Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి లక్ష్మీ ఒంటరిగా రాదు.. సూర్యారాధనతో సర్వం శుభం

సంక్రాంతి లక్ష్మీ ఒంటరిగా రాదు.. సూర్యారాధనతో సర్వం శుభం
, గురువారం, 14 జనవరి 2021 (05:00 IST)
సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో మందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది.. సంక్రాంతి కాంతి నిచ్చే పండుగ. అందాల పండుగ. ఆనందాల పండుగ. పతంగుల పండుగ. ముగ్గుల పండుగ. గొబ్బెమ్మల పండుగ. హరిదాసుల పండుగ. గంగిరెద్దుల పండుగ. పాటల పండుగ. జానపదాల పండుగ. జనపదాల పండుగ. సర్వశుభాలను కలిగించే పర్వదినం.
 
హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి. భోగి, మకర సంక్రాంతి, కనుము అనే మూడు రోజుల పెద్దపండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణ కథనం. 
 
వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా సంక్రాంతి రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడు. పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది. సంక్రాంతి రోజున సూర్యారాధనతోపాటు పూజలు, తర్పణాలు, దానాలు లాంటివి చేస్తుంటారు. 
 
సంక్రాంతినాడు పాలుపొంగించి, దానితో పరమాన్నం చేస్తారు. ఇదే కాదు- అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పులిహోర, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తారు. ఇళ్లముందు తీర్చే ముగ్గుల ముచ్చట్ల విషయానికి వస్తే అలికిన వాకిళ్లు నిర్మలాకాశంతో సమానం.
 
కనుమ… ఇది ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రీతిప్రాప్తమైన పండుగ. తమకు సహకరించిన గోవులను, పశువులను, వ్యవసాయపనిముట్లను భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ఆవులు, పాడిగేదెలు, కోడెదూడలు, పెయ్యలు, ఎడ్లకు కుంకుమ బోట్లు పెట్టి భక్తి చాటుకుంటారు. కొన్నిచోట్ల తప్పెట్లు తాళాలతో వీటిని ఊరేగిస్తారు. ఈరోజు ప్రయాణాలు పెట్టుకోరు. 
 
సంక్రాంతి పండుగలో అంతర్లీనంగా శాస్త్ర, సామాజిక అంశాలు ఎన్నెన్నో వున్నాయి.. నువ్వులు, జొన్నలు, సజ్జలు, బియ్యం వంటి ధాన్యాలు-బీర, పొట్ల, చిక్కుడు, గుమ్మడి వంటి కూరగాయలతో ఆహార పదార్థాలను వండి తినడం ఆరోగ్యకరం.. కొంత మంది ముక్కనుమ పండుగను కూడా జరుపుకుంటారు. ఇలా ఆ మూడునాళ్లూ మురిపాలతో, ముచ్చట్లతో గడిచిపోతుంది. ప్రతిఇల్లూ ఆనందాల లోగిలిగా మారిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

bhogi 2021 భోగి నాడు చిన్నారులకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు?