Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మా తెలుగు తల్లి'కి గేయరచయిత శంకరంబాడి సుందరాచారి పుట్టినరోజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచించిన శంకరంబాడి సుందరాచారి పుట్టినరోజు నేడు. సుందరాచారి 1914 ఆగస్ట్ 10వ తేదీన తిరుపతిలో జన్మించాడు. మాతృభాష తమిళం అయినప్పటికీ తెల

'మా తెలుగు తల్లి'కి గేయరచయిత శంకరంబాడి సుందరాచారి పుట్టినరోజు
, శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచించిన శంకరంబాడి సుందరాచారి పుట్టినరోజు నేడు. సుందరాచారి 1914 ఆగస్ట్ 10వ తేదీన తిరుపతిలో జన్మించాడు. మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగుపై ఎంతో మక్కువ చూపేవాడు. మదనపల్లెలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్ననాటి నుండే స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణునిగా సంధ్యావందనం చేయడం అతనికి ఇష్టం లేదు. అందుకు తండ్రి మందలించగా జంధ్యం తెంపివేసాడు. తండ్రిపై కోపంతో పంతానికి పోయి, ఇళ్లు వదలి వెళ్లిపోయాడు.
 
పొట్టకూటి కోసం ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటల్‌లో సర్వరుగా పని చేసాడు. రైల్వేస్టేషన్‌లో కూలీగా మారాడు. చివరకు పని కోసం మద్రాసు వెళ్లి ఆంధ్ర పత్రికలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ పని చేస్తుండగా ఒక ప్రముఖునిపై వ్యాసం రాయవలసి వచ్చినప్పుడు, తాను వ్యక్తులపై వ్యాసాలు రాయనని భీష్మించుకుని ఉద్యోగానికి రాజీనామా చేసాడు. అటు పిమ్మట విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా చేరారు. నందనూరులో ఉండగా పాఠశాల సంచాలకుడు అతడిని బంట్రోతుగా పొరబడటంతో కోపగించిన ఆయన ఆ ఉద్యోగానికీ రాజీనామా చేసాడు. 
 
వేదామ్మాళ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా వేదన చెంది, జీవిత చరమాంకంలో తాగుడుకు బానిసయ్యాడు. శంకరంబాడి సుందరాచారి గొప్పకవి. ఆయన పద్యాలు ఎక్కువ భాగం తేటగీతి ఛందస్సులోనే ఉంటాయి. ఎందుకంటే తేటగీతి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. మా తెలుగుతల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలోనే వ్రాసారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని నాలుగు పద్యాలలో రమ్యంగా రచించాడు. ప్రఖ్యాత గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.
 
మహాత్మాగాంధీ మరణానికి కలత చెంది బలిదానం అనే కావ్యాన్ని వ్రాసాడు. సుందర రామాయణం పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం రచించాడు. తిరుమల వెంకటేశ్వరుని పేరుతో శ్రీనివాస శతకం వ్రాసాడు. రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించాడు. అలాగే అనేక భావ గీతాలు, స్థల పురాణాలు, జానపద గీతాలు, ఖండకావ్యాలు, గ్రంథాలు రచించాడు. 
 
జీవితం చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితాన్ని గడిపాడు. త్రాగుడుకు అలవాటు పడి చివరకు తిరుపతిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే 1977 ఏప్రిల్ 8వ తేదీన మరణించాడు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి-తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్థం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. అలా శంకరంబాడి శకం ముగిసినప్పటికీ ఆయన చేసిన రచనలు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింత గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు...