Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జెడి రె"ఢీ" - మూడు రోజుల్లో సొంత పార్టీ.. ఆ నగరంలో సొంత కార్యాలయం..?

జెడి రె
, సోమవారం, 12 నవంబరు 2018 (20:03 IST)
ఎపిలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. మరో మూడు రోజుల్లో సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్థమయ్యారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ. విజయవాడ వేదికగా సొంత పార్టీ పేరుతో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు లక్ష్మీనారాయణ. గత కొన్నిరోజులుగా దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన లక్ష్మీనారాయణ ఎట్టకేలకు సొంత పార్టీ వైపే మ్రొగ్గుచూపడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.
 
సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసి, ఇంకా పదవీకాలం ఉండగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేసులను విచారించింది ఆయనే. ఆ సమయంలో ఆయన రోజూ వార్తలకెక్కారు. అవినీతికి సింహ స్వప్నం అంటూ కొందరు ఆయన్ను హీరోను చేశారు. కాంగ్రెస్‌ చేతుల్లో కీలుబొమ్మగా మారి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని వైసిపి ఆరోపించింది. ఆయన్ను నిబద్ధత కలిగిన అధికారి అని విశ్వసించే వారు లక్ష్మీనారాయణకు అభిమానులుగానూ మారారు.
 
సమాజానికి తనవంతు సేవలు అందించడం కోసం ఉద్యోగం విడిచిపెట్టినట్లు చెప్పిన ఆయన… రాష్ట్రమంతా తిరుగుతున్నారు. అన్నివర్గాల ప్రజల స్థితిగతులను అధ్యయనం చేస్తున్నారు. ఆయన ప్రత్యేక విధానాలను ప్రకటిస్తున్నారు. స్మార్ట్‌ సిటీలు కాదు కావాల్సింది… స్మార్ట్‌ విలేజెస్‌ గురించి మనం ఆలోచించాలి అంటున్నారు. ప్రతి గ్రామానికి, పట్టణానికి, ప్రాంతానికి అభివృద్ధి ప్రణాళికను ఆ ప్రాంత ప్రజలే రూపొందించుకోవాలని చెబుతున్నారు.
 
ఈ ప్రణాళికను స్టాంప్‌ పేపర్‌ పైన రాసి ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చేవారితో సంతకం పెట్టించుకోవాలని సూచిస్తున్నారు. పీపుల్స్‌ మ్యానిఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ పెట్టి, ఏ ప్రాంత ప్రజలైనా తమ సమస్య ఏమిటో తెలియజేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. మరో కీలకమైన అంశం కూడా ఆయన ప్రస్తావిస్తన్నారు. ధనమయంగా మారిన రాజకీయాలను మార్చడానికి ‘జోరో బడ్జెట్‌ పాలిటిక్స్‌’ అవసరమని చెబుతున్నారు. అంటే ఎన్నికలకు పైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండకూడదని అంటున్నారు.
 
తాను ప్రతిపాదిస్తున్న పీపుల్స్‌ మ్యానిఫెస్టో అమలు చేయాలంటే స్వచ్ఛంద సంస్థల వంటి సంస్థలతో సాధ్యం కాదని, అందుకే రాజకీయాల్లోకి రావాలని చాలామంది తనను కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని తాను కూడా నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే… సొంతంగా పార్టీ పెడతారా? లేక ఇప్పటికే ఉన్న పార్టీల్లో చేరుతారా? అనేదానిపైన పలువురు సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలను తీసుకున్న లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెట్టడమేనన్న నిర్ణయానికి వచ్చేశారు. పార్టీ పేరు, విధి విధానాలు మొత్తం మరో మూడు రోజుల్లో విజయవాడ వేదికగా లక్ష్మీనారాయణ ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయాల్లోకి సొంత పార్టీతో వచ్చే లక్ష్మీనారాయణను ప్రజలు ఖచ్చితంగా ఆదరించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 మంది బాలికలపై అకృత్యానికి పాల్పడిన కామాంధుడికి జైలు