Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీత అగ్నిప్రవేశము చేయుట : రావణుని శరీర స్పర్శ కలిగివుండొచ్చు.. అది నా తప్పు కాదు..!

Webdunia
సోమవారం, 23 మే 2016 (16:35 IST)
రామలక్ష్మణులను చూసేందుకు సీత ఆత్రుతగా ఎదురుచూస్తున్నదని హనుమంతుడు చెప్పగా, రాముడు విభీషణుణ్ణి పిలిచి స్నానమాచరింప జేసి మంచి నగలు ధరించిన సీతను తన వద్దకు తీసుకుని రమ్ము'' అని ఆజ్ఞాపించెను. విభీషణుడు వెళ్ళి సీతకు తన అంతఃపురంలో వున్న ఆభరణములు ఇచ్చి రాముడి కోరిక మేరకు అలంకరించుకొనమని చెప్పెను. అమూల్యమైన ఆభరణములు, శ్రేష్టమైన వస్త్రములు ధరించిన సీతను పల్లకీలో రాముని వద్దకు తీసుకొని వచ్చెను. కానీ రాముడు సీతవంక చూడలేదు. రాక్షసుని ఇళ్ళల్లో చాలా కాలము నివసించి వచ్చిన సీతను చూసిన వెంటనే రామునకు సంతోషము, దైన్యము, కోపమూ వచ్చెను.
 
" నేను నా స్నేహితులతో కలిసి ఏ యుద్ధము చేసితినో అది నీ కోసము చేయలేదనే విషయము గ్రహించుము. నా చరిత్రను రక్షించు కొనుటకు, అన్నివైపుల నుండి లోకాపవాదము రాకుండా వుండుటకు, నా వంశము యొక్క కళంకము తుడిచివేయుటకు నేను ఈ యుద్ధము చేసితిని. నీకు మేలు కలుగుగాక. (VI 115, -16) ప్రవర్తన విషయమున సందేహింపదగిన నీవు నా ఎదుటనిలిచి, కంటి జబ్బుతో బాధపడుచున్న వానికి దీపమువలె నాకు చాలా భరింపశక్యము కాని దానవుగా ఉన్నావు. అందుకని నీకు నేను అనుజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ పది దిక్కులలో నీ కిష్టమైన దిక్కునకు వెళ్ళవచ్చును. నాకు నీతో పనిలేదు''. ఇలా రాముని వెంట అప్రియమైన మాటలు వస్తూ వుంటే, చాలా రోజుల తర్వాత కలుసుకున్న రాముని నోటివెంట ప్రేమపూర్వకమైన మాటలు వస్తాయని ఎదురుచూసిన సీత భయంతో వణికిపోతూ కన్నీరు కార్చింది. అంతమంది జనుల మధ్య రాముడు అలా మాట్లాడినందుకు సీత సిగ్గుతో క్రుంగిపోయింది. తరువాత కన్నీటిని తుడుచుకుని రాముని వద్దకు వెళ్ళి మెల్లగా ఇలా అన్నది:
 
''ఓ వీరుడా! ఒక సామాన్యపురుషుడు ఒక సామాన్య స్త్రీతో పలికినట్లుగా నాతో ఇట్టి తగని, చెవులకు దారుణమైన మాటలు పలుకుచున్నావేమి. నేను, నీవు అనుకున్నట్టు ప్రవర్తించినదానను కాను. నన్ను నమ్ముము. నా సత్ప్రవర్తనపై ఒట్టుపెట్టి చెప్పుచున్నాను. ప్రాకృత స్త్రీల ప్రవృత్తిని బట్టి నీవు స్త్రీ జాతినే శంకించుచున్నావు. నా స్వభావము ఎట్టిదో నీకు తెలిసిన విషయమే కాబట్టి ఈ అనుమానాన్ని విడువుము. నేను స్పృహలేని స్థితిలో రావణుని శరీరము స్పర్శ కలిగి వుండొచ్చు. అది దైవముయొక్క అపరాధమే కాని, అది నేను మనఃపూర్వకముగా చేసినది కాదు. పరాధీనమైన శరీర విషయమున అసమర్థురాలనైన నేను ఏమి చేయగలను.
 
ఇంతకాలము కలిసిమెలసి జీవించిన తరువాత కూడా నేను ఎలాంటి దానినో తెలిసికొనక పోయినచో నేను పూర్తిగా నశించినట్లే. హనుమంతుడి ద్వారా నేను లంకలో వున్నానని తెలిసినప్పుడే నన్ను ఎందుకు త్యజించలేదు. అలా చేసినట్లయితే నేను నా ప్రాణములు అప్పుడే విడిచిపెట్టి ఉండేదానను. నువ్వు ఇంత శ్రమపడవలసి ఉండేది కాదు. పవిత్రమైన భూమి నుండి పుట్టినదానిని. అట్టి నా పుట్టుకకు, నా మంచి నడవడికకు నీవు ఏ మాత్రము గౌరవము ఇవ్వలేదు. నా భక్తిని, శీలాన్ని అంతా వెనకకు నెట్టివేసినావు''. (VI. 116,2-16) ఈ విధముగా పలుకుచు, ఏడ్చుటచే బొంగురుపోయిన గొంతుతో, దీనుడై ఆలోచనలో మునిగి వున్న లక్ష్మణునితో ఇట్లు పలికెను. 
 
"లక్ష్మణా, ఈ కష్టాలకు ఔషధమైన చితిని నా కొరకు తయారు చేయుము. అసత్యమైన అపవాదుచేత దూషితురాలినైన నేను ఇక జీవించుటకు ఇష్టపడను. నా గుణములకు సంతోషించని భర్తచే జనుల సమక్షమున నిలబడిన నాకు, ఏ గతి పొందుట యుక్తమో, ఆ గతిని పొందుటకై అగ్నిలో ప్రవేశించెదను'' ఆ మాటలు విన్న లక్ష్మణుడు రాముని వైపు కోపముతో చూసెను. కాని ధర్మాత్ముడైన రాముని చూపులతో సూచించబడిన తన అభిలాషను తెలిసికొని అథని అభిమతము ప్రకారము చితిని పేర్చెను. పిమ్మట సీత తలవంచుకొని, రామునికి ప్రదక్షిణము చేసి ప్రజ్వలించుచున్న అగ్ని దగ్గరికి వెళ్ళి "నా మనస్సు ఎన్నడూ రాముని నుండి దూరము కానిచో, శుద్ధమైన చరితముగల నన్ను రాముడు దుష్టురాలుగా భావించుచున్నట్లయితే, నేను మనస్సు చేతగాని, వాక్కు చేతగాని, కర్మచేతగాని, ధర్మములన్నీ తెలిసిన రాముణ్ణి అతిక్రమించకున్నచో, సూర్యుడు, వాయువు, దిక్కులు, చంద్రుడు, భూమి ఇతర దేవతలునేను సచ్చరిత్రకలదానినని ఎరిగి ఉన్నచో, అగ్ని నన్ను రక్షించుగాక'' అని అగ్నికి ప్రదక్షిణము చేసి ఏమాత్రము శంకించకుండగ ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించెను. 
 
అలా సీత అగ్నిలో ప్రవేశించడం చూసిన జనులు, ఆడవారు భోరున ఏడ్చారు. దేవతలు బ్రహ్మ క్రిందకు దిగివచ్చి రామునికి, నీవు సాక్షాత్తు మహావిష్ణువు, నువ్వు ఎందుకు ఇలా సాధారణ మానవుడివలె ప్రవర్తించుచున్నావు. అని మహావిష్ణువు యొక్క విశ్వరూపాన్ని వర్ణిస్తాడు. ''నేను దశరథమహారాజు పుత్రుడిని, నేను ఒక సాధారణ మానవుడిని, నేను ఎందుకు ఇలా ప్రవర్తించుచున్నానో దేవతలైన మీరు నాకు చెప్పాలి'' అని రాముడు చాలా వినయంగా అడిగాడు. 
 
ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, ఆ చితిని పైకి త్రోసివేసి జనకుని కుమార్తె అయిన సీతను తీసుకొని పైకి వచ్చి.. "ఈమెయందు ఏ మాత్రము పాపములేదు. విశుద్ధమైన భావముగల, పాపములేని సీతను స్వీకరించుము" అని సీతను రామునకు అప్పగించెను. రాముడు అగ్నిదేవుడితో ''సీతను అనుమానించకుండా గ్రహించినచో లోకులందరూ, రాముడు ఎంత మూర్ఖుడు, కామమునకు వశమైన మనస్సు కలవాడు అని నన్ను గురించి చెప్పికొనగలరు. సత్యమును ఆశ్రయించి ఉన్న నేను మూడు లోకములలో కూడా లేదు. ఆత్మాభిమానము కలవాడు కీర్తిని ఎట్లు వదలజాలడో అట్లే నేను సీతను వదలజాలను" అని పలికి సంతోషముగా కళ్ళలో ఆనంద భాష్పాలతో సీతను తన వద్దకు చేర్చుకొనెను. 
 
సీతారాముల కలయికతో ఆ ప్రదేశమంతయు ఆనందోత్సాహములతో నిండిపోయెను. తరువాత విభీషణుడు ఇచ్చిన పుష్పక విమానంలో సీత, రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, వానరయోధులు, వానరులు అందరూ కలిసి అయోధ్యకు చేరిరి. భరతుడు రామునకు రాజ్యమును తిరిగి అప్పగించెను. రామునకు రాజ్యాభిషేకము చేసెను. రామరాజ్యములో ప్రజలు సుఖముగా నుండిరి. 
 
దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా|
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || 
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||. - దీవి రామాచార్యులు. (రాంబాబు) 

23 ఏళ్ల మహిళపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. గాయంపై కారం పొడిని..?

వైకాపాకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే : వైఎస్ షర్మిల

న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత

ప్రియురాలు దూరం పెడుతోందని కత్తితో పలుమార్లు పొడిచి దారుణ హత్య చేసిన యువకుడు

తెలంగాణకు గుడ్ న్యూస్: 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు

శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

16-04-2024 మంగళవారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా..

భద్రాచలం సీతమ్మకు సిరిసిల్ల నుంచి పెళ్లి చీర.. వెండి పోగులతో..?

ఏప్రిల్ 23.. కుంభరాశిలోకి అంగారకుడు.. ఈ రాశులకు అదృష్టం..?

15-04-2024 సోమవారం దినఫలాలు - స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు...

తర్వాతి కథనం
Show comments