Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సారా తాగుతున్న దేవత

సారా తాగుతున్న దేవత
ఏది నిజం సీరీస్‌లో భాగంగా ఈ వారం మీకు మరో విభిన్నమైన అంశాన్ని పరిచయం చేయబోతున్నాం. దేవతకు సారాయిని నైవేద్యంగా పెడుతున్న ఆలయం వద్దకు తీసుకెళుతున్నాం. ఇక్కడ భైరవ దేవుడికి సారాను నైవేద్యంగా పెడుతుండటం మీరు చూస్తారు. ప్రసాదం రూపంలో దేవుడికి సారాను సమర్పిస్తున్న వైనం బయటపడటం ఇదే మొదటిసారి కావచ్చు.

రాట్లాం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో 'కవాల్కా మాత' ఆలయం ఉంది. చాలా కాలంగా ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయం విశేషం ఏమిటంటే, కవాల్కా మాత, కాళీ మాత, కాలభైరవుడి విగ్రహాలకు సారాను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. గిన్నె నిండా సారాయిని పోసి ఇక్కడి దేవతలు, దేవుడి విగ్రహం పెదవుల వద్ద ఉంచితే చాలు గిన్నెడు సారా అమాంతంగా మాయమవుతుంది. పైగా ఇది భక్తుల సమక్షంలోనే జరుగుతుండటం మరీ విశేషం.

ఈ ఆలయ పూజారి పండిట్ అమృత్‌గిరి గోస్వామి మాట్లాడుతూ ఈ ఆలయం 300 సంవత్సరాలుగా ఉనికిలో ఉందని, ఇక్కడ ఉంచిన విగ్రహాలకు మహత్తు ఉందని చెప్పారు. ఇక్కడి విగ్రహాలు సారా తాగడం వాస్తవమేనని ధృవీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు మహిమలు కలిగిన ఈ దేవతల వద్దకు వచ్చి తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు. కొడుకు పుట్టాలని కోరిన కోరిక తీరడంతో దేవతకు మొక్కు తీర్చుకోవాలని రమేష్ అనే భక్తుడు ఇక్కడికి వచ్చాడు. దేవతను సంతృప్తి పర్చడానికి మేకను తాను బలి ఇచ్చానని, తన బిడ్డ వెంట్రుకలను కూడా దేవతకు సమర్పించానని చెప్పాడు.
WD


దేవతలకు సారా సమర్పించిన తర్వాత సీసాలో మిగిలిన సారాను ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. కోరికలు తీరిన భక్తులు మొక్కులు సమర్పించుకోవడానికి ఆలయానికి చెప్పులు లేకుండా వస్తుంటారు. కొందరు భక్తులు జంతువులను బలి ఇస్తుంటారు. మహాలయ అమావాస్య, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేకమంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించి విగ్రహాలకు పూజలు చేస్తారు. కొందరు తమను ఆవహించిన దెయ్యాల పీడ వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు.

అయితే రాతి విగ్రహం ఎక్కడైనా సారాను తాగటం జరుగుతుందా.. లేదా ఇది ప్రజల విశ్వాసం మాత్రమేనా..! ఈ వింత కథ గురించి మీరేమనుకుంటున్నారు. దయచేసి మీ అభిప్రాయాలను మాకు తెలుపండి.

Share this Story:

Follow Webdunia telugu