Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్యమతస్తులు వచ్చి వెళ్లేందుకు హిందూ ఆలయాలు పిక్నిక్ స్పాట్‌లు కావు.. : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

temples

ఠాగూర్

, బుధవారం, 31 జనవరి 2024 (12:53 IST)
ఇతర మతస్తులకు చెందిన వారు ఇష్టానుసారంగా వచ్చి వెళ్లేందుకు హిందూ ఆలయాలు పిక్నిక్ స్పాట్‌లు కావని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూయేతరులను ఆలయం వెలుపల ఉన్న ధ్వజస్తంభం వరకు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్తుల ప్రవేశాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయాన్ని తెలియజేసేలా ఆలయాల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ శాఖ అధికారులను ఆదేశించింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా పళని మురుగన్ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని, ఇతర మతస్తులు ఆలయంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ డి.సెంథిల్ కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. 
 
అలాగే, రాష్ట్రంలోని ఇతర మురుగన్ ఆలయాలకు కూడా హిందువులను మాత్రమే అనుమతించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ విచారించింది.
 
జస్టిస్ ఎస్.శ్రీమతి నేతృత్వంలోని బెంచ్.. పిటిషన్‌‌దారుడి వాదనతో ఏకీభవిస్తూ ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. ఇతర మతస్తులను ఆలయంలోని ధ్వజస్తంభం వరకు అనుమతించవచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని, ప్రతీ ఆలయం ముందు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. 
 
'హిందూ మతవిశ్వాసాలపై నమ్మకంలేని ఇతర మతస్తులను ఆలయంలోకి అనుమతించ వద్దు.. ఒకవేళ హిందూ మతవిశ్వాసాలపై నమ్మకంతో, భక్తుల నమ్మకాలను గౌరవిస్తూ ఆలయ దర్శనం కోరే ఇతర మతస్తులను ఆ మేరకు హామీపత్రం తీసుకుని అనుమతించవచ్చు. 
 
అయితే, ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటికి అనుగుణంగా దర్శనానికి వచ్చినపుడే లోపలికి అనుమతించాలి' అంటూ జస్టిస్ ఎస్ శ్రీమతి ప్రభుత్వానికి సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి ప్రత్యేక హోదా కాదు.. Special Status Beer తెచ్చారు.. షర్మిల