Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరకాసురుడు విష్ణుమూర్తి కుమారుడా...? నరకాసురుడికి చెప్పి చంపిన కృష్ణుడు

దీపావళిని నరక చతుర్దశి అని కూడా అంటారు. దీనికి కారణం, నరకాసురుడు తను మరణించిన రోజుని అంతా ఓ వేడుకగా జరుపుకోవాలని కోరుకోవడమే. చాలామంది వాళ్ళ నిర్బంధనలు ఏమిటో వారి చివరిక్షణాల్లో గానీ గ్రహించరు. అలా కాకుండా వాళ్లిప్పుడే అవి ఏమిటి అన్నది గ్రహించ గలిగి

నరకాసురుడు విష్ణుమూర్తి కుమారుడా...? నరకాసురుడికి చెప్పి చంపిన కృష్ణుడు
, శనివారం, 29 అక్టోబరు 2016 (13:49 IST)
దీపావళిని నరక చతుర్దశి అని కూడా అంటారు. దీనికి కారణం, నరకాసురుడు  తను మరణించిన రోజుని అంతా ఓ వేడుకగా జరుపుకోవాలని కోరుకోవడమే. చాలామంది వాళ్ళ నిర్బంధనలు ఏమిటో వారి చివరిక్షణాల్లో గానీ  గ్రహించరు. అలా కాకుండా వాళ్లిప్పుడే అవి ఏమిటి అన్నది గ్రహించ గలిగితే, వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు. కాని చాలామంది చివరిక్షణం వరకు ఎదురు చూస్తారు. నరకాసురుడు, తన మరణ సమయంలో అతను తన జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకున్నదీ, తన జీవితాన్ని ఎలా గడిపింది హటాత్తుగా తెలుసుకున్నాడు. అందువల్ల అతను కృష్ణుణ్ణి ఇలా కోరాడు, “ఇవ్వాళ నీవు కేవలం నన్ను మాత్రమే వధించడం లేదు, నేను చేసిన తప్పులన్నిటినీ కూడా వధిస్తున్నావు – అందుకని అందరూ దీన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవాలి.” అందువల్ల, మీరు నరకాసురుని తప్పులు వధించ బడినందుకు పండుగ జరుపుకోవడం కాదు, మీ లోపల ఉన్న దోషాలన్నిటి వధించే పండుగ చేసుకోవాలి. అప్పుడే నిజమైన దీపావళి. లేకపోతే అది కేవలం డబ్బు ఖర్చు, నూనె ఖర్చు, టపాకాయల ఖర్చు మాత్రమే అవుతుంది.
 
నరకాసురుడు మంచి వంశం నుంచి వచ్చిన వాడే. పురాణ కథలు అతను విష్ణుమూర్తి కుమారుడని చెప్తాయి. కాని అది విష్ణువు వరాహావతారంలో ఉన్నప్పుడు జరిగింది. అందువల్ల అతనిలో కొన్ని ధోరణులేర్పడ్డాయి. దీనికితోడు నరకాసురుని మిత్రుడు మురాసురుడు, తర్వాత అతన్ని సేనానిగా కూడా చేసుకున్నాడు. వాళ్లిద్దరూ కలిసి ఎన్నో యుద్ధాలు చేశారు, వేలాదిమందిని చంపారు. ఇద్దర్నీ కలిపి చంపడం కష్టం. కాబట్టి, కృష్ణుడు మొదట మురాసురుణ్ణి చంపాడు. కృష్ణుడికి మురారి అన్న పేరు రావడానికి కారణం ఇదే. పురాణకథనం ప్రకారం మురాసురుడికి మాయలు తెలుసు. వాటి కారణంగా యుద్ధంలో అతని ముందు ఎవరూ నిలబడగలిగేవాళ్లు కాదు. మురాసురుని వధించిన తర్వాత నరకాసుర వధ తేలికయింది.
 
నరకాసురుడిని చంపడానికి కారణం ఏమిటంటే, ఒకవేళ కృష్ణుడతన్ని విడిచిపెట్టినా అతను తన పద్ధతులు మార్చుకోడు. అందుకని కృష్ణుడతన్నివధించాడు. కాని అతన్ని మృత్యుముఖం  దగ్గరకు  తీసికు వచ్చే సరికి, అతనికి జ్ఞానోదయం అయ్యింది. తాను అనవసరంగా చాలా చెడును మూట కట్టుకున్నట్లు అతను వెంటనే గ్రహించాడు. అందుకే అతను, “నీవు నన్ను చంపడం లేదు, నాలోని చెడును తొలగిస్తున్నావు. నీవు నాకు మంచే చేస్తున్నావు. అందరికీ ఈ విషయం తెలియాలి. అందువల్ల నేను పోగుచేసుకున్న దోషాల వినాశనాన్ని అందరూ పండుగగా చేసుకోవాలి. ఇది నాకో కొత్త వెలుగును ఇచ్చింది. అది ప్రతి ఒక్కరికీ వెలుగునివ్వాలి.” అని కోరుకున్నాడు. ఆ విధంగా ఇది దీపాల పండుగ అయింది. ఈ రోజు దేశమంతా వెలుగులతో నిండిపోవాలి. ఆ విధంగా మీలోని మలినాల్ని కాల్చివేయాలి. మీరిది వెంటనే చేయడం మంచిది. నరకుడి విషయంలో కృష్ణుడు, “నేను నిన్ను చంపబోతున్నాను.” అని చెప్పాడు. మరి మీ విషయంలో ఎవరూ అలా చెప్పకపోవచ్చు. మీకు తెలియకుండానే అది జరిగిపోవచ్చు.
 
ఒకసారి టెనెసీలో ఇలా జరిగింది.. ఒకావిడ తుపాకుల దుకాణానికి వెళ్లింది. ప్రజలు దుకాణానికి అప్పుడప్పుడూ వెళ్లి కొత్త తుపాకులు కొనుక్కోవడం టెనెసీలో మామూలే. అలాగే ఆమె తుపాకుల  దుకాణానికి వెళ్లింది, “మా ఆయన కోసం నాకో రివాల్వరూ, కొన్ని బులెట్లూ కావాలి” అని అడిగింది. దుకాణదారు, “ఆయనకి ఏ బ్రాండు ఇష్టపడతారు?” అని అడిగాడు. అందుకు  ఆమె, “నేను దీన్ని ఆయన మీద వాడబోతున్నానని  ఆయనకి చెప్పలేదు.” అన్నది
 
మృత్యువు మిమ్మల్నెప్పుడు తీసుకుపోతుందో మీకు చెప్పదు. అందుకే దీపావళి పండుగ మీరు స్పృహతో జన్మించవచ్చు, స్పృహతో మరణించవచ్చు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరో వచ్చి మిమ్మల్ని షూట్ చేసేవరకు మీరు ఎదురుచూడవలసిన అవసరం లేదు. ఓ పురుషుడో, స్త్రీయో, బాక్టీరియానో, వైరసో, లేదా మీ జీవకాణాలే మిమ్మల్ని షూట్ చేసి వేస్తాయేమో… మీకు తెలియదు కదా. ఎవరో ఒకరు మనల్ని చంపుతారు. అందుకే, అప్పటి వరకు ఆగకుండా.. ఇప్పుడే.. నరకుడు అందరికీ ఇలా గుర్తు చేయాలనుకున్న కోరికను మీరు ఉపయోగించుకొండి.., “నన్ను నేను మలచుకో గలిగి ఉండేవాణ్ణి, కాని చెడును పోగుచేసుకున్నాను, ఇలా అయ్యాను.” అని నరకుడు అనుకోవడం గుర్తు చేసుకోండి..అది మంచిది.
 
అందరూ ఒక పదార్థంతో తయారయ్యారు. కానీ ఎవరికీ వారే ఎంత విభిన్నంగా తయారయ్యారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీరు ప్రతిరోజూ పోగుచేసుకుంటున్నదేమిటీ అన్నది. మీరు మీలో విషం తయారుచేసుకుంటున్నారా? మారుతున్నారా? లేకపోతే మీలోని దివ్యత్వపు పరిమళాన్ని వికసింప చేసుకుంటున్నారా? మీకున్న ఎంపిక ఇదే. మంచి పుట్టుక కలిగీ ఉండి కూడా, చెడ్డగా మారడమన్న ఈ నరకుడి కథకు చాలా ప్రముఖ్యత ఉనది. కృష్ణుడికీ, నరకుడికీ మధ్య భేదం ఏమిటి? మరణసమయంలో నరకుడు దీన్ని గ్రహించాడు. వీళ్ళిద్దరూ, ఎవరు ఎలా పరివర్తన చెందారన్నదే భేదం. కృష్ణుడు తనను దైవసమానుడుగా మలచుకోగా, నరకుడు రాక్షసుడయ్యాడు. మనందరికీ ఇలా ఎంచుకునే అవకాశముంది. మనకి ఈ అవకాశమే లేకపోతే మన ముందున్న అద్భుతమైన  ఉదాహరణలకు  ప్రయోజనమేముంది? ఒక వ్యక్తి అదృష్టవంతుడు కావడం వల్లో, లేకపోతే జన్మతః అటువంటి వాడుకావడమో దానికి కారణంకాదు. ఒక వ్యక్తి ఒక నిర్దిష్టరీతిలో తయారుకావడానికి ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది.
 
జీవితంలో ఎదురుదెబ్బ తగిలే వరకు ఎదురు చూడకుండా, మిమల్ని మీరే సరైన పద్ధతిలోకి మలచుకోవాలి. ఇదీ ఎంపిక అంటే. నరకుడు కృష్ణుడు వచ్చి తనను కొట్టడాన్ని ఎంచుకున్నాడు. కృష్ణుడు తనను తాను మలచుకున్నాడు. వీళ్ళిద్దకీ భేదం ఇదే. ఒకరిని దేవుడిగా పూజిస్తున్నాం, మరొకరిని రాక్షసుడిగా అసహ్యించుకుంటున్నాం, అంతే. మిమ్మల్ని మీరు సరైన మార్గంలోకి మలచుకోండి, లేకపోతే జీవితం దాని పద్ధతుల్లో మిమ్మల్ని మలుస్తుంది. దీపావళి దీన్ని గుర్తు చేస్తుంది. మనలో ఈ చైతన్యాన్ని వెలిగిద్దాం.
- సద్గురు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉసిరి చెట్టు క్రింద దీపారాధన చేసి... వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా...?