Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్షీర సాగర మధనంలో అమృత బిందువు ఒలికిందిక్కడే..!!

క్షీర సాగర మధనంలో అమృత బిందువు ఒలికిందిక్కడే..!!
PTI
క్షీర సాగర మధనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో ఒలికిందని పురాణాలు చెబుతున్నాయి. అలా అమృతం ఒలికిన నాలుగు ప్రదేశాలలో ఒకటి "హరిద్వార్". ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రమైన ఈ హరిద్వార్.. ఆ "శ్రీహరి"ని చేరుకునేందుకుగల "దారి"గా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. ఈ పరమ పవిత్ర ప్రదేశాన్ని ఓసారి దర్శిద్దామా..?!

భారతీయ సంప్రదాయానికి, నాగరికతకు ప్రతిబింబమైన హరిద్వార్‌ను శైవ మతస్తులు "హరద్వార్"గానూ.. వైష్ణవ మతస్థులు "హరిద్వార్"గానూ పిల్చుకుంటుంటారు. హరి అంటే "విష్ణువు" అనీ, హర "శివుడు" అని అర్థం. కాగా.. అమృత బిందువులు ఒలికిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి కాగా.. ప్రయాగ, ఉజ్జయినీ, గోదావరి నదీమతల్లి జన్మస్థలం అయిన నాసిక్‌లు మరో మూడు ప్రాంతాలు. ఇవి కూడా ప్రస్తుతం పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రాలలో అత్యంత భక్తి ప్రపత్తులతో కుంభమేళా నిర్వహిస్తుంటారు. 3 సంవత్సరాల వ్యవధికో ఒక్కొక్కొ క్షేత్రంలో కుంభమేళాను జరపటం ఇప్పటిదాకా ఆనవాయితీగా వస్తోంది. అదలా ఉంచితే.. ఉత్తరాఖాండ్ నైరుతీ భాగంలోని హరిద్వార్ నగర వైశాల్యాన్ని చూస్తే 2360 కిలోమీటర్లు. ఇది సముద్ర మట్టానికి 249.7 మీటర్ల ఎత్తులో, ఈశాన్య దిశగా శివాలిక్ కొండలకు దక్షిణంగా గంగానది మధ్యభాగంలో ఉంది.

హరిద్వార్‌లో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో హరి కీ పురి, చండీ దేవి, మానసాదేవి ఆలయం, మాయాదేవి ఆలయం, దక్ష మహాదేవ్ ఆలయం, నీల్ ధారా పక్షుల శరణాలయం, సతీకుండ్, భీమ్‌గోడా సరస్సు, జైరామ్ ఆశ్రమం, సప్తఋషి ఆశ్రమ్ మరియు సప్తఋషి కుండ్, పరాడ్ శివలింగం, దూధాధారి బర్ఫానీ ఆలయం, సురేశ్వరీ ఆలయం, పవన్ ధాం తదితర ప్రదేశాలు ముఖ్యమైనవి.

హరి కీ పురి స్నాన ఘట్టాన్ని.. విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా గంగానదీ తీరంలో కట్టించినట్లుగా చెబుతుంటారు. భర్తృహరి ఇదే ప్రదేశంలో తపస్సు చేసి, మరణించిన కారణంగా ఆయన పేరుతోనే ఈ నిర్మాణం చేపట్టిట్లు స్థానికుల కథనం. తరువాతి కాలంలో ఇదే "హరి కీ పురి"గా రూపాంతరం చెందగా.. దీన్నే "బ్రహ్మ కుండ్" అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ సాయంసమయాల్లో గంగాదేవికి హారతి ఇస్తుంటారు. అలాగే పితృదేవతల కోసం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు.

webdunia
PTI
తరువాత చూడాల్సిన మరో ప్రదేశం చండీ దేవి ఆలయం. గంగానదికి అవతలి తీరంలో నీల పర్వత శిఖరంపైన కొలువైన ఈ ఆలయాన్ని కాశ్మీరీ రాజు సుచత్ సింగ్ నిర్మించాడు. చండీ ఘాట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో నీల్ పర్వత శిఖరం పైన ఉంది. రాక్షస రాజులైన సుంభ-నిశుంభుల సైన్యాధిపతి చండ-ముండ ఈ ప్రదేశంలో చండీదేవిచే సంహరించ బడినట్లు పురాణాలు చెప్తున్నాయి. దీంతో ఈ ప్రదేశానికి చండీఘాట్ అని పేరువచ్చింది.

మనసులోని కోరికలను తీర్చే చల్లని తల్లి మానసాదేవి. బిల్వ పర్వత శిఖరంపైన కొలువైయున్న ఈ తల్లి ఆలయాన్ని సందర్శించాలంటే కేబుల్ కార్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆలయంతోపాటు నగరం అంతటినీ ఈ కేబుల్ కార్ ప్రయాణం ద్వారా వీక్షించవచ్చు. ప్రధాన ఆలయంలో 5 చేతులు మూడు ముఖాలు కలిగిన అమ్మవారి విగ్రహం.. 8 చేతులు కలిగిన విగ్రహం మరో విగ్రహాన్ని దర్శించవచ్చు.

అలాగే ఆదిశక్తి ఆలయమైన "మాయాదేవి కోవెల" కూడా దర్శించాల్సిన ప్రదేశం. ఇక్కడ సతీదేవి హృదయం నాభి పడినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. హరిద్వార్‌కు దక్షిణంగా ఉన్న కంకాళ్ అనే ఊరిలోని సతీదేవి తండ్రి అయిన దక్ష మహాదేవ్ ఆలయం చూడదగ్గది. శీతాకాలంలో విదేశీ వలసపక్షులతో అలరించే భీమగోడా ఆనకట్ట వద్ద ఉండే నీల్ ధారా పక్షుల శరణాలయం చూడాల్సిన మరో ప్రదేశం.

ఇంకా సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న యజ్ఞగుండం అయిన "సతీ కుండ్", హరిద్వార్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న "భీమ్‌గోడా సరస్సు" కూడా చూడదగ్గవే. పాండవులు హిమాలయాలలో ప్రయాణిస్తూ హరిద్వార్‌కి వచ్చినప్పుడు రాజకుమారుడు భీమసేనుడు దాహం తీర్చుకోవడానికి మోకాలితో రాతిపై కొట్టి, నీటిని రప్పించాడనీ.. తద్వారా ఈ సరస్సు ఏర్పడిందని పురాణాల కథనం. అలాగే కంఖాల్ హరిహర ఆశ్రమంలోని పరాడ్ శివలింగం చూడదగ్గదే. 150 కిలోల బరువుతో ఈ శివలింగం చుట్టూ రుద్రాక్ష చెట్టు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

హరిద్వార్ చేరుకోవటం ఎలాగంటే.. న్యూఢిల్లీకి హరిద్వార్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని అన్ని నగరాల నుంచి, ముఖ్య పట్టణాల నుంచి రైలు, రోడ్డు మార్గాలలో హరిద్వార్ వెళ్లవచ్చు. హరిద్వార్ అతి సమీపంగా రైల్వే జంక్షన్ ఒకటి ఉంది. ఢిల్లీ, రుషికేషన్ నుంచి ఇక్కడికి నిరంతరాయంగా బస్సు సర్వీసులు ఉన్నాయి. హరిద్వార్ చేరుకున్న తరువాత బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి టాక్సీలు, ఆటో రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ఇక చివరిగా చెప్పుకోవాల్సిందేంటంటే.. సాధారణంగా జూలై నెలలో హరిద్వార్‌లో విపరీతంగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అక్కడికి వెళ్లకపోవటం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu