Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షిర్డిసాయినాధుని దివ్యస్వరూపం కళ్లారా చూసి తరించా

ఎమ్. కృష్ణ

షిర్డిసాయినాధుని దివ్యస్వరూపం కళ్లారా చూసి తరించా
, గురువారం, 21 జులై 2011 (18:49 IST)
FILE
సైకిల్ స్వామి ఆశ్రమం వద్ద దిగి రూమ్‌కోసం.. మా కొలీగ్ అడిగాడు. అక్కడ రూమ్‌లు లేవన్నారు. అదేంటి. వారం రోజులనాడు ఫోన్‌ చేసి చెప్పానని గుర్తుచేశాడు. మాకు ఎవరూ చెప్పలేదన్నాడు ఆయన. ఇదిగో ఈ ఫోన్‌ నెంబర్‌‌కే చేశాను.. అంటూ మా కొలీగ్‌ కౌంటర్‌లో ఉన్న వ్యక్తికి చూపాడు. అయినా అతను మాకు ఎవరూ చేయలేదంటూ, ఇది అసలు మా ఆశ్రమం నెంబర్‌ కాదు పక్కనే ఉన్న ట్రావెల్స్‌ వారిదంటూ చెప్పాడు.

సరే.. ఇంతదూరం నుంచి వచ్చారు కాబట్టి, పక్కనే కొత్తగా కడుతున్న మా బిల్డింగ్‌కు వెళ్లి అక్కడకి వెళ్ళి బస చేయండి అన్నాడు. ఓ వ్యక్తిని వెంట పంపాడు. అప్పటికే రాత్రి పూట వర్షం పడడంతో రోడ్లన్నీ బురదగా ఉన్నాయి. బాగా నల్లరేగడి కావడంతో రొచ్చురొచ్చుగా ఉంది. అలానే జాగ్రత్తగా నడచుకుంటూ రూమ్‌ ఎలా ఉంటుందో అనుకుంటూ.. వెళుతున్న మాకు... కొత్త బిల్డింగ్‌ చూసి హమ్మయ్య అనిపించింది. చాలా నీట్‌గా ఉంది. అదేవిధంగా లోపల కూడా బాగానే ఉంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ 650/- రూపాయలు చెప్పాడు. రెండు రోజులకు బుక్‌ చేశాం.

అందరూ స్నానాదికార్యక్రామాలు ముగించే పనిలో ఉన్నాం. ఉదయం 10.30 గంటలకు సాయిబాబాకు హారతి ఇస్తున్నట్లు గుర్తుగా మంత్రాలు విన్పిస్తున్నాయి. ఈ టైమ్‌ ఇలా ఇస్తారని మా కొలీగ్‌ చెప్పాడు. ఆల్‌రెడీ ఆయన గతంలో ఓసారి వచ్చాడు. అంతా రెడీ అయి గుడికి బయలుదేరాం. రూమ్‌ నుంచి దగ్గరగానే గుడి ఉంది. అర్జెంటుగా సాయిబాబాను చూడాలనే ఆతృత అందరీలోనూ నెలకొంది. చెప్పులు స్టాండ్‌లో వదిలి.. అందరూ గుడి ద్వారం దాటి అలా లోపలికి వెళ్ళగానే జై సాయిరామ్‌.. జైజైసాయిరాం.. అంటూ కొందరు భక్తులు పారవశ్యంతో అనడంతో... వారితో గొంతు కలిపేవారు కొందరు... మా పక్కనే ఓ స్వామీజీ గెటప్‌లో ఓ భక్తుడు హిందీలో సాయిని స్తుతిస్తూ... డాన్స్‌ కూడా వేస్తున్నాడు. ఒక్కోరిది ఒక్కోశైలి.

కొందరు చప్పట్లు కొడుతున్నారు. అలా... లోపలికి వెళ్ళగానే బారులు తీరిన జనం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శన మార్గంలా అనిపించింది. పైన గోడలపై సాయిబాబా బోధనలు చెప్పే విధానాలు ఫోటోలతో భద్రపర్చినవి కన్పించాయి. కొన్ని సూక్తులు కూడా హిందీలో ముద్రించబడి ఉన్నాయి. వెలుగుతున్న పొయ్యిపై బాణలిలో సాయి తన చేయితో తిప్పుతున్నట్లు ఉన్న చెక్కిన ఫోటోలు... రకరాల భంగిమలతో కూడినవి కన్పించాయి. వాటిని చూసుకుంటూ.. చదువుకుంటూ.. నెమ్మదిగా లైన్‌ కదులుతుంటే.. అలా తిరిగి ఆఖరికి ఒక అంతస్తు పైకి ఎక్కాం... ఇక్కడే బాబా సమాధి ఉంటుందని మా కొలీగ్‌ చెప్పాడు.

కాసేపు భక్తులను ఆపేశారు. మేము మొదట లోపలికి వచ్చినప్పుడు నుంచి పరిశీలిస్తే... మమ్మల్ని దాటుకుంటూ, తోసుకుంటూ.. కొందరు ముందుగా వెళ్ళిపోయారు... ఎందుకు అంత తొందర అనిపించింది... దేవుడి కోసం వచ్చాం. కాస్త ప్రశాంతంగానే వెళ్ళవచ్చుగదా అనిపించింది. అలా అందరూ ఆలోచించరుకదా... భక్తుల్లో ఎక్కువగా తెలుగువారే కన్పించడం విశేషం.. మరాఠీ మాట్లాడేవారు కొందరు, తెల్లటి వస్త్రాలు కట్టుకుని పైన టోపీ పెట్టుకుని వారి సాంప్రదాయంతో వచ్చారు. తమిళం మాట్లాడేవారు కొందరు ఉన్నారు. అలా రకరకాల భక్తుల సమ్మేళనంతో షిర్డీని దర్శించుకున్నాం.

అప్పటికి మధ్యాహ్నం 12.40 అయింది. లోపల రద్డీగా ఉంది.. 'జరుగు... అంటూ.. హిందీలో అక్కడి వాలటీర్లు భక్తుల్ని తోసేస్తున్నారు. ఆ సన్నివేశం తిరుమలను గుర్తు చేసింది. తెల్లటి వస్త్రాలు ధరించినవారు నేరుగా సమాధి దగ్గర తలపెట్టి ప్రార్థించుకుంటున్నారు. కానీ మిగిలిన వారిని కుడివైపు, ఎడమవైపు పంపించి దర్శనం చేయించుకునేలా చేశారు. దవళధారి విగ్రహం షిర్డీసాయి ప్రతిమను చూస్తుంటే.. అలా చూడాలనిపించింది. సమాధిని టచ్‌ చేయడానికి వీలు లేకుండా అడ్డుగోడగా అద్దం పెట్టారు.

అయినా... పక్కనే చిన్న సందులోంచి కొందరు భక్తులు సమాధిని టచ్‌ చేసే పనిలో ఉన్నారు. మరికొందరు భక్తులు... సాయి విగ్రహం దగ్గర పూజారులతో ఆశీర్వాదం అన్నట్లు... కరచాలం చేస్తున్నారు. కొందరు గులాబీపూలు పూజారికి ఇస్తున్నారు. అవన్నీ పక్కనే పడేయటం. వాటిని వెంటనే తీసేసి చెత్తకుండీలో బయటకు తీసుకువెళుతుండటం చూసి బాధేసింది. మరికొందరు.. శాలువాలు పూజారికి అందిస్తే.. బాబా సమాధిపై ఉంచి వెంటనే వారికి ఇస్తున్నారు. ఇలాంటి శాలువాలు పవిత్రంగా ఇంటిలో భద్రపర్చుకుంటారట.

అలా దర్శించుకుని బయటకు వచ్చాం. రాగానే ఎదురుగా సాయిబాబా అప్పుడు కూర్చున్న వేపచెట్టు ఉంది. దాని చుట్టూ ఎవరూ రాకుండా... దడి కట్టారు. వేపచెట్టు ఆకు తీపిగా ఉంటుందని మా కొలీగ్‌ చెప్పాడు. వేపచెట్టు చేదుగా ఉంటుంది కదా.. అని నేను అడిగితే.. అదే సాయి మహిమ అన్నాడు.

ఆ చుట్టుపక్కల సాయి శిష్యుల సమాధులున్నాయి. మ్యూజియం ఉంది. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి.. ఇవన్నీ రేపు చూడవచ్చు. ఈ రోజు 'శని సింగనాపూర్‌' వెళదాం అని అన్నాడు. అది రానుపోను 150కి.మీ. ఉంటుంది. రాత్రికి వస్తాం... మళ్ళీ రేపు హడావుడిగా ఉంటుంది. రేపు రాత్రి మనం తిరుగు ప్రయాణం అన్నాడు. సరేనని గుడి నుంచి నడచుకుంటూ సైకిల్‌స్వామి ఆశ్రమంకు వచ్చాం. అక్కడ భోజనాలు ఉచితంగా పెడుతున్నారు. ఇది సేవా కార్యక్రమం అని మా కొలీగ్‌ చెప్పాడు. ఎంతమంది వచ్చినా... అక్కడి వాలంటీర్లు విసుక్కోకుండా భోజనాలు వడ్డిస్తుంటారు. మేమంతా అక్కడే భోజనాలు చేశాం. వంటకాలు ఇంటి భోజనాన్ని గుర్తు తెచ్చాయి.

భోజనం చేస్తుండగానే.. పక్కనే ఓ వాలంటీర్‌ మైకులో... 'అన్నం పరబ్రహ్మ స్వరరూపం.. దాన్ని వేస్ట్‌ చేయకండి. కావాల్సినంత అడిగి వడ్డించుకోండని చెబుతూ... చందాలు ఇవ్వాలనుకునే దాతలు క్యాష్‌ కౌంటర్‌లో ఇచ్చి తగిన రసీదు పొందండి.. అంటూ చెబుతున్నాడు. ఒహో... ఇలాగా ప్లాన్‌ చేశారా.. ఈ ఆశ్రమం వాళ్ళు అనిపించింది.

ఇక మిగిలింది మొత్తం రేపే చెప్పేస్తా...

Share this Story:

Follow Webdunia telugu