Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ... భైంసా, కామారెడ్డిలలో సభలు

నేడు రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ... భైంసా, కామారెడ్డిలలో సభలు
, శనివారం, 20 అక్టోబరు 2018 (14:32 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. రాహుల్‌, సోనియా సభలతో ప్రచారానికి, పార్టీ శ్రేణులకు మరింత ఊపు వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌ అందుకనుగుణంగా అవసరమైన కార్యాచరణ రూపొందించింది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కూడా ప్రచారానికి రానున్నారు. అయితే ఆమె సభలు రెండుకు మించి ఉండవని తెలుస్తోంది. దీంతో రాహుల్‌తోనే పదికిపైగా సభల నిర్వహణకు కాంగ్రెస్ నాయకులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత అగ్రనేత తొలి సభలు కావడంతో కాంగ్రెస్‌ నేతలు భైంసా, కామారెడ్డి సభలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. 
 
పూర్వపు అదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలను దృష్టిలో ఉంచుకుని ఈ సభలను ఏర్పాటు చేశారు. వీటిని విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలో ఈసారి అన్ని వర్గాల ఓట్లతో పాటు మైనార్టీల ఓట్లపై కాంగ్రెస్‌ గురిపెట్టింది. పలు నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లు కీలకం కావడంతో దీనికి అనుగుణంగా ప్రచార కార్యాచరణ రూపొందిస్తున్నారు. భైంసా, కామారెడ్డి బహిరంగసభల ఏర్పాటులో కాంగ్రెస్‌ ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. 
 
ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా.. 
తెరాస ప్రభుత్వ వైఫల్యాలతో పాటు తమ పార్టీ హామీలను రాహుల్‌ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో పాటుగా పార్టీ ముఖ్యనేతలు ముందుగా రాహుల్‌ను కలసి సభల్లో ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అంశాల గురించి వివరిస్తారు. తెరాస నెరవేర్చని హామీలను, ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు 12% రిజర్వేషన్ల అంశం, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, దళితులు, గిరిజనులకు భూ పంపిణీలో వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. వీటితోపాటుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపైనా అస్త్రాలను సంధించనున్నారు. 
 
ఈ నెలాఖరులోపే సోనియా సభలనూ నిర్వహించాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. సోనియా, రాహుల్‌ సభలు ఒకేరోజు నిర్వహించే అంశాన్ని కూడా కాంగ్రెస్‌ పరిశీలిస్తోంది. 
రాహుల్‌ ప్రచార సభల్లో కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి తర్వాత భైంసా, కామారెడ్డి సభలకు వెళ్లాల్సి ఉంది. అందులో కొంత మార్పు జరిగింది. రాహుల్‌ శనివారం ఉదయం 11.30 గంటలకు దిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు భైంసా వస్తారు. భైంసా బహిరంగ సభలో 12.30 నుంచి 1.30 గంటల వరకు పాల్గొంటారు. 
 
అనంతరం కామారెడ్డి చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహానగరంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి.. షేక్ హ్యాండ్, కౌగిలింత వద్దు