారు. చదివింది ఒకటి... వచ్చే ఉద్యోగం వేరొకటి. అంతేకాదు కొన్నిసార్లు తాము చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం వచ్చినా అందులో కూడా అత్యంత తక్కువ జీతమే రావడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. 
 
బీటెక్ చదువు కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదివితే వస్తున్న వుద్యోగం చూస్తే విద్యార్థులు బావురుమంటున్నారు. రాత్రింబవళ్లు గొడ్డు చాకిరీ చేసినా కంపెనీలు ఇస్తున్న జీతాలు చాలాచాలా తక్కువ. పోనీ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుందామంటే... ఇరుగుపొరుగు... ఏంట్రా అంత చదువు చదివి ఇంట్లో ఊరికనే కూర్చుంటున్నావూ అంటూ ఎత్తిపొడుపు మాటలు సరేసరి. అంతేనా... మీవాడికి ఉద్యోగం లేదుగా... పెళ్లెలా అవుతుందీ అంటూ ప్రశ్నించేవారు వున్నారు. ఇలా ఇన్ని ఒత్తిడుల మధ్య ఏదో ఒక ఉద్యోగం అని సరిపెట్టుకుని అందులో చేరితే అక్కడ కంపెనీ జీవితాలతో ఆడుకుంటుంది. 
 
తక్కువ తినండి... ఎక్కువ పనిచేయండ్రా దొర సంతోషిస్తారన్న సినిమా డైలాగు లెవల్లో తక్కువ జీతం... గొడ్డు చాకిరీలా మారుతోంది అక్కడ పని. పోతేపోనీ ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అనుకుంటే అంతకంటే తక్కువ జీతానికే చేసేందుకు క్యూలో వేలమంది నిరుద్యోగులు. ఈ దారుణమైన పరిస్థితిలో ప్రస్తుతం బీటెక్ చదివి లక్షల జీతం సంపాదించేద్దామనుకుంటున్న వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. ఈ బాధ తట్టుకోలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం వచ్చినా, అది తక్కువ వేతనంతో వచ్చిందని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి తన కుటుంబసభ్యులకు కన్నీరు మిగిల్చాడు. 
 
బీహార్‌ రాజధాని పట్నాలో మెట్‌పల్లికి చెందిన విద్యార్థి తన చదువుకు తగిన జీతం రావడంలేదని మనస్తాపం చెంది తనువు చాలించాడు. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన సురేంద్ర అనే విద్యార్థి పట్నాలోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అయితే వచ్చిన ఉద్యోగం జీతం చూస్తే కళ్లు బైర్లు కమ్మేట్లు అత్యంత తక్కువ. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
కానీ ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. మనిషిగా పుట్టాక ఎన్ని కష్టాలు వచ్చినా... అవన్నీ ఎదుర్కొని సాధించాలి తప్ప ఇలా ఆత్మహత్యలకు పాల్పడకూడదు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మొదటి మెట్టు ఎక్కాల్సిందే. అయ్యో... ఈ మొదటి మెట్టుపైనా నేను ఎక్కాల్సింది అనుకుంటే మిగిలిన మెట్లు ఎక్కడం ఎలా? కనుక ఆ భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన జీవితాన్ని సుఖమయం చేసుకోవడం మన చేతుల్లోనే వుంది. కష్టపడి ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ వుండదు. తనువు చాలిస్తే ఇక సాధించడానికి ఆ తనువే వుండదు కదా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా