Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబూ.. చీప్ ట్రిక్స్ పనికిరావని ఇందిరమ్మే చెప్పారుగా..!?

బాబూ.. చీప్ ట్రిక్స్ పనికిరావని ఇందిరమ్మే చెప్పారుగా..!?
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి కె.రోశయ్య ఫైరయ్యారు. తనను పనికిమాలిన, అవినీతి ముఖ్యమంత్రి అని పదేపదే వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామనే కనికరం లేకుండా చంపేసి ముఖ్యమంత్రి అయ్యారని ధ్వజమెత్తారు.

అప్పట్లో ప్రధాని ఇందిరా గాంధీ వద్దే చీప్ ట్రిక్స్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. స్వయాన మామ ఎన్టీఆర్‌పై సీటిస్తే మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ చీప్ ట్రిక్స్ చేసేందుకు ప్రయత్నించగా, ఇవన్నీ ఇందిరా గాంధీ తోసిపుచ్చారని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు.

తన మామ మీదనే పోటీ చేస్తానన్న చంద్రబాబు పోరు పడలేక లోపలికి తీసుకుంటే ఒక్క పోటు పొడిచి మామను తిరిగి రాని లోకాలకు పంపించి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. తానేమైనా చంద్రబాబులా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చానా? అని సీఎం ఎద్దేవా చేశారు. ఇంకా నేనేమైనా నీలా హత్య చేశానా? అని బాబును ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా జాక్ పాట్ కొట్టారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ముఖ్యమంత్రి తానేమీ ప్రజల బలంతో ముఖ్యమంత్రిని అయ్యానని డప్పు కొట్టుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతలను ఒక సైనికుడిలా నిర్వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

తాను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని కాలేదని, తనకు అధికారంలోకి రావడానికి ఒక్కటే దారి ఉందని, కాంగ్రెస్ నాయకత్వం నిబంధనల ప్రకారం కాంగ్రెసు శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేసిందని సీఎం గుర్తు చేశారు. చంద్రబాబు వంటి రాక్షస ముఖ్యమంత్రి రాష్ట్రంలో వేరొకరు లేరని.. ఇకపై మరో వందేళ్ళ వరకు ఇలాంటి వారు పుట్టబోరని రోశయ్య జోస్యం చెప్పారు.

నువ్వంటే మల్ల యోధుడివి నేను నీతో ఎలా కుస్తీ పడతాను అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు మల్లయుద్ధం చేస్తాడని, ఎక్సర్ సైజు చేస్తాడని, వీధుల్లోకి రావడానికి తాను అలా చేయబోనని ఆయన అన్నారు. ఎన్డీఏ ఆహ్వానిస్తే ప్రధాని పదవి నిరాకరించిన మహాత్యాగి చంద్రబాబు అని ఆయన ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ప్రపంచ నాయకుడని, బిల్ క్లింటన్, కోఫీ అన్నన్ చాలా మంది చంద్రబాబుతో మాట్లాడేవారని, చంద్రబాబు హిమాలయమంత ఎత్తు ఎదిగినవాడని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. తనది 59 ఏళ్ల రాజకీయ జీవితమని, చంద్రబాబు నిక్కర్లు వేసుకున్నప్పుడు తాను రాజకీయాల్లో ఉన్నానని రోశయ్య గుర్తు చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu