Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్ రెస్టారెంట్లలో ఎలుక మాంసం వంటకాలు!!!

బీహార్ రెస్టారెంట్లలో ఎలుక మాంసం వంటకాలు!!!

PNR

FileFILE
బీహార్ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారా? అక్కడ ఏదేని మంచి రెస్టారెంట్‌లో కడుపారా ఆరగించాలని తోసిందా.? మీరు మంచి మాంసాహార ప్రియులా? రెస్టారెంట్‌ వెయిటర్‌‌ను సంప్రదించకుండానే మీకిష్టమైన నాన్‌వెజ్ వంటకాలకు టకటకా ఆర్డర్ ఇవ్వడం, వడ్డించడం.. ఆరగించడం అంతా జరిగిపోయిందా..?

ఇంతవరకు బాగానే ఉంది. అసలు మీరు ఆరగించింది.. మీకు ఇష్టమైన చికెన్, మటన్ వంటకాలేనా అని తినేముందు ఆలోచించారా? లేకపోతే.. మీరు మోసపోయినట్టే. ఎందుకంటే.. బీహార్ చిన్నపాటి రెస్టారెంట్లలో మటన్ వంటకాల్లో ఎలుక మాంసం ఐటమ్స్‌కు మంచి ఆదరణ ఉందట.

చికెన్, మటన్‌లతో పోల్చుకుంటే ఎలుక మాంసంలో అధికశాతం ప్రోటీన్లు ఉన్నాయని, ఈ మాంసం ఆరగించడం వల్ల ఎలాంటి వ్యాధులు మన దరిచేరవని సాక్షాత్ ఆ రాష్ట్ర ఎస్సీఎస్టీ సంక్షేమ శాఖామంత్రి సెలవిస్తున్నారు.! గిరిజన తెగల్లో ఒక వర్గం వారు తినే ఎలుక మాంసం.. ఇకపై బీహార్ రెస్టారెంట్లలో మాంసాహార జాబితాలో చోటు చేసుకోనుంది.

దీనిపై ఆ రాష్ట్ర ఎస్సీఎస్టీ సంక్షేమ శాఖామంత్రి జితన్ రామ్ మంజీ ఏమంటున్నారో తెలుసుకుందా రండి. ఎలుక మాంసం ఆరగించడం వల్ల ప్రోటీన్ల శాతం పెరగడమే కాకుండా.. ఎలాంటి వ్యాధులు రావని అంటున్నారు. అంతేకాదండీ 'ముషారస్' (ఎలుక మాంసం ఆరగించే ఒక తెగ) వర్గం వారిని ఆర్థికపరంగా ఆదుకోవడమే కాకుండా.. వారికి జీవనోపాధి కల్పించినట్టు అవుతుందని చెప్పుకొస్తున్నారు.

దీనివల్ల బీహార్ రాష్ట్రంతో పాటు.. పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ముషారస్ తెగ ప్రజల ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడతాయని అంటున్నారు. అంతేకాదు.. తాను, తన కుటుంబం చిన్ననాటి నుంచి ఎలుక మాంస ప్రియులమని చెప్పారు. ఈ అలవాటు చిన్ననాటి నుంచి ఉందట. ఈ మాంసం శరీరానికి ఎంతో సురక్షితమైందని, ఎలాంటి కొవ్వు వ్యాధులను దరిచేరనీయదని చెప్పారు.

ఇదే విషయాన్ని తమ వైద్యులకు చెప్పినట్టు తెలిపారు. అలాగే బీహార్‌లోని రెస్టారెంట్లలో ఎలుక మాంసాన్ని ఎందుకు సర్వ్ చేయకూడదు అని మంత్రి ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దళితుల్లోని ఒక తెగ ప్రజల్లో ఆర్థిక స్థితిగతులు పెంచవచ్చనేది మంత్రి వాదన. అంతేకాదండీ.. ఆ రాష్ట్ర సంక్షేమ బోర్డు కూడా.. ఎలుక ఫామ్‌లను అభివృద్ధి చేసే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది.

రెస్టారెంట్ల మెనూ కార్డుల్లో ఎలుక మాంసం వంటకాలు చోటు చేసుకుంటే దళిత వర్గం ప్రజలు ఆర్థిక స్థితిగుతుల మెరుగుపడుతాయని మంత్రి మంజీ సెలవిస్తున్నారు. అందువల్ల బీహార్ రాష్ట్ర పర్యటనకు వెళ్లే మాంసాహార ప్రియులు... కాస్త ఆలోచించి తమకు ఇష్టమైన నాన్‌వెజ్ ఆర్డర్లు ఇచ్చుకోవడం మంచిది సుమా...!!!

Share this Story:

Follow Webdunia telugu