Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్నెల్లుగా వేడి గదుల్లో కఠోర శిక్షణ.. ఇదే జర్మనీ ఫుట్‌బాల్ సక్సెస్!

ఆర్నెల్లుగా వేడి గదుల్లో కఠోర శిక్షణ.. ఇదే జర్మనీ ఫుట్‌బాల్ సక్సెస్!
, సోమవారం, 14 జులై 2014 (13:43 IST)
ఫుట్ బాల్ (పిఫా) ప్రపంచకప్ పోటీలలో జర్మనీ జగజ్జేతగా నిలిచింది. ఫేవరేట్ జట్టు అర్జెంటినా ఫైనల్ మ్యాచ్‌లో చివరి నిమిషంలో బోల్తాపడటంతో జర్మనీ విశ్వవిజేతగా అవతరించింది. ఫలితంగా జర్మనీ జట్టు అర్జెంటినా మీద 1 – 0 తేడాతో గెలుపు సాధించడం విశేషం. అదీ అదనపు సమయంలో ఈ గోల్ చేసి జర్మనీ జట్టు విజయం సాధించింది. కప్‌ను గెలుపొందిన జర్మనీకి రూ.210 కోట్ల నగదు బహుమతి, రన్నర్ జట్టు రూ.150 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన నెదర్లాండ్స్ జట్టుకు రూ.132 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న బ్రెజిల్ కు రూ.120 కోట్లు పారితోషికాలు లభిస్తాయి. అతిథ్య జట్టు బ్రెజిల్‌కు కప్ లభిస్తుందని మొదట్లో అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ దేశం నాలుగోస్థానానికి పడిపోయింది.
 
అయితే, జర్మనీ జట్టు ఎలా గెలిచిందనే దానిపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. గత 2000 నాటికి జర్మన్ ఫుట్‌బాల్ పతనం అంచులకు చేరింది. యూరో లీగ్ ఫుట్‌బాల్ పోటీల్లో పాయింట్ల జాబితాల్లో అట్టడుగులో ఉంది. ఫుట్‌బాల్ అధోగతికి చేరింది. అందరూ జర్మనీ కథ ఖతం అనుకున్నారు. 
పతనం అంచుల నుంచి అదే జర్మనీ ఇప్పుడు ప్రపంచ విజయం దాకా వచ్చింది. ఇదేలా సాధ్యమైంది?
 
2000లోనే జర్మన్ ప్రభుత్వం ఫుట్‌బాల్ ప్రతిభను గుర్తించి జర్మన్ జట్టుకు మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు పూనుకుంది. ప్రణాళికా బద్ధంగా అడుగులు వేసింది. ఈ ప్రణాళిక 2003లో అమలైంది. ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయస్సులో ఉండే యువకుల్లో ఫుట్‌బాల్ ప్రతిభలను గుర్తించింది. వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించింది. వీరందరికీ శిక్షణనిచ్చేందుకు దేశవ్యాప్తంగా అకాడెమీలను యుద్ధ ప్రాతిపదికన స్థాపించింది. ఇలా ఎంపికైన పిల్లల్లో ప్రతిభను అనుసరించి వారికి ఇచ్చే శిక్షణ కార్యక్రమం కోసం పక్కా ప్రణాళికను రచించింది. 
 
జర్మన్ జట్టులోని ఆటగాళ్లలో వయస్సు మళ్లిన వారి స్థానంలో యువకులను రంగంలోకి తీసుకుంది. కొన్నేళ్లలోనే జర్మన్ టీమ్ ఆటగాళ్లందరూ కోడెవయస్సు కుర్రాళ్లే ఉండేలా ప్రణాళిక అమలు చేసింది. జూలియన్ డ్రాక్స్‌లర్, ఆంద్రే ష్కుర్లె, స్వెన్ బెండర్, థామస్ ముల్లర్, టోనీ క్రూస్, మార్కో రియస్ వంటి ఆటగాళ్లందరూ ఈ ప్రణాళిక ద్వారా జట్టులోకి వచ్చిన వారే. 
 
ఈ యువ క్రీడాకారుల తయారీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ కోచ్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. జర్మనీలో బి లైసెన్స్ ఉన్న కోచ్‌లు 28000 మంది, ఏ లైసెన్స్ ఉన్న వారు 5500 మంది ఉన్నారు. వీరందరినీ ఉపయోగించుకుని ఆటగాళ్లకు సానపట్టారు. ఫిఫా కప్‌ను గెలిచేందుకు అన్ని ప్రత్యర్థి టీమ్‌ల ఆటను నిశితంగా పరిశీలించారు. బ్రెజిల్ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశారు. బ్రెజిల్‌లో ఉండే వేడి, చెమటను తట్టుకునేందుకు ఆటగాళ్లు గత ఆరునెలలుగా హాట్ రూమ్‌లలో ఆటలు ఆడేవారు. ఏసీ రూమ్‌లలోఉండటం మానేశారు. బ్రెజిల్ వాతావరణాన్ని తట్టుకునేందుకు పూర్తిగా అలవాటు పడేలా చేశారు. ఇంత నిశితమైన అధ్యయనం, నిరంతర ప్రయత్నం వల్లే పదేళ్ల కింద పతనం అంచున ఉన్న జర్మనీ నేడు విశ్వవిజేతగా అవతరించింది. 

Share this Story:

Follow Webdunia telugu