Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్... ఎడమ తుంటికి ఫ్రాక్చర్

kcrao
, శుక్రవారం, 8 డిశెంబరు 2023 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. గురువారం అర్థరాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో బాత్రూమ్‌లో కాలుజారి పడిన విషయంతెల్సిందే. దీంతో ఆయనను ఆర్థరాత్రి సమయంలోనే యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై యశోద ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
సీటీ స్కాన్‌తో పాటు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని తెలిపారు. ఈ ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయం (రెండు నెలలు) పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆర్థోపెడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లనరీ డీమ్ ఆయనను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కేసీఆర్ ఆరోగ్యంపై క్రమం తప్పకుండా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా సీతక్క 
 
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒకరు సీతక్క. ములుగు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై ఆమె స్పందిస్తూ, తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ ములుగు నియోజకవర్గ ప్రజలకు మాత్రం సేవకురాలినేనని చెప్పారు. మంత్రి పదవి దక్కడ సంతోషంగా ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువ బాధ్యతలు పెట్టారని చెప్పారు. ప్రజలంతా ఆశించిన సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క తెలిపారు. 
 
2004 నుంచి 2011 వరకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ విధానాలను ఇపుడు కూడా అమలు చేస్తామని వివరించారు. సంక్షేమ పాలన అందించడంతో అన్ని వర్గాల మద్దతు తమకు కావాలని, అందరూ తమకు సహకరించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయని సీతక్క చెప్పారు. రోడ్డు రవాణా సమస్యలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో జనం పేదరికంలో మగ్గుతున్నారని ఆమె చెప్పారు. 
 
ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి గొప్పగా చూపించుకోవడం కాకుండా, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
సామాన్య ప్రజల ప్రవేశానికి తెరుచుకున్న తెలంగాణ ప్రగతి భవన్‌ ద్వారాలు 
 
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ప్రగతి భవన్ ఓ వెలుగు వెలిగింది. ఈ భవన్ సీఎం కేసీఆర్‌కు అధికారిక నివాసంగా ఉండేది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదు. ముందస్తుగా అనుమతి ఉంటేనే లోనికి అనుమతించేవారు. కానీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌లోకి ప్రతి సామాన్యుడికి కూడా ప్రవేశం కల్పిస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
ఆయన ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ వద్ద పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన భద్రతా ఆంక్షలను పూర్తిగా తొలగించారు. ప్రగతి భవన్ వద్ద పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను తొలగించాలని ఆదేశాలు వెల్లడంతో పోలీసులు ఆ విధంగా చర్యలు చేపట్టారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో జేసీబీలతో బ్యారికేడ్లను తొలగించారు. 
 
అంతేకాకుండా, ప్రగతి భవన్ ముందు ఉన్న బ్యారికేడ్స్‌ లోపలి నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. రెండు రోజుల్లో బ్యారికేడ్లను పూర్తిగా తొలగిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు, ప్రగతి భవన్ పేరును కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్‍‌గా మార్చిన విషయం తెల్సిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రగతి భవన్‌తో పాటు సచివాలయం తలుపులు సామాన్య ప్రజలకు కూడా ఎపుడూ తెరిచే ఉంటాయని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రొఫెసర్ కోదండరామ్!!