Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైనా నెహ్వాల్ ఎండార్స్‌మెంట్ విలువ ఎంతో తెలుసా?

సైనా నెహ్వాల్ ఎండార్స్‌మెంట్ విలువ ఎంతో తెలుసా?
FILE
భారత మేటి షట్లర్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. ఆటలోనే కాకుండా సెలబ్రిటీల వాణిజ్య ప్రకటన మార్కెట్లో హాట్ ప్రాపర్టీగా మారింది. ఈ ఏడాది వరుస విజయాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్న సైనా నెహ్వాల్ ఎండార్స్‌మెంట్ విలువ కోటి రూపాయలకు చేరుకుంది.

ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించిన తర్వాత ఆమె పాపులారిటీ ఒక్కసారిగా పైపైకి పెరిగింది. ప్రపంచ బ్యాడ్మింటర్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సైనా నెహ్వాల్‌తో తాజాగా ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటనలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సైనా నెహ్వాల్ ఎండార్స్‌మెంట్ విలువ కోటి రూపాయలకు చేరుకుంది.

అంతకు ముందు రూ. 50లక్షలుగా ఉన్న ఎండార్స్‌మెంట్ విలువ కోటి రూపాయలకు చేరడంతో, సైనా నెహ్వాల్ స్పోర్ట్స్, బాలీవుడ్ సెలబ్రిటీలైన షౌకత్‌ఖాన్, సచిన్ టెండూల్కర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఏఆర్ రెహ్మాన్‌ల సరసన చేరింది. వరుస విజయాలతో బ్యాడ్మింటన్‌లో తన హవాను కొనసాగిస్తున్న సైనా నెహ్వాల్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చాలా కంపెనీలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి.

ఇప్పటికే ఎయిర్‌టెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సైనాతో ఆహార, మౌలిక సదుపాయాలకు సంబంధించిన మరో నాలుగు సంస్థలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకొస్తున్నాయని డక్కన్ చార్జెస్ స్పోర్టింగ్ వెంచెర్స్ మీడియా కో ఆర్డినేటర్, హెచ్. మంజుల తెలిపారు. డక్కన్ ఛార్జెర్స్ స్పోర్టింగ్ వెంచర్స్ సైనా అకౌంట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇండియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ సూపర్ సీరీస్‌లలో హ్యాట్రిక్‌కు తోడు, కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించడంతో సైనా అభిమానుల ఫేవరేట్ అయిపోయింది.

ఇప్పటికే డక్కన్ క్రానికల్ దినపత్రిక, అడాని విల్‌మార్స్ ఫార్చూన్ ఎడిబుల్ ఆయిల్, హెర్బలైఫ్స్ న్యూట్రిషనల్ ప్రాడక్ట్ రేంజ్ సంస్థలతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో గుజరాత్‌కు చెందిన ఆడాని విల్మార్ సైనాతో రూ.50 లక్షల ఎండార్స్‌మెంట్‌ను కుదుర్చుకుంది. దీన్ని పొడిగించడానికి కూడా ఆ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలపడం విశేషం.

ఇటీవల జరిగిన కామన్వెల్త్‌గేమ్స్‌లో చివరిరోజు స్వర్ణంతో మెరిసి.. భారత్‌కు పతకాల పట్టికలో ద్వితీయ స్థానాన్ని కట్టబెట్టడంతో అభిమానులు, ప్రేక్షకులు సైనాకు సర్వత్రా బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న వరల్డ్ నెంబర్ త్రీ.. చైనా నుంచి తిరిగొచ్చాక ఎయిర్ టెల్ ప్రచారంలో పాల్గొననుంది.

ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు వరుస విజయాల ద్వారా తన పాపులారిటీ పెరిగింది. ఈ పాపులారిటీ ఎండార్స్‌మెంట్ ఫీజును సైతం పెంచేలా చేసిందని చెప్పింది. ప్రస్తుతం తనతో వాణిజ్య ప్రకటనలు కుదుర్చుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏదైమైనా క్రికెటేతర క్రీడాకారులకు కూడా ఈ స్థాయిలో డిమాండ్ ఉండటం తనకెంతో సంతోషాన్నిస్తుందని సైనా వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu