Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రావణుడు ఎందుకు సీత అంగీకారము కోసము వేచి వుండాల్సి వచ్చింది?

రావణుడు ఎందుకు సీత అంగీకారము కోసము వేచి వుండాల్సి వచ్చింది?
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (14:17 IST)
రావణుడు ఎందుకు సీత అంగీకారము కోసము వేచి వుండాల్సి వచ్చింది? దీని గురించి మనం తెలుసుకునే ముందు మనకు ఒక్క సందేహం రావచ్చును. రావణుడు రాక్షసుడు, దుర్మార్గుడు, స్త్రీలోలుడు, ఎంతోమంది స్త్రీల జీవితాలను నాశనం చేసినవాడు. ధర్మంలేనివాడు. పశుత్వం కలిగినవాడు.

అలాంటి రావణుడు సీతను ఎత్తుకుని వచ్చిన వెంటనే వివాహమాడక ఆమె అంగీకారం కోసం ఎందుకు వేచివున్నట్లు? సీత ఎన్ని మాటలు అన్ననూ రావణుణ్ణి ఎంత నిందించినను, ఓర్పుతో వున్నాడేగానీ సీతను బలాత్కరించలేదు. సీత అంటే భయమా రాముడంటే భయయా లేక వేరే కారణం ఏమైనా వున్నదా అని ఆలోచిస్తే, రావణుడే స్వయంగా మహాపార్శ్వునితో దానికి కల కారణం చెబుతాడు. 
 
యుద్ధకాండలో పదమూడవ సర్గలో కుంభకర్ణుని మాటలతో రావణునికి కోపం వచ్చినట్లు గ్రహించి, మహాపార్శ్వుడు రావణుడు ప్రీతికలిగించేందుకు ఇలా అంటాడు: 
 
ఓ రాక్షసరాజా! ఎంతో కష్టపడి మధువును సేకరించి దానిని తాగకుండా ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఉండటం అవివేకము. నీవు అందరికీ ప్రభువు. ఇంక నీకు ప్రభువు ఎవరున్నారు? నిన్ను శాసించే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఎవరికి భయపడాలి? కష్టపడి తెచ్చిన సీతను బలవంతంగానైనా తృప్తిగా అనుభవించు. ఆనందించు. ఆ తర్వాత వచ్చే పరిణామాలను మేము చూసుకుంటాము. సీత నీకు వంటింటి కుందేలు. నీ చెప్పుచేతలలో వుంది. నీ కోరిక తీర్చుకో. ఆలస్యం చేయకు. నేను, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు యుద్ధరంగంలో నిలబడితే మాకు ఎదురు నిలిచి పోరాడగల యోధుడు ముల్లోకములలో ఎవరున్నారు.

కార్యసాధనకు కొంతమంది సామ, దాన, భేదోపాయములను ఉపయోగిస్తారు. కానీ వీరులు దండోపాయమునే ఉపయోగిస్తారు. మనము వీరులము. మనకు దండోపాయమే తరుణోపాయము. నీ శత్రువులను అందరినీ మేము యుద్ధంలో అంతమొందిస్తాము. నీవు నిశ్చింతగా వుండు అని వీరోచితంగా పలికాడు మహా పార్శ్వుడు. 
 
మహాపార్శ్వుని మాటలకు రావణుడు ఎంతగానో సంతోషించాడు. అతనితో రావణుడు ఇలా అన్నాడు. "ఓ మహాపార్శ్వా! నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తంగా ఉంది. కానీ ఇక్కడ ఒక చిక్కువచ్చిపడింది. అది ఒక రహస్యము. చాలాకాలం కిందట నేను పుంజికస్థల అనే అందమైన అప్సరసను చూశాను. ఆ సమయంలో ఆమె బ్రహ్మలోకానికి వెళుతూ ఉంది. ఆమెను వెంబడించాను. పట్టుకున్నాను. బలవంతంగా అనుభవించాను.

ఆమె ఏడుస్తూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. బ్రహ్మదేవునికి జరిగినదంతా చెప్పినట్టుంది. బ్రహ్మదేవుడు నన్ను పిలిపించాడు. ''ఇక మీదట నీవు ఏ స్త్రీనైనా ఆమె అనుమతి లేకుండా, బలవంతంగా అనుభవిస్తే, నీ తల వేయిముక్కలైపోతుంది. ఇదే నా శాపము." అని దారుణంగా శపించాడు. ఆ కారణం చేత నేను సీతను బలవంతంగా అనుభవించడానికి భయపడుతున్నాను. లేకపోతే నేను సీతను లంకకు తీసుకొని వచ్చిన రోజే అనుభవించి వుండేవాడిని. అందుకే సీత నన్ను వరించేవరకూ ఎదురు చూడకతప్పదు". అన్నాడు. - ఇంకా వుంది. దీవి రామాచార్యులు (రాంబాబు).

Share this Story:

Follow Webdunia telugu