Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శబరిమలపై సుప్రీం తీర్పు శాస్త్రాలకు విరుద్ధం : చినజీయర్ స్వామి

శబరిమలపై సుప్రీం తీర్పు శాస్త్రాలకు విరుద్ధం : చినజీయర్ స్వామి
, ఆదివారం, 18 నవంబరు 2018 (17:40 IST)
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 55 యేళ్ళ వయసున్న మహిళలకు అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చినజీయర్ స్వామి స్పందించారు. దేశంలోని ప్రతి ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని ఆయన గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు శాస్త్రాలకు విరుద్ధంగా ఉండటం సరిగాదని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
రాజ్యంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగం పరిధిలోనే వ్యవహరించాలని చినజీయర్ స్వామి అన్నారు. సమాజానికి ప్రమాదం లేకుండా స్వేచ్ఛను పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. రాజ్యాంగం శాస్త్రాలకు కల్పించిన హక్కులపై ఇతరులు కలగజేసుకోవడం సరికాదన్నారు.
 
ఒక్క శబరిమల అయ్యప్ప ఆలయం మాత్రమేకాదు ప్రతి ఒక్క ఆలయానికి ఈ నిరహా నిబంధనలు ఉన్నాయి. వాటిని నమ్మితే యధావిధిగానే వదిలివేయాలన్నారు. అలాంటివాటిపై నమ్మకం లేకపోతే వాటి జోలికివెళ్లరాదన్నారు. అందువల్ల కోర్టులు కూడా రాజ్యాంగ మేరకు నడుచుకోవాలని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకోరాదని చినజీయర్ వ్యాఖ్యానించారు.
 
నిజానికి శబరిమల ఆలయంలోకి అన్ని వయసు మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. సుప్రీంకోర్టును ఆదర్శంగా తీసుకుని పలువురు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించడం, వారిని అయ్యప్పభక్తులు అడ్డుకోవడం వంటి సంఘటనలతో కేరళ రాష్ట్రంలో ఉద్రిక్తతలకుదారితీసిన విషయం తెల్సిందే. 
 
'సమాజం బాగా ఉండాలంటే సమాజంలోని మనుషులతో సమానంగా జంతువులు, పక్షులు, చెట్లు, ఇతర జీవరాశులను గౌరవించాలి. స్నేహితులు, బంధువులను సమానంగా ఆదరించాలి. అదే సమతాభావం, అందరినీ సమానంగా చూడగలిగే మనస్తత్వం కలిగివుండాలి. సమానత్వానికి మానవ దేహమే ఆదర్శం. శరీరంలో అవయవాలన్నీ సమన్వయంగా మెలుగుతున్నాయి. కాబట్టే మనిషి ఆరోగ్యంగా ఉంటున్నాడు. అలాగే, మనిషితో సహా సకల జీవరాశులు సమన్వయంగా సమానత్వంగా మెలిగితేనే ఈ ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, శ్రీవేంకటేశ్వర స్వామికి గురువు శ్రీరామానుజర్ అని ఆయన చెప్పారు. వెయ్యేళ్ళ క్రితమే సమాజంలో సమానత్వం కోసం శ్రీరామానుజార్ కృషి చేశారని చెప్పారు. తన 120 యేళ్ళ జీవితకాలంలో ప్రతి ఒక్కరికీ సమానభావంతో చూడాలని కోరుతూ ప్రపంచ సమానత్వాన్ని చాటిచెప్పేందుకు, ఆచరణలో అమలు చేసేందుకు కృషి చేసిన వ్యక్తి రామానుజర్ అని ఈయన 11వ శతాబ్దికి చెందిన వ్యక్తి అని చెప్పారు. శ్రీపెరుంబుదూరులో జన్మించి, కంచిలో పెరిగి, శ్రీరంగంలో కేంద్రంగా చేసుకుని ప్రపంచ సమానత్వం కోసం పాటుపడిన వారు శ్రీరామానుజర్ అని చెప్పారు. 
 
ఒక రోజున తిరుమల గిరుల్లో వెలసిన స్వామి ఎవరు అనే సందేహం స్థానిక యాదవ రాజుతో పాటు ప్రతి ఒక్కరికీ కలిగింది. అపుడు రామానుజర్ అక్కడకు వెళ్లి ఆయన శ్రీమన్నారాయణ అని చాటిచెప్పారు. అందుకే ఇపుడు భక్తుల ఇలవేల్పుగా ఉన్న శ్రీనివాసుడు గురువు రామానుజర్ అని చినజీయర్ చెప్పారు. తిరుపతి బాలాజీ అని చెప్పగానే శంఖుచక్రాలు ముందుగా గుర్తుకు వస్తాయన్నారు. అంతేకాకుండా, తిరుమలలో ఈశాన్య దిక్కున రామానుజర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగిందని గుర్తుచేశారు. దీనిపైన భాష్యకారుల సన్నిధి అని రాసివుంటుందన్నారు.
webdunia
 
ఇకపోతే, కర్ణాటక రాష్ట్రంలోని మేల్‌కోట్టైకు వెళ్లి పాడుబడిన ఆలయాన్ని పునరుద్దరించి, తిరునారాయణ పెరుమాళ్ అనే స్వామిని ప్రతిష్టించి, ప్రపంచానికి సమానత్వం గురించి చాటిచెప్పిన వ్యక్తి అని చెప్పారు. నాడు.. నేడు హరిజనులుగా పిలువబడే వారిని తిరుక్కుళత్తార్‌గా గుర్తించి, వారికి కూడా స్వామి దర్శనం కల్పించి, ఆలయ ప్రవేశం కల్పించి, మనమంతా సోదరులమని ధైర్యంగా చెప్పిన వ్యక్తి రామానుజార్ అని చెప్పారు.
 
అలాగే, తొండనూరు అనే ప్రాంతంలో తిరుమలరాయ సాగర్ అనే డ్యామ్ నిర్మించడం జరిగింది. ఈ డ్యామ్ నిర్మాణం జరిగి వెయ్యేళ్లు అయిన ఇప్పటికీ అద్భుతంగా పని చేస్తుందన్నారు. అందుకే రామానుజర్ ఓ గొప్ప ఇంజనీర్, ఆర్కిటెక్టర్ అని చినజీయర్ చెప్పారు. అంతేకాకుండా వెయ్యేళ్ళ క్రితమే 50:50 రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆ రోజుల్లోనే అన్ని వర్గాల ప్రజలతో పాటు.. మహిళలకు కూడా ఆలయాల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించారని చినజీయర్ చెప్పుకొచ్చారు. 
 
అలాంటి మహనీయుడు కోసం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వలిటీ అనే పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్టు చెప్పారు. ఇది లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ కంటే ఎత్తైనదని చెప్పారు. ఈ విగ్రహం చుట్టూత 108 దివ్య దేశాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే యేడాది మే నెలాఖరు నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతుందని, అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చినజీయర్ స్వామి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం (18-11-2018) దినఫలాలు - మీరు పడిన కష్టానికి..