Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామ పాదయాత్ర: అయోధ్య నుంచి రామేశ్వరం వరకు.. ఇసుక శివలింగం.. ధనుష్కోటి ప్రత్యేకత!!

శ్రీరామ పాదయాత్ర: అయోధ్య నుంచి రామేశ్వరం వరకు.. ఇసుక శివలింగం.. ధనుష్కోటి ప్రత్యేకత!!
, గురువారం, 26 మే 2016 (18:38 IST)
నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి రామేశ్వరం వెళ్లాను. అక్కడ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నాము. రామేశ్వరం సముద్రపు ఒడ్డున వుండటం వలన అలలు ఎగసిపడుతూ హోరున శబ్ధం వస్తూ ఉంటుంది. అయితే విచిత్రమేమిటంటే గుడికి ఎదురుగా సీతా ఘాట్ అనే ప్రదేశంలో సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వందడుగుల దూరం సముద్రంలోనికి వెళ్లినా అలలు వుండవు. నడుము లోతుకన్నా ఎక్కువ ఉండదు. కొన్ని వందల మంది స్నానం చేస్తున్నా అడుగున ఇసుకలోని పదార్థములు చాలా స్పష్టముగా కనబడతాయి. అక్కడనుండి 500 అడుగులు ప్రక్కకు వెళ్ళామంటే సముద్రపు అలలు ఎగిరిపడుతూ వుంటాయి. 
 
ఆ వింతలు చూసుకుని ఆ ఊరిలోనే వున్న అబ్దుల్ కలాంగారు పుట్టిన ఇల్లు, అతను చదువుకున్న పాఠశాల చూశాము. అక్కడ వున్న ఒక వ్యక్తి ద్వారా రామేశ్వరం పక్కనే ధనుష్కోటి అనే వూరును చూశాం. ధనుష్కోటి అనే ఊరు ఉండేదని కానీ 1962లో వచ్చిన వరదల వలన ఆ గ్రామం మొత్తం సముద్రగర్భంలో కలిసి పోయిందని తెలుసుకున్నాం. ఎలాగైనా ఆ ప్రదేశం చూడాలని కోరిక కలిగింది. ఆ వ్యక్తిని అడిగి తెలుసుకున్నాం. ఆ ప్రదేశం సముద్రపు ఒడ్డు నుంచి 10 కి.మీలు లోపలికి వెళితే చూడవచ్చు. 
 
అయితే మనం వెళ్లే కార్లు, జీపులు అక్కడికి వెళ్లలేవు. ఎందుకంటే 10 నుండి 15 కి.మీ. దూరం ఇసులో వెళ్ళాలి. సాధారణమైన బండ్లు ఇసుకలో కూరుకుపోతాయి. ఆ  ఇసుకలో వెళ్ళడానికి అనుకూలంగా తయారు చేసిన బండ్లు అక్కడే లభ్యమవుతుంది. నౌకాదళం కార్యాలయంలో అనుమతి తీసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. అలాగే అనుమతి తీసుకొని అక్కడ వున్న జీపును బాడుగకు మాట్లాడుకుని వెళ్లాం. ఇరువైపుల సముద్రం మధ్యలో ఇసుకలో పది కిలోమీటర్లు వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని శిథిలమైన కట్టడాలు కనబడ్డాయి. అదే ధనుష్కోటి. అక్కడి నుండి 5 కిమీ ఇంకా ముందుకు సాగిపోతే సముద్రం వస్తుంది. అక్కడి నుంచి శ్రీలంక 20 నుండి 25 కిలోమీటర్లు వుండొచ్చు. 
 
ఆ సముద్రపు ఒడ్డున నించుని చూస్తే ఒక విచిత్రమైన విషయాన్ని మనం గమనించవచ్చు. కుడివైపు పది అడుగులు వేస్తే అలలు చాలా ఉధృతంగా వుంటాయి. కాలు సముద్రంలో పెట్టితే లాక్కుని వెళ్ళిపోతాయి. దాన్ని రావణాసురుడి సముద్రం అంటారు. ఒక పది అడుగులు ఎడమవైపు వస్తే ఆశ్చర్యం, సముద్రం అలలు లేకుండా ప్రశాంతంగా వుంటాయి. ఈ నీరు పరిశుభ్రమంగా ఉంటాయి.
 
అలాగే మనం 50 అడుగుల నుండి వంద అడుగుల వరకు సముద్రం లోపలికి వెళ్ళినా ఏమీ కాదు. దాన్ని రాముడి సముద్రం అంటారు. అక్కడ నుండే రాముడు లంకకు వారధిని తట్టాడని చరిత్ర చెప్తోంది. రాముని కొరకు వానరసైన్యం లంకకు వారధిని నిర్మించింది. ఈ వారధి నిర్మాణానికి వాడిన రాళ్ళు నీళ్లలో తేలుతూ ఉండేవి. చూడటానికి మామూలు రాళ్ళలాగా బరువుగా వున్నా నీళ్ళలో వేయగానే తేలుతుంది. అలాంటి రాళ్ళను రామేశ్వరంలో ఒక రామాలయంలో మూడు పెద్ద పెద్ద రాళ్ళు నీళ్ళలో తేలుతూ వుండటం మనం చూడవచ్చు.
 
సాయంత్రం ఐదు గంటల లోపు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలి. లేకపోతే ఇసుకదారి అంతా సముద్రం నీళ్ళతో కప్పబడిపోతుంది. తిరిగి తెల్లవారుజామున సముద్రపు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితంలో ప్రతి మనిషి ఒక్కసారైనా ఆ ప్రదేశాన్ని చూడాలి. రామేశ్వరం నుండి ధనుష్కోటి వెళ్ళాలి అంటే 15 కిమీ అడవి ప్రాంతంలో ప్రయాణం చేయాలి. అలా కారులో ఆ ప్రదేశాలన్నీ చూసి తిరిగివస్తూ రాములవారిని మనస్సులో తలచుకున్న వెంటనే ఒక్కసారిగా నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట నీరు కారింది. ఏడుపు వచ్చేసింది. పెద్దగా ఏడవాలనిపించింది. 
 
నా కుటుంబ సభ్యులు చూసి కంగారుపడి ఏమైంది అని అడిగారు. నాకు రాముడు గుర్తుకువచ్చాడు. సీతమ్మకొరకు రాముడు ఎంత కష్టపడ్డాడు. కరెంట్ లేదు. సాంకేతిక పరికరాలు లేవు. వసతులు లేవు అలాగే రాత్రి అనక పగలు అనక కాలినడకన కొన్ని వందల కిమీ దూరం నడిచి వచ్చి సీతమ్మను తిరిగి పొందాడు. అది తలచుకున్న నాకు తెలియకుండానే దుఃఖం కలిగింది. 
 
నాకేకాదు సీతారాముల కష్టాలు తలచుకున్న ఏ మానవుడికైనా దుఖఃము కలుగుతుంది. అప్పటి నుంచి నాలో ఒక కోరిక కలిగింది. అసలు అయోధ్య నుండి రాముడు అడవులకు ప్రయాణమై 14 సంవత్సరాలు ఎక్కడ ఎక్కడ  తిరిగాడు. ఎక్కడి నుంచి సీతమ్మ కొరకు రామేశ్వరం వచ్చాడు అని తెలిసికోవాలనే ఆసక్తి నాలో బాగా కలిగింది. అప్పటి నుంచి విషయాలను సేకరిస్తూనే వున్నాను. నేను సేకరించిన విషయాల ప్రకారము రాముని వనవాస విశేషాలను తెలియజేయడమైనది. 
 
కైకేయి కోరిన వరం తీర్చడానికి తన తండ్రి దశరథుని ధర్మాన్ని కాపాడడానికి 14 సంవత్సరములు వనవాసానికి బయలుదేరాడు రాముడు. రాముడితో పాటు తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా అడవులకు పోవుటకు బయలుదేరారు. మంత్రి సుమంత్రి రథం ఎక్కి అడవులకు బయలుదేరారు. 13 సంవత్సరములు సీత, రామ లక్ష్మణులు కలిసే అడవిలో ప్రయాణం చేశారు. ఆఖరి సంవత్సరములో పంచవటిలో నివసిస్తుండగా రావణుడు సీతను ఎత్తుకుని పోయాడు. 
 
ఈ ఒక్క సంవత్సరము సీత లేకుండా రాముడు పడ్డ కష్టం ఏ మానవుడూ పడివుండడేమో. సీతాన్వేషణలో రాముడు పంచవటి నుండి రామేశ్వరం వరకు వెళ్ళాడు. అక్కడ వంతెన నిర్మించి లంకకు వెళ్ళాడు. రాముడికి రావణునికి ఘోరయుద్ధం జరిగింది. యుద్ధంలో రాముడిచేతిలో రావణుడు మరణించాడు. తిరిగి అయోధ్యకు వెళ్లేటప్పుడు, విభీషణుడు ఇచ్చిన పుష్పకవిమానం ఎక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ 14 సంవత్సరాలు రాముడు ఎక్కడెక్కడికి వెళ్లాడు అని కచ్చితంగా చెప్పడం కష్టమైన పని. కాని దొరికిన ఆధారాల ప్రకారం శ్రీరాముడు నడిచిన దారి ఈ క్రింద వివరింపబడినది. 
 
అయోధ్యలో బయలుదేరిన సీత, రామలక్ష్మణులు, సుమంత్రుడు ఆ రోజు రాత్రి తమసానది ఒడ్డుకు చేరుకుని అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. తామస నదికి ఆధునిక పేరు మాదర్‌నది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకి దగ్గరగా ఉన్నది. తామసనది ఒడ్డున పూర్వచాకియం అనే ప్రదేశం కలదు. ఇది అయోధ్యకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వున్నది. అయోధ్య ప్రజలు రాముడితోపాటు నడిచి ఆ నది వరకు వచ్చారు. ఆ రాత్రి ప్రజలకు తెలియకుండా రామలక్ష్మణులు, సీత ఆ ప్రదేశము వదలి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున లేచి చూస్తే రాముడు అక్కడ కనబడలేదు. ప్రజలు నిరాశతో అయోధ్యకు తిరిగి వెళ్ళిపోయారు. 
webdunia
 
అక్కడ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో వున్న సుల్తాన్‌పూర్ చేరారు. అక్కడ వున్న గోమతి నది వద్దకు చేరారు. సుల్తాన్‌పూర్‌కి పాతపేరు కుశనత్‌పూర్. దానికి రాముని కుమారుడైన కుశునిపేరు పెట్టారు. ఆ నదిని దాటి ప్రతాప్‌ఘర్‌కి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రావతినది వద్దకు చేరారు. రాముడు మోహన్‌గంజ్ అనే ప్రదేశము ఈ భద్రావతి నదిని దాటాడు. 
 
తర్వాత ప్రతాప్‌ఘర్‌కి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందడిక నది వద్దకు చేరారు. దానినే దేవిఘాట్ అని కూడా అంటారు. ఇక్కడ భరతుడు శివలింగాన్ని ప్రతిష్ట చేశాడని అంటారు. ఆ నదిని దాటిన తర్వాత ప్రతాపఘర్‌కి 15 కి.మీ దూరంలో ఉన్న బల్లూకిని నదిని దాటి ముందుకు సాగారు. అక్కడి నుంచి సుల్తాన్‌పూర్‌కి సుమారు 100 కి.మీ దూరంలో అలహాబాద్‌కి 20 కి.మీ ఉత్తరాన వున్న సింగ్ కోరకి చేరారు. అక్కడ వున్న పచ్చిక బయలుపై విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు గంగానదిని దాటి భరద్వాజ ఆశ్రమం వైపు ప్రయాణం సాగించారు. 
 
అక్కడి నుంచి సింగరోర్‌కి 2 కిమీ దూరంలో వున్న పవిత్రమైన సీతాకుండ్‌కు చేరుకున్నాడు. మంత్రి సుమంత్రుని ఈ ప్రదేశం నుంచి అయోధ్యకు వెనక్కు పంపేశాడు రాముడు. తర్వాత ప్రయాగ త్రివేణి సంగమం వద్దకు చేరారు. అది గంగ, యమున, సరస్వతి నదులు ఒకచోట కలిసే ప్రదేశం. అది చాలా పవిత్రమైన ప్రదేశము. అక్కడే భరద్వాజముని ఆశ్రమము కలదు. ఆ రోజు రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. 
 
మరుసటి రోజు బయల్దేరి యమునాఘాట్ వద్దకు చేరారు. వాల్మీకి రామాయణము ప్రకారం రాముడు చెప్పగా, లక్ష్మణుడు ఈ యమున నది దాటడానికి పడవను తయారు చేస్తాడు. పడవపైనే రాముడు యమున నదిని దాటుతాడు. అక్కడి నుంచి బయల్దేరి యూపీలోని చిత్రకూటం వైపు దాదాపు 135 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తారు. యమున నది దాటి కాలినడకన పోతూ మొదట రాయ్‌నగర్ చేరుతారు. ఇది తులసిదాస్ పుట్టిన ప్రదేశము. 
 
భరద్వాజముని చెప్పినట్లుగా రాముడు చిత్రకూటానికి చేరుకుంటారు. అక్కడ మందాకిని నది దగ్గరలో కామదగరి అనే పర్వతముపైన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. చాలామంది ఋషులు, మునులు అక్కడ ఆశ్రమాలు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఆ ప్రదేశము చాలా పవిత్రమైన ప్రదేశము. ఆ ప్రదేశమునందే భరతుడు వచ్చి రామునితో మాట్లాడి అతని పాదుకలు తీసుకుని అయోధ్యకు వెళ్ళినది. 
 
భరతుడు వచ్చి వెళ్లిన తర్వాత చాలా మంది ప్రజలు అయోధ్య నుండి రాముడిని చూడటానికి చిత్రకూటానికి రావడం మొదలెట్టారు. దానితో అక్కడ వున్న ఋషులకు రామునకు వారి ప్రశాంతతకు అడ్డుతగలడం వలన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టడానికి రాముడు నిర్ణయించుకున్నాడు. రెండు సంవత్సరములు చిత్రకూటంలో గడిపిన పిదప అక్కడ నుంచి బయల్దేరి అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ ఆశ్రమానికి 7 కి.మీ దూరంలో అమరావతి అనే ప్రదేశమున్నది. రాముడి వంశీకుడు అంబరీషుడు అనే రాజు ఇక్కడే గొప్ప తపస్సు చేశాడు. అత్రి మహాముని ఆశ్రమంలో అత్రి భార్య అనసూయ సీతమ్మకు పతివ్రతా ధర్మములను చెప్తుంది. 
 
ఆ రాత్రి అత్రిమహాముని ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు అమరావతికి వెళ్ళారు. అక్కడే రాముడు విరాధుడుని చంపటం జరిగింది. దానికి పక్కనే పెద్దగుంట వున్నది. దానిపేరు విరాధ్‌కుండ్. విరాధుడిని చంపిన తర్వాత అతని దేహాన్ని పూడ్చిన ప్రదేశము. చిత్రకూటానికి సుమారు 80 కిమీ దూరంలో మధ్యప్రదేశ్‌లోని సాతన అనే ప్రదేశము కలదు. విరాధుడిని చంపిన తర్వాత రాముడు శరభంగుని ఆశ్రమానికి వెళతాడు. ఇక్కడే రాముడు, శరభంగమునితో మాట్లాడుతున్న ఇంద్రుణ్ణి చూస్తాడు. రాముడిని చూచిన తర్వాత శరభంగముని దేహాన్ని వదిలి ఇంద్రుని ఆనతి ప్రకారం స్వర్గానికి వెళతాడు. 
 
శరభంగుని ఆశ్రమం నుండి సుమారు 430 కి.మీ. ప్రయాణం చేసి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి దగ్గరగా వున్నా రామ్‍‌టెక్ అనే ఒక అందమైన కొండపైన కొన్ని రోజులు రాముడు వున్నాడు. రామ్‌టెక్ నాగ్‌పూర్ నుండి బయల్దేరి దండకారణ్యంలో తిరుగుతూ మహారాష్ట్రలోని నాసిక్‌ దగ్గరలో వున్న సప్తశృంగి అనే ప్రదేశానికి చేరుకుంటాడు అక్కడే సుతీక్షణ ఆశ్రమం కలదు. ఈ ఆశ్రమానికి రావడానికి మునుపు దాదాపు 10 సంవత్సరములు దండకారణ్యములో రాముడు గడిపాడు. సుతీక్షణముని ఆశ్రమంలో కొంతకాలం వుండి అక్కడ వున్న రాక్షసులను హతమార్చి ముని ఆదేశానుసారం తన గురువైన అగస్త్యుని ఆశ్రమానికి బయలు దేరాడు. 
 
నాసిక్ పట్టణానికి  16 కి.మీ దూరంలో అగస్త్యుని ఆశ్రమము వున్నది. అక్కడ రాముడు అగస్త్యుని ఆతిథ్యం స్వీకరించిన పిదప అగస్త్యముని రామునకు అనేకములైన అస్త్రములను బహూకరించారు. అగస్త్యుని మాట ప్రకారము రాముడు పంచవటి చేరాడు. నాసిక్ పట్టణానికి దగ్గరలో గోదావరి ఒడ్డున పంచవటి అనే ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని రాముడు, సీత లక్ష్మణులు కొద్ది కాలం వున్నారు. 
 
రామాయణంలో పంచవటి ప్రదేశమునకు చాలా ప్రాముఖ్యత వున్నది. ఎందుకంటే శూర్పణఖకు ముక్కుచెవులు కోయుట, రాముడు ఖర దూషణాదులను మరియు 14000 మంది రాక్షసులను ఇక్కడే వధించటం జరిగింది. మారీచుని వధ, సీతాపహరణం, జటాయు మరణం కూడా ఆ అడవిలో జనస్థానం అనే ప్రదేశంలో జరిగింది. 
 
పంచవటి నుండి బయల్దేరి కర్ణాటకలోని బెల్లాం దగ్గరవున్న రాయ్ దుర్గ ప్రదేశానికి చేరుతారు. అక్కడికి దగ్గరలోనే కబంధుని ఆశ్రమము. రామలక్ష్మణులు కంబంధుడిని ఆ ప్రదేశంలోనే కంబంధుని ఆశ్రమము. రామలక్ష్మణులు కంబంధుడిని ఆ ప్రదేశంలోనే చంపుతారు. అప్పుడు కబంధుడు గంధర్వుడుగా మారి స్వర్గానికి వెళ్లేటప్పుడు రామలక్ష్మణులను శబరి ఆశ్రమానికి పోవలసిందిగా కోరుతాడు. 
 
రాయ్‌దుర్గకి 14 కి.మీ దూరంలో శబరి ఆశ్రమము కలదు. చాలాకాలం రాముని రాకకోసం శబరి ఇక్కడే వేచియుండెను. రాముడు వచ్చిన వెంటనే శబరి సంతోషముతో రుచిచూసి తియ్యగవున్న రేగుపండ్లు రామునకు పెట్టింది. శబరి చెప్పిన ప్రకారం సుగ్రీవుణ్ణి కలవటానికి రామలక్ష్మణులు కర్ణాటకలోని హంపి వద్దకు బయలుదేరారు. 
 
హంపికి దగ్గరలో వున్న హనుమాన్ హల్లి అనే ప్రదేశంలో రామలక్ష్మణులు మొట్టమొదటిసారిగా హనుమంతుణ్ణి కలుస్తారు. అక్కడి నుంచి హనుమంతుడు, రామలక్ష్మణులను తన భుజములపైన కూర్చుండబెట్టుకుని దగ్గరలోనే వున్న ఋష్యమూక పర్వతానికి తీసుకుని పోయి సుగ్రీవుణ్ణి పరిచయం చేస్తాడు. సుగ్రీవుని రాజధాని కిష్కింధ. 
 
హంపికి 4 కి.మీ దూరంలో మల్‌బావంత్ (ప్రస్తావన్) అనే కొండపైన సుగ్రీవుని ఆతిథ్యంలో కొంతకాలం గడిపారు. రాముడు ఇక్కడ వున్నప్పుడే హనుమంతుడు సీతజాడను రామునకు తెలిపెను. 
 
అక్కడ నుండి దాదాపు 700 కి.మీ దూరం ప్రయాణం చేసి తమిళనాడులోని తిరుచురాపల్లి చేరుకుని అక్కడ శివుణ్ణి ప్రార్థించుకుని, రామేశ్వరం వైపు బయల్దేరుతాడు. రామేశ్వరానికి ముందు రామపాదం, కోడికరై అనే ప్రదేశానికి వానరులతో చేరుకుంటాడు. అక్కడే మొట్టమొదటగా రామునకు సముద్రం మొదలు కనబడుతుంది. ఇప్పటికీ అక్కడ అడవిలో రాముడి పాదాలు మనకు కనబడతాయి. అక్కడి నుంచే లంకకు ఎలా ప్రయాణం అవ్వాలి అని రాముడు ఆలోచిస్తాడు. 
webdunia
ఫోటో కర్టెసీ - ఇషా ఆర్గ్
 
రామపాదం నుంచి రామేశ్వరం చేరుకుంటాడు. ఇక్కడే చెడుకరై అనే ఒక గ్రామంలో రాముడు సముద్రాన్ని దాటటానికి వంతెన కట్టడానికి శంకుస్థాపన చేసాడు. ఇప్పటికీ సముద్రంలో 10 అడుగుల అడుగు భాగంలో కనబడుతుంది. ఇక్కడికే విభీషణుడు రాముని శరణుకోరి వచ్చినది. యుద్ధప్రాతిపదికను నిర్ణయించినది ఇక్కడే. సముద్రాన్ని సహాయం చేయమని రాముడు కోరినది ఇక్కడే. 
 
రాముడు ఇసుకలో శివలింగముచేసి పూజించినది ఇక్కడే. రాముడు శివుడిని కొలిచిన ప్రదేశము కాబట్టే రామేశ్వరం అనే పేరు వచ్చింది. ఇక్కడి నుండే లంకకు వారధికట్టి, వానరులతో లంకకు చేరి, సువేలి పర్వతముపై నుండి రాముడు రావణునితో యుద్ధము చేసి రావణున్ని చంపి సీతను తిరిగి పొంది, విభీషణుడు ఇచ్చిన పుష్పకవిమానంలో రామ సీత లక్ష్మణ విభీషణ, హనుమంత, వానరులు అందరు కలిసి అయోధ్యకు వెళ్ళినది. 
 
14 సంవత్సరముల అరణ్యవాస సమయమున శ్రీరాముడు సుమారుగా 3500 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణం చేసినట్లుగా తెలుస్తున్నది. ప్రతిచిన్న ప్రదేశాన్ని గుర్తించడం కష్టం కాబట్టి తొందరగా గుర్తుకువచ్చే ప్రదేశాలను, గుర్తించగలిగిన ప్రదేశాలను మాత్రమే తీసుకుని శ్రీరామపాదయాత్ర వ్రాయడమైనది. ఇందులో పొరబాటువుంటే పెద్దలు పెద్ద మనస్సుతో క్షమించగలరు అని ఆశిస్తున్నాను.
webdunia
 
(1. రాముడి జన్మస్థలము- అయోధ్య 2. వాల్మీకి ఆశ్రమము - ఉత్తరప్రదేశ్, 3. గుహుడి రాజధాని - ప్రయాగ, 4. చిత్రకూటం- ఉత్తరప్రదేశ్, 5-6 మధ్య దండకారణ్యము, 6. నాగపూర్, 7. పంచవటి - నాసిక్, 8. తుల్జపూర్- మహారాష్ట్ర, 9. కంబంధుని ఆశ్రమము - కర్ణాటక, 10. హనుమంతుడు మొట్టమొదట రాముడిని కలిసిన ప్రదేశము - హంపి, 11. తిరుచ్చురాపల్లి- తమిళనాడు, 12. వేదారణ్యము, 13. రామనాథపురము, 14. రామేశ్వరము.) - దీవి రామాచార్యులు (రాంబాబు).

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియా నా పంచ ప్రాణాలు నీవే అంటాడు ప్రియుడు... ఇంతకీ పంచ ప్రాణాలు ఏమిటి..?