Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#EidMubarak నేడు రంజాన్ పండగు... 112 యేళ్ళ తర్వాత ఆ పరిస్థితి...

#EidMubarak నేడు రంజాన్ పండగు... 112 యేళ్ళ తర్వాత ఆ పరిస్థితి...
, సోమవారం, 25 మే 2020 (09:00 IST)
ముస్లిం సోదరుల అతిపవిత్రమైన పండుగల్లో ఒకటైన రంజాన్ పండుగ నేడు. అయితే, కరోనా వైరస్ మహమ్మారితో పాటు.. లాక్డౌన్ కారణంగా రంజాన్ సామూహిక ప్రార్థనలు చేసుకోలేని నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. అలాగే, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి. ఫలితంగా ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో ఈ పరిస్థితి ఉత్పన్నంకావడం గత 112 యేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
నిజానికి కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా రంజాన్ మాసం కళ తప్పింది. అందరూ ఎంతో ఇష్టపడే హలీం ఈసారి మాయమైంది. షాపింగ్ లేక మార్కెట్లు కళ తప్పాయి. ఈ సీజన్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు రూ.500 కోట్ల వ్యాపారం సాగేది. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారం దారుణంగా దెబ్బతింది. 
 
ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాలు సహా నగరంలోని ప్రధాన మార్కెట్లన్నీ బోసిపోయాయి. హైదరాబాద్‌లో రంజాన్ నెలలో 12 వేలకు పైగా హలీం బట్టీలు కనిపించేవి. ఈసారి ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. ఇక్కడ తయారు చేసే హలీం విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. హైదరాబాద్ హలీంకు అంతటి ప్రాచూర్యం ఉంది. 
 
అయితే, 112 యేళ్ల క్రితం అంటే 1908లో మూసీనదికి వచ్చిన వరదలు జనజీవనాన్ని కకావికలం చేస్తే ఇప్పుడు కమ్ముకొచ్చిన కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ రెండు సందర్భాల్లోనూ ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లకే పరిమితం చేశారు. అప్పట్లో ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా ఇంటిలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఇప్పుడు అవి తెరుచుకోకపోవడంతో ఇంటిలోనే ఈదుల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు.
 
కాగా, ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సమాజానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తో పాటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడులు రంజాన శుభాకాంక్షలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-05-2020 సోమవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని ఆరాధిస్తే...