Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీనియర్ ఎన్టీఆర్ సి.ఐ.డి.కు యాభై ఏళ్ళు...

సీనియర్ ఎన్టీఆర్ సి.ఐ.డి.కు యాభై ఏళ్ళు...
, బుధవారం, 23 సెప్టెంబరు 2015 (13:40 IST)
ఎన్‌టిఆర్‌, జమున నటించిన సిఐడి చిత్రం మంచి హిట్‌ను సాధించింది. 1965 సెప్టెంబర్‌ 23న ఈ చిత్రం విడుదలైంది. విజయా సంస్థలో చక్రపాణి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం కథ గురించి చెప్పాల్సి వస్తే...
 
రవి(ఎన్టీఆర్‌). తన తండ్రి చలపతి (గుమ్మడి) ఒక జూదగాడు. ఒక రాత్రి కార్డులు ఆడుతున్నప్పుడు చలపతి ఒక దొంగను ఎదుర్కుంటాడు. పోరాట సమయంలో, అతను హఠాత్తుగా మరణిస్తాడు. నేరం చలపతి మీదకు వస్తుంది. అతను పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దూరంగా పారిపోయి డాన్‌ బాబాగా అవతరిస్తాడు. చలపతి పారిపోయే సమయానికి అతని భార్య పార్వతి(పండరీ బాయి) నిండు గర్భవతి. ఒక నర్సు ఆస్పత్రిలో చేరుస్తుంది. 
 
అప్పుడు ఆమెకు మగబిడ్డ పుడతాడు. తనకు కలిగిన బిడ్డకు రవి(ఎన్టీఆర్‌) అని పేరు పెట్టి విద్యావంతుడిని చేస్తుంది. ఆ తరువాత రవి సి.ఐ.డి ఇన్స్‌పెక్టర్‌ అవుతాడు. రవి బాబా కేసు దర్యాప్తుకై హైదరాబాద్‌ వస్తాడు. బాబాకు ఒక రోజు ఆ సి.ఐ.డి ఇన్స్‌పెక్టర్‌  తన కుమారుడని తెలుస్తుంది. రవి కేసుని ఛేదిస్తాడు మరియు అతని తండ్రి హత్య చేయలేదని రుజువు చేసి అసలు దొంగలను పట్టుకుంటాడు. సి.ఐ.డి. చిత్రం విజయావారి మార్కు చిత్రం. నవరసాలతోపాటు అదనంగా హాస్యానికి కొదవలేని, సరదాగా, హాయిగా చూసే సినిమా ఇది. 
 
విజయా వారు తమ సత్యహరిశ్చంద్ర సినిమా తరువాత వెంటనే మార్పు కోసం ఒక డిటెక్టివ్‌ సినిమా తీయాలని భావించారు. చక్రపాణి, డి.వి.నరసరాజు తదితరులు చర్చలు చేసి ఓ కథను తయారుచేశారు. చక్రపాణి ఆ కథకు చిత్రానికనుగుణంగా తయారు చేశారు. మాటలు డి.వి.నరసరాజు సమకూర్చారు. అంతవరకు బాగానే వుంది. మరి సినిమాకు ఏ పేరు పెట్టాలనే విషయంపై తర్జనభర్జనలు జరిగాయి. అనేకమంది అనేక పేర్లు సూచించారు. కానీ అవేవి నచ్చని చక్రపాణి చివరగా సి.ఐ.డి అనే పేరును ఖరారు చేశారు. అప్పటివరకూ ఇంగ్లీషు పేరు విజయవారి చిత్రలలో పెట్టలేదు, మరి ఈ చిత్రానికి ఇంగ్లీషు పేరు బాగోదేమోనని సందేహం వెలిబుచ్చారు కొందరు. మార్పు అనేది ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి అందుకు మనమే మొదలు పెడదాం అయినా సి.ఐ.డి అనే పదం వాడుకలో వున్నదే అని చక్రపాణిగారు ఆ పేరునే ఖాయం చేశారు.  
 
హుషారైన ఎన్టీఆర్‌ నటనతో జమున గ్లామర్‌ను అనుసంధానించి ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఆద్యంతమూ ఆసక్తిదాయకంగా మలచిన దర్శకుడు తాపీచాణక్య ప్రతిభకు తార్కాణం ఈ చిత్రం. ఇతర నటీనటులు- మిక్కిలినేని, రాజనాల, రమణారెడ్డి, చలం, రావి కొండలరావు, హేమలత, మీనాకుమారి తదితరులు నటించారు.

Share this Story:

Follow Webdunia telugu