Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధ్యాత్మికం, ప్రకృతి శోభల సమ్మేళనం "చిత్రకూట్"

ఆధ్యాత్మికం, ప్రకృతి శోభల సమ్మేళనం
FILE
పవిత్ర నదీ జలాలు, సీతా సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శించిన సతీ అనసూయ ఆశ్రమం, రామ్‌ఘాట్, భూ అంతర్భాగంలో ప్రవహించే గుప్త గోదావరీ నదీమతల్లి, హనుమాన్ ధార, జానకీ కుండ్‌లాంటి పవిత్ర స్థలాలను సందర్శించాలంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ పరిసర ప్రాంతాలకు చేరుకోవాల్సిందే. ప్రకృతి అందాలతోపాటు ఆధ్యాత్మిక విశేషాలెన్నో కలిగిన ఈ ప్రాంతాలు పర్యాటకులకు మరపురాని అనుభూతులను అందిస్తాయి. అవేంటో చూద్దామా..?!

ముందుగా చెప్పుకోవాల్సింది సతీ అనసూయ ఆశ్రమం. చిత్రకూట్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలోగల మందాకినీ నది ఎగువభాగంలో ఈ సతీ అనసూయ ఆశ్రమం కలదు. ఈ ప్రాంతం దట్టమైన అడవుల సమాహారంతో ఉంటుంది. అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయ, వారి ముగ్గురు కుమారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ఆశ్రమంలో నివసించినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ ఆశ్రమంలో శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా సందర్శించినట్లు చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తోంది. చుట్టుప్రక్కల కొండల్లోంచి ప్రవహించే చిన్న చిన్న జలపాతాలన్నీ కలిసి ఏర్పడిన మందాకినీ నది ఈ ఆశ్రమం పక్కనుంచే ప్రవహిస్తూ కనువిందు చేస్తుంటుంది. ఇక్కడ పక్షుల కిలకిలారావాలను పరవశించి వినవచ్చు.

చిత్రకూట్‌లో మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలం రామ్‌ఘాట్. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పూజలు చేస్తుంటారు. మందాకినీ నదిలో బోట్ ప్రయాణం చేయడం ఓ గొప్ప అనుభూతి. బోట్‌లో ప్రయాణిస్తూ నదీ తీరాన్ని చూస్తుంటే ఆనందంతో పెద్దగా కేకలు వేయాలనిపిస్తుంది.

webdunia
FILE
మందాకినీ నదిలో భాగమైన మరో పవిత్ర స్థలం జానకీ కుండ్. ఇక్కడి నీళ్లు చాలా స్వచ్ఛంగా, ప్రకృతి కనువిందు చేసేలా ఉంటుంది. రామ్‌గఢ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం పడవలో ప్రయాణిస్తే జానకీ కుండ్ చేరుకోవచ్చు. రహదారి మార్గంలో అయితే దట్టమైన అడవిలో వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి జానకీ కుండ్ ప్రయాణం అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపక మానదు.

చిత్రకూట్ పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో గుహ అంతర్భాగంలో ప్రవహించే గుప్త గోదావరీ నదీమతల్లి చాలా ప్రశాంతంగా సాగిపోతుంటుంది. ఇక్కడ జంటగా రెండు గుహలు ఉంటాయి. వాటిలో ఒకటి వెడల్పుగా చాలా ఎత్తులో ఉంటుంది. అందులోంచి లోపలికి వెళితే మరొక గుహ కనిపిస్తుంది. అందులోనే గుప్త గోదావరిని దర్శించవచ్చు. బయటకు కనిపించకుండా భూ అంతర్భాగంలోనే ప్రవహిస్తుండటంవల్ల ఈ నదికి గుప్త గోదావరి అనే పేరువచ్చింది.

ఇక చివరగా చెప్పుకోవాల్సింది హనుమాన్ ధార. ఈ పవిత్ర జలధార చిత్రకూట్ కొండ ప్రాంతానికి చాలా ఎగువన ఉంది. 300 మెట్లు ఎక్కితేగానీ ఇక్కడికి చేరుకోలేం. హనుమంతుడి అతిపెద్ద విగ్రహాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. హనుమంతుడి పాదాలను స్పృశిస్తూ పవిత్ర జలధార ముందుకు సాగిపోతూ అందరినీ ఆకర్షిస్తుంటుంది.

లంకా దహనం తరువాత ఆంజనేయుడికి అగ్ని నుంచి ఉపశమనం కలిగించేందుకుగానూ శ్రీరామచంద్రమూర్తే స్వయంగా ఈ పవిత్ర జలధారను సృష్టించినట్లుగా స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. ఇకపోతే ఇదే ప్రాంతంలో మరో రెండు దేవాలయాలు కూడా ఉన్నాయి. కాగా.. ఇన్ని ఆధ్యాత్మిక విశేషాలు, కనువిందు చేసే ప్రకృతి శోభను కలిగి ఉన్న చిత్రకూట్ సందర్శనం పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగుల్చుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Share this Story:

Follow Webdunia telugu