Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కామన్వెల్త్ గేమ్స్" ఆరంభోత్సవ సంబరాలు అదుర్స్!

FILE
దేశ రాజధాని నగరం ఆతిథ్యమిస్తోన్న కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ సంబరాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌ ఆతిథ్యాన్ని తొలిసారిగా దక్కించుకున్న భారత్‌, అవినీతి కుంభకోణాలు, స్టేడియాల నిర్మాణాల్లో అవకతవకలు, క్రీడాకారుల సదుపాయాల ఏర్పాట్లలో డొల్లతనం వంటి పలు సమస్యలను ఎదుర్కొంది.

పలు వివాదాల నడుమ ఎట్టకేలకు అక్టోబర్ మూడో తేదీ నుంచి 14వ తేదీ వరకు కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. ఈ క్రమంలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవాలకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం సిద్ధమైంది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే ఆరంభోత్సవ వేడుకలో ఏడువేల మంది కళాకారులు తమ సాంస్కృతిక విన్యాసాలతో కనువిందు చేయనున్నారు.

అవినీతి కుంభకోణాలతో ప్రపంచ దేశాల నుంచి విమర్శలెదుర్కున్న భారత్ కామన్వెల్త్ క్రీడలను విజయవంతంగా ముగించి ప్రపంచానికి తన సత్తా చాటాలని ఆరాటపడుతోంది. అందులో భాగంగానే ఈ మెగా ఈవెంట్ ఆరంభ వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా 45 నిమిషాల పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది.

ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, ఏర్పాట్లు వంటి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించామని సీడబ్ల్యూజీ తెలిపింది. ప్రస్తుతానికి ప్రధాన సమస్యలు ఏవీ లేవని మంత్రుల కమిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. అలాగే ఆరంభవేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలివ్వనున్న 7,000 మంది కళాకారుల భద్రత క్లియరెన్స్‌పై కూడా చర్చించి ఆమోదముద్ర వేయడం జరిగింద'ని జైపాల్ రెడ్డి వెల్లడించారు.

అయితే కామన్వెల్త్ క్రీడలను వాలంటీర్ల కొరత నిర్వాహకులను వేధిస్తోంది. కామన్వెల్త్ క్రీడోత్సవాల ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో, ఈ మెగా ఈవెంట్‌కు సేవలందిస్తామంటూ ముందుకొచ్చిన వాలంటీర్లు చివరి క్షణంలో పలాయనం చిత్తగించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న దాదాపు పదివేల మంది వాలంటీర్లు చెప్పాపెట్టకుండా తమకందజేసిన కిట్లతో సహా ఉడాయించారు.

ఇక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ విషయాన్ని పక్కనబెడితే.. సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో మన క్రీడాకారులు మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ కంటే అధికంగా పతకాలు సాధిస్తారా అని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీ విజయవంతంకావడంతో పాటు భారత క్రీడాకారుల బృందం మెరుగైన ప్రదర్శనతో పతకాల పంట పండించినపుడే ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నందుకు సార్థకత చేకూరుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత క్రీడాకారులు మాత్రం మెల్‌బోర్న్ గేమ్స్‌లో కంటే ఈ సారి ఎక్కువ పతకాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేదికల నిర్మాణాల్లో ఆలస్యం వల్ల ప్రాక్టీస్‌కు తగినంత సమయం లేకపోవడం ప్రతికూలమే అయినా, సొంత ప్రేక్షకుల నడుమ ఆడనుండడం తమకు కలిసొస్తుందని చెబుతున్నారు. 2006లో జరిగిన మెల్‌బోర్న్ గేమ్స్‌లో భారత్ మొత్తం 50 పతకాలతో నాలుగోస్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 17 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడాలు వరుసగా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

ఇదే తరహాతో తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున దాదాపు 400 మందికి పైగా క్రీడాకారులు 17విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు. వీరిలో అంతర్జాతీయ వేదికలపై మెరిసిన చాలామంది స్టార్ క్రీడాకారులు ఉన్నారు.

ముఖ్యంగా ఏస్ షూటర్లు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, రెజ్లర్ సుశీల్‌కుమార్, బాక్సర్ విజేందర్‌ సింగ్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, టెన్నిస్‌ స్టార్స్ సానియా మీర్జా, లియాండర్ పేస్, మహేశ్ భూపతి తదితరులు తమ విభాగాల్లో దేశానికి పసిడి పతకాలు అందిస్తారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu