Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండల తీవ్రత - గడిచిన మూడు రోజుల్లో 100 మంది మృతి.. ఎక్కడ?

ఎండల తీవ్రత - గడిచిన మూడు రోజుల్లో 100 మంది మృతి.. ఎక్కడ?
, ఆదివారం, 18 జూన్ 2023 (12:16 IST)
ఉత్తర భారతంలో సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో అనేక మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎండల తీవ్ర, వడదెబ్బకు గత మూడు రోజుల్లో ఏకంగా వంద మంది వరకు చనిపోయినట్టు ఆయా రాష్ట్రాల అధికారులు వెల్లడించారు. ఇందులో 60 యేళ్లు పైబడినవారే అధికంగా ఉన్నారు. 
 
ఎండల తీవ్రత, వడగాలులు, డీహైడ్రేషన్, జ్వరం, డయేరియా తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఎండల తీవ్ర కారణంగా అనారోగ్యం పాలయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని బాలియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 
 
సాధారణ అనారోగ్యంతో పాటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉందని అన్నారు. బయట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల శరీరంలో టెంపరేచర్‍‌ను సమతూకం చేయడానికి అవయవాలపై ఒత్తిడి పెరుగుతుందని, ఫలితంగా వాటి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. 
 
గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలపై ఒత్తిడి పెరుగుతుందని, ఇది గుండెపోటులతో పాటు ఇతర అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. మరోవైపు, ఎండల ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను ఈ నెల 24వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందు నీ బాధ తీరుస్తా - తర్వాత సంగతి తర్వాత : పవన్ కళ్యాణ్