Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉందా? లేదా?

Rahul Gandhi
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (17:42 IST)
మోడీ ఇంటి పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆయనకు గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇపుడు ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాలకు ఆయన హాజరయ్యేందుకు వీలుంటుందా? రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
కాగా, తాను ఏ తప్పూ చేయలేదని, తనను నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు అంతగా రుచించవని, ప్రజాజీవితంలో కొనసాగేవారు మరింత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికింది. 
 
అయితే, సూరత్‌ కోర్టు ఖచ్చితంగా రెండేళ్ల పాటే శిక్ష విధించడానికి కారణాలేంటో తెలియదని, దాని మూలంగానే రాహుల్‌పై అనర్హత వేటు పడిందని తెలిపింది. 'ఒక్క రోజు తక్కువగా శిక్ష వేసినా.. అనర్హత వేటు నుంచి ఆయన బయటపడేవారు కదా' అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
 
మరోవైపు, సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా పేర్కొంటూ రెండేళ్ల శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం వెంటనే అతడిపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. 
 
జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఉన్నత న్యాయస్థానం అతడి విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో రాహుల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా సాంత్వన చేకూరింది. 
 
శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాహుల్‌ తిరిగి ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు లోక్‌సభ సచివాలయం తెలపాల్సి ఉంటుంది. రాహుల్‌పై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. 
 
మరోవైపు సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో విచారణ జరిగి రాహుల్‌ నిర్దోషిగా విడుదలైనా, లేదంటే అత్యున్నత న్యాయస్థానం రాహుల్‌ శిక్ష కాలాన్ని 2 ఏళ్ల కంటే తక్కువ చేసినా రానున్న ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పోటీ చేసేందుకు వీలుంటుంది. ఆగస్టు 11 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల ఉసురు తగిలి చంద్రబాబు కుళ్లి కుళ్లి చస్తారు : పోసాని శాపనార్థాలు