Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ
FILE
స్వర్గీయ భానుమతీ రామకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.

"చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి పేరు చేరుతుందని సినీజనులూ, సినీ జనాభిమానూలు కూడా అంగీకరిస్తారు" - ఇది 1959 సెప్టెంబరు 16న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో "తెలుగు వెలుగులు" శీర్షికలో అచ్చయిన వ్యాసంలోని ప్రారంభ వాక్యం. నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు.

కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి కథల "భానుమతి"గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో. నేడు భానుమతిగారి జయంతి సందర్భంగా ఆ మహానటి గురించి...

1925వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.

1939 సంవత్సరంలో తొలిసారిగా "వర విక్రయం" అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన "కృష్ణప్రేమ", "స్వర్గసీమ" చిత్రాలు మలుపుతిప్పాయి. ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.

1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతిగారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రేమ వివాహం గురించి అందరికి తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతిగారు నిరశన దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతి గారికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు.

అవార్డులు, రివార్డుల విషయానికి వస్తే... ఇప్పటిదాకా భానుమతిగారు మూడుసార్లు జాతీయస్థాయి ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నారు. తమిళనాట కూడా ఆమె చిత్రాలు విజయదుందుభిని మోగించాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతికి ‘కలైమామణి’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. తమిళనాట ఆమెను అష్టావధానిగా పిలిచేవారు. ఎందుకంటే అప్పటికే భానుమతి నటిగానేగాక, తన పాత్ర కు తానే పాటలు స్వయంగా పాడుకునేవారు.

దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించిన భానుమతి మూడుతరాల నటులతో పనిచేసిన భానుమతిగారు... ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో "మంగమ్మగారి మనవడు" చిత్రంలో నటించడమేగాక, ఆ చిత్రంలో టైటిల్‌ రోల్‌ను కూడా పోషించారు. రచయితగా ఆమె రాసిన "అత్తగారి కథలు" ఆంధ్రలో విశేష ప్రాచుర్యం సంపాదించాయి. ఆ కథలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.

అంతేగాకుండా... భానుమతిగారు చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు "పద్మశ్రీ" బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం భానుమతి కళాసేవను గుర్తించి ఆమెకు "కళాప్రపూర్ణ" బిరుదుతో డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. ఆమె ‘నాలోనేను’ అనే స్వీయ నవలను కూడా రచించారు. అత్తగారి కథలు, నాలో నేను గ్రంథాలు ఆమెలోని ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి.

తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ 2005వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆ రకంగా మహానటి శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయినా.. ఆమె గళం నుంచి జాలువారిన "కోతి బావకు పెళ్లంట", "ప్రేమే నేరమౌనా", "ఓ బాటసారి నను మరువకోయి", "శ్రీకర కరుణాల" గీతాలు మాత్రం ఎప్పటికీ అజరామరంగా నిలిచే ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu