Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీతమ్మ పాదాలను రామయ్య తాకి ప్రణయ కోపాన్ని తీర్చాడా?

మన తెలుగు సాహిత్యంలో ప్రబంధాలకు ప్రత్యేక స్థానముంది. ప్రబంధ రచనలు సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా సరళ శైలిలో రచించబడటంతో వాటికి సాహిత్యంలో మంచి ఆదరణ లభించింది. అలాంటి ప్రబంధ శైలి కవిత్రయము నుంచే ప్రా

సీతమ్మ పాదాలను రామయ్య తాకి ప్రణయ కోపాన్ని తీర్చాడా?
, మంగళవారం, 15 నవంబరు 2016 (17:56 IST)
మన తెలుగు సాహిత్యంలో ప్రబంధాలకు ప్రత్యేక స్థానముంది. ప్రబంధ రచనలు సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా సరళ శైలిలో రచించబడటంతో వాటికి సాహిత్యంలో మంచి ఆదరణ లభించింది. అలాంటి ప్రబంధ శైలి కవిత్రయము నుంచే ప్రారంభమైంది. నన్నయ, తిక్కన, ఎర్రనల రచనల్లోనే ప్రబంధ శైలి ఉట్టిపడిందని సాహితీవేత్తలు పలు సందర్భాల్లో ఆధారాలతో సైతం నిరూపించివున్నారు. 
 
నన్నయ భారతాంధ్రీకరణలో ప్రబంధ శైలి.. వర్ణనలు ఎక్కువగా ఉన్నాయి. భారతంలో నన్నయ్య రచనా విధానంలో ప్రబంధ లక్షణాలు కనిపించాయని సాహితీ వేత్తలు చెప్తున్నారు. ఇందులో భాగంగా సముద్ర వర్ణన, రెండో ఆశ్వాసమున 16వ చిన్న వచనమున పరీక్షిత్తు మహారాజు చేసిన మృగయా విహారము సంగ్రహముగా వర్ణించబడివుంది. అలాగే ఉపరిచరవసు వృత్తాంతమునందు అతని భార్య అయిన గిరికా వర్ణనను నన్నయ్య లలిత పదములతో హృద్యముగా చేశారు. ఇలా నన్నయ్య భారతాంధ్రీకరణలో ప్రబంధాలు-వాటి వర్ణనలు అక్కడక్కడ కనిపించాయి. అలాగే తిక్కన భారతంలోనూ ముఖ్యంగా విరాటపర్వము నందు ప్రబంధ కావ్య వర్ణనలు కొన్నింటిని అద్భుతంగా సందర్భాను సారంగా మనోహరంగా రచించారు. 
 
ఇక తిక్కన నిర్వచనోత్తర రామాయణములో ప్రబంధ వర్ణనలు పుష్కలంగా కనిపించాయి. కావ్య వర్ణనలు కూడా కానవచ్చాయి. తిక్కన రామాయణ చతుర్థాశ్వాసము నందు రావణ కుంభకర్ణ విభీషణుల వివాహములు, మేఘనాధుని జననమును అద్భుతంగా చెప్పారు. ఇందులోనే దౌత్యము, యుద్ధము కూడా చక్కగా వర్ణించడం జరిగింది. 
 
తిక్కన రచనలో కావ్య వర్ణన, కావ్యమైన ప్రబంధ శైలి అక్కడక్కడ ఉట్టిపడింది. షష్ఠాశ్వాసమున కైలాసగిరి వర్ణనను నాలుగు పద్యాలలో చెప్పారు. దీంతో పాటు పాయంకాల, అంధకార, చంద్రోదయ, చంద్రికా వర్ణనలు ప్రత్యేకముగా కనిపిస్తాయి. ఇక ముఖ్యంగా అష్టమాశ్వాసములో సీతారాముల వినోద విహారముల గురించి తిక్కన అద్భుతంగా రచించారు. 
 
తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో సీతారాముల వినోద విహారములు  (18-26), ఉద్యానవన విహారము (24-43), జల విహారము (44-66), లీలా విహారము (66-81), సీతాదేవి గర్భచిహ్నములు (పద్యము 86) వంటివన్నీ సుమారు 70 పద్యాలు దీర్ఘముగా ప్రబంధ మార్గాన వర్ణించబడినాయి. 
 
అలాగే రాముడు సీతతో రమణీయస్థలములను విహరించడం, పన్నిదమాడటం, పువ్వుల వేట, కలప గంధాదులతో సీతను అలంకరించడం, పాదములను తాకి ప్రణయకోపాన్ని తీర్చడం వంటివి రాముని వినోద విహారమునందు అద్భుతంగా వర్ణించబడి వున్నాయి.

ఇంకా రాముడు సీతపై నీరుగుప్పించడం, తామరలతో అనేక విధములుగా అలంకరించుకోవడం వంటివి జలవిహారమునందు తిక్కన వర్ణించారు. ఇక సీత గర్భలక్షణములు ప్రబంధ పద్ధతిన వర్ణించబడినది. ఇవి కవిబ్రహ్మ తిక్కన, రామాయణములో చేసిన అద్భుత వర్ణనలు. భారతములో యుద్ధ వర్ణనల్లోనూ తిక్కన ప్రబంధ వర్ణనలను చొప్పించారు. 
 
ఇకపోతే.. ఎర్రన తన భారతంతో పాటు నృసింహపురాణములోనూ ప్రబంధ శైలిని, వర్ణనలను అక్కడక్కడ పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా భారతములో అరణ్యపర్వము చతుర్ధాశ్వాసములో నన్నయ శరద్వర్ణన చేస్తూ విరమించెను. ఎర్రన ఈ శరద్వర్ణనను (143-147) ఐదు పద్యాలతో పొడిగించి ముగించారు. పంచమాశ్వాసములో అగ్నిదేవుడు మునిపత్నుల అందమును గాంచి అనురక్తుడవుట, విరహవేదనకు గురవడం, స్వాహాదేవియే వారిలో నలుగురి రూపములను దాల్చి అతనిని సంతోషపెట్టుట వంటివి (పద్య. 195-202) ఉన్నాయి.

ఇందులో మునిపత్నుల సౌందర్యము, అగ్నిదేవుని అనురాగము, విరహమును వర్ణించబడింది. దుర్యోధనుని ఘోషయాత్రలో జరిగిన వేట (ప.379)ను ఇందు సంగ్రహముగా వర్ణించబడింది. ఇలా కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎర్రన రచనల్లో ప్రబంధ వర్ణనలు, ప్రబంధ లక్షణాలు ఉట్టిపడినాయి.
 
- ప్రబంధ వాజ్మయ వికాసము

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్సీ లుక్స్... అమ్మాయిలను బుట్టలో వేసుకోవాలంటే అది పెట్టుకుంటే సరి...