Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్సీ - ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చా : ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ

supreme court

ఠాగూర్

, బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (09:43 IST)
దేశంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలను వారిలోని ఉప కులాల ఆధారంగా వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చా అనే అంశంపై తలెత్తిన న్యాయపరమైన అంశాలపై ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతశ్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మానం మంగళవారం విచారణ ప్రారంభించింది. 
 
పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద పంజాబ్ షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్) యాక్ట్ 2006ను సవాల్ చేస్తూ దాఖలైన 23 పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు 22.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుండగా, పంజాబ్ రాష్ట్రంలో అది 25 శాతంగా ఉంది. పంజాబ్ రిజర్వేషన్ చట్టంలోని సెక్షన్ 4(5) ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లలో వాల్మీకి, మజ్హబీ సిక్కులు పోటీలో ఉంటే వారికి ప్రాధాన్యత ఇస్తూ 50 శాతం కోటా కేటాయించాలి. ఈ చట్టం వల్ల ఎస్సీలోని ఇతర కులస్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఇది రాజ్యాంగ విరుద్ధంటూ పంజాబ్ - హర్యానా హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2010లో పంజాబ్‌ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. 
 
ఆ తర్వాత 2011లో పంజాబ్‌ సర్కారు దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా.. ఇతర పిటిషనర్లు సైతం వ్యాజ్యాలను దాఖలు చేశారు. 2020 ఆగస్టు 27న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా(ప్రస్తుతం రిటైర్‌ అయ్యారు) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టం చేశారు. దాంతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ కేసులో పిటిషనర్లు 2004 నాటి 'ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌' కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ(చట్టం ముందు అంతా సమానులే)ను ఉల్లంఘిస్తోందని 2004 నాటి తీర్పు స్పష్టం చేస్తోంది. దీనికి తోడు.. ఎస్సీ కులాల గుర్తింపు బాధ్యత పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని, ఆయా కులాలను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 మేరకు రాష్ట్రపతి మాత్రమే నోటిఫై చేస్తారని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఏం జిట్టా బాలకృష్ణ.. ఉద్యమం అనేది మనకు అలవాటైన పనేగా" "" కేసీఆర్ కామెంట్స్