Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi Sarathkumar

డీవీ

, బుధవారం, 24 ఏప్రియల్ 2024 (17:34 IST)
Varalakshmi Sarathkumar
వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు.
 
'శబరి' ప్రయాణం ఎలా, ఎప్పుడు మొదలైంది?
'క్రాక్'కు సంతకం చేయడానికి ముందు 'శబరి' కథ విన్నా. నాకు బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. అయితే, షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశా. టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది. 
 
దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు... ఈ సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
లైఫే రిస్క్ అండీ. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. 'హనుమాన్' చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్ అయ్యింది. 'నాంది', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. 
 
నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు?
'శబరి' ప్రెస్‌మీట్‌ చూస్తే అందరూ నిర్మాత గురించి మాట్లాడారు. ఎందుకంటే... ఆయన జెన్యూన్ పర్సన్. ఎవరినీ చీట్ చేసే మెంటాలిటీ లేదు. అడగక ముందు పేమెంట్ వస్తుంది. బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమా పూర్తి చేశారు.
 
గణేష్ వెంకట్రామన్ సినిమాలో మీకు అపోజిట్ క్యారెక్టర్ చేశారా? మీ మధ్య యాక్షన్ సీన్లు ఉన్నాయా?
సినిమాలో చూడండి. స్క్రీన్ ప్లే డ్రివెన్ సినిమా 'శబరి'. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. 
 
హీరోతో ప్యారలల్ రోల్స్ చేస్తున్నారు. తల్లి పాత్ర అంటే ఎలా ఫీలయ్యారు?
నా తొలి సినిమా 'పొడా పొడి'లో మదర్ రోల్ చేశా. 'పందెం కోడి 2'లో చేశా. నేను ఓ యాక్టర్. నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్ వంటివి పట్టించుకోను. సినిమాలో ప్రేక్షకులకు ఏం చూపిస్తే అది యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు. 
 
'శబరి' సినిమాలో మీ రోల్ ఏమిటి? ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్?
యాంగ్రీ యంగ్ లేడీ కాదు. ఓ సాధారణ అమ్మాయి. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. ఆమెకు ఏమైంది? అనేది కథ. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం వచ్చింది. మదర్ అండ్ డాటర్ కనెక్షన్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. 
 
మెయిన్ లీడ్ చేసేటప్పుడు ప్రెజర్ ఏమైనా ఉంటుందా?
హిట్టూ ఫ్లాపులు నా చేతుల్లో లేవు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. ప్రేక్షకులు నచ్చే విధమైన నటన ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఆమె పెర్ఫార్మన్స్ బాలేదని అనుకోకూడదు.
 
మీ సినిమాల గురించి కాబోయే భర్త నికోలయ్ ఏం చెబుతారు?
బాలేదంటే బాలేదని చెబుతారు. బావుందంటే బావుందని చెబుతారు. ఆయనకు బాలేదని చెప్పే అవకాశం లేదు (నవ్వులు). ఇప్పటి వరకు బావుందని చెప్పారు.
 
పెళ్లి ఎప్పుడు? 
ఈ ఏడాది ఉంటుంది. 
 
నెక్స్ట్ సినిమాలు?
'కూర్మ నాయకి' సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో ధనుష్ గారి సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్ గారి 'మ్యాక్స్' చేశా. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యాక ఆ వివరాలు చెబుతా. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్