Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల్లూరులో జనసేన పార్టీకి షాక్.. కేతంరడ్డి వినోద్ రెడ్డి రాజీనామా

kethamreddy vinod reddy
, గురువారం, 12 అక్టోబరు 2023 (16:27 IST)
నెల్లూరు సిటీ అసెంబ్లీ టిక్కెట్‌ను తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పి.నారాయణకు కేటాయించింది. టీడీపీ - జనసేన పార్టీ పొత్తులో భాగంగా, ఈ నిర్ణయం జరిగింది. అయితే, దీన్ని జీర్ణించుకోలేని జనసేన పార్టీ నేత నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పైగా మాజీ మంత్రి నారాయణపై అవినీతి ఆరోపణలు చేసి, వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈయన వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ తరపున పోటీ చేయాలని భావించారు. కానీ, అది సాధ్యకాదని తెలియడంతో మాజీ మంత్రిపై అవినీతి ఆరోపణలు చేసి. వైకాపాలో చేరబోతున్నారు. ఇదే విషయంపై ఆయన ఓ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. 
 
"2003లో విద్యార్థి నేతగా జాతీయ కాంగ్రెస్ పార్టీతో మొదలైన నా రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్థాయి వరకు ఎదిగేలా అనేక అవకాశాలు కల్పించింది. ఆ ప్రయాణంలో దివంగత నేత మా గురువు ఆనం వివేకానందరెడ్డి నాకు అందించిన తోడ్పాటు, రాజకీయ జ్ఞానం మరువలేనిది. వారికి జీవితాంతం నేను కృతజ్ఞుడిని. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన పరిస్థితుల్లో, యువతకు ప్రాధాన్యత కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై నేను జనసేన పార్టీలో చేరాను. 
 
పార్టీలో చేరిన నాటి నుండి నేను ఒక నిబద్ధత గల జనసైనికునిగా పనిచేస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాను. నెల్లూరు సిటీలో అప్పటివరకు నేను చేసిన అనేక కార్యక్రమాలను, గతంలో సేవ్ నెల్లూరు అంటూ ప్రజాసమస్యలపై పోరాడిన విధానం వంటి అనేక అంశాలను గుర్తించి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఆనాడు వారు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞుడను.
 
2019 ఎన్నికల్లో ఓడిన నాటి నుండి నేటి వరకు నేను ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ అభివృద్ధి కోసం నిత్యశ్రామికుడిలా కృషి చేశాను. నేను పోటీ చేసిన నియోజకవర్గంలో పార్టీ పరంగా అంతర్గతంగా నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, పార్టీలో నాకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా, నాకు తగిన విలువ ఇవ్వకుండా నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా పంటి బిగువున భరించాను. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎదుటే కన్నీటిపర్యంతం అయ్యాను తప్పించి ఏనాడూ కూడా మరో వేదికలో పంచుకోలేదు. 
 
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే, ఆయనతో నేనుంటే, ప్రజలకు మరింతగా సేవ చేయగలిగే అవకాశం వస్తుందనే నేను ఎల్లప్పుడూ భావించాను. అందుకే “కాబోయే సీఎం పవన్ కళ్యాణ్” అనే సింగిల్ పాయింట్ ఎజండాతో నేను 316 రోజుల పాటు నా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా “పవనన్న ప్రజాబాట” చేశాను. అంతే తప్పించి 2019 నుండి నేటి వరకు ఏనాడూ కూడా నేను వచ్చే ఎన్నికల్లో సీటు గురించి ఆలోచించలేదు. పార్టీ పెద్దలు ఎవ్వర్ని కూడా టికెట్ ఆశిస్తున్నట్టు ఏనాడూ కలవలేదు.
 
మూడు నెలల క్రితమే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీమంత్రి నారాయణని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికి మన పార్టీకి, టీడీపీకి పొత్తు లేదు. అయినప్పటికీ పార్టీలోని పెద్దలు పలువురు నన్ను పిలిచి వచ్చే ఎన్నికల్లో సీటుని ఆశించవద్దు, అక్కడ టీడీపీ తరపున నారాయణ పోటీ చేస్తున్నారు, మనం ఆయనకు పని చేయాలి అని తెలిపారు. నేను 2016లో సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే ఈ నారాయణ అక్రమాల మీద అని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా నారాయణ అక్రమాల మీద బలంగా గళం వినిపించానని, అయినప్పటికీ పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, నేను సీటుని ఆశించట్లేదని వారితో తెలిపాను. అయినప్పటికీ పార్టీలో నాకంటూ గౌరవం లేకుండా, నేను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా, పార్టీలోని పెద్దలు పలువురు నిత్యం అదేపనిగా కృషి చేస్తున్నారు.
 
రాజకీయాల్లో హత్యలుండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. ఇన్ని రోజులు పార్టీలో నాకు ఎన్ని అవమానాలు జరిగినా ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేశానంటే కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన తప్పక ముఖ్యమంత్రి అవుతారు అని నేను నమ్మిన ఒకే ఒక నమ్మకంతోనే. కాని నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేను. నా ఓర్పు, సహనం నశించింది. నా మనస్సు చచ్చిపోయింది. పని చేసినన్ని రోజులు నీతి, నిబద్ధతతో జనసేన పార్టీ కోసం పని చేశాను. ఇప్పుడు మనస్సులో వేరేది పెట్టుకుని పనిచేయలేను. అలా చేస్తే అది రాజకీయంగా నా ఆత్మహత్యాసదృశ్యమే.
 
అందుకే అన్ని కోణాల్లో అలోచించి, నాతో కలిసి పనిచేసిన అనేక మంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇన్నేళ్ళ నా రాజకీయ ప్రయాణంలో నన్ను నమ్మి నాతో ప్రయాణించిన వారికి భరోసాగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే రాజకీయంగా అవమానాలు లేకుండా నాకు ఔనత్యాన్ని అందిస్తామని, నమ్ముకున్న ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని భరోసాగా నిలిచే వారితో నా ప్రయాణం ఉండబోతోంది. రాజకీయంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నీతి, నిబద్ధత తప్పను, నన్ను ఆదరించే ప్రజలకు, ఇప్పటివరకు తోడుగా నిలిచిన జనసైనికులకు ఏ కష్టమొచ్చి నా వద్దకు వచ్చినా అందుబాటులో ఉంటాను. జైహింద్."  అంటూ ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ దృష్టి దినోత్సవం: మెరుగైన కంటి ఆరోగ్యం భారత ఆర్థిక వ్యవస్థను 27 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచగలదు