Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాతృభూమి కోసం రెండో బిడ్డనూ త్యాగం చేస్తా : అమర జవాను తండ్రి

మాతృభూమి కోసం రెండో బిడ్డనూ త్యాగం చేస్తా : అమర జవాను తండ్రి
, శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (11:15 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కాశ్మీర్ రహదారిలో అవంతిపుర వద్ద ఉగ్రమూకలు జరిపిన ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బీహార్‌ రాష్ట్రంలోని బగల్‌పురాకు చెందిన రతన్ ఠాకూర్ అనే జవాను కూడా అమరుడయ్యాడు. 
 
తన బిడ్డ ఇకలేడని తెలుసుకున్న రతన్ ఠాకూర్ తండ్రి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజలను కదిలిస్తోంది. 'మాతృభూమి సేవలో పెద్ద కొడుకును కోల్పోయాను. ఇప్పుడు నా రెండో బిడ్డను కూడా సరిహద్దుల్లో పోరాటానికి పంపుతాను. మాతృభూమి కోసం వాడిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ పాకిస్థాన్‌కు మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే' అంటూ ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు. 
 
ఇదిలావుంటే, జమ్మూకాశ్మీర్‌ పోలీసులు ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎన్ఐఏ బృందం కూడా కాశ్మీర్ చేరుకుని విచారణ ప్రారంభించింది. దుర్ఘటనకు బాధ్యత వహిస్తున్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
అంతేకాకుండా, పుల్వామా దాడిని దేశంలోనే అతిపెద్ద ఆత్మాహుతి దాడిగా చెబుతున్నారు. 2001లో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. కాగా, ఘటన జరిగిన ప్రాంతంలో పేలుడుకు ఉపయోగించిన కారు ఆనవాళ్లు కూడా లేకుండా తునాతునకలైపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెల్మెట్ ధరించకపోవడంతో చనిపోయిన ముఖ్యమంత్రి భార్య!!